చంద్రబాబు ఓదార్పు యాత్ర
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు
చంద్రబాబు నాయుడు మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. జిల్లాల్లో చనిపోయిన
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాల్ని కలుసుకుని పరామర్శించారు. తాడిపత్రి
లోని వీరాపురం గ్రామంలో భాస్కరరెడ్డి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. భాస్కరరెడ్డి
మృతికి పరహారంగా చంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని వారికి అందించారు. అనంతరం
ఏర్పాటైన సభలో ప్రసంగిస్తూ వై.ఎస్.ఆర్.సి పార్టీపై నిప్పులు చెరిగారు. ఆరుగురు తెలుగుదేశం
కార్యకర్తల్ని వై.ఎస్.ఆర్.సి.పి. కి చెందిన వారు దారుణంగా హత్య చేశారని
ఆరోపించారు. డీజీపీ గౌతమ్ సావంగ్ ను కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు.
ఇదేనా జగన్ అందిస్తున్న ఉత్తమ పాలన అని చంద్రబాబు నిలదీశారు. వై.ఎస్.ఆర్.సి.పి. దుందుడుకు
పోకడలకు పోతోందని అది మంచిది కాదని చెప్పారు. ఆ పార్టీ వారి ఆగడాలు శ్రుతి
మించుతున్నాయని తెలుగుదేశం పార్టీ చూస్తూ ఉరుకోబోదని హెచ్చరించారు. సీఎం జగన్ సత్పరిపాలన
అందించడానికి ఆరునెలల గడువు అడిగారు..వేచి చూస్తున్నాం.. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నాం..
అని చంద్రబాబు గుర్తు చేశారు. జగన్ సీఎం అయ్యాక 40 రోజుల్లో ఉత్తమ పాలన మాట అటుంచి
ఆ పార్టీ కార్యకర్తల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయన్నారు. తక్షణం వై.ఎస్.ఆర్.సి.పి.
శ్రేణుల్ని అదుపులో పెట్టుకోవాలని సీఎం జగన్ కు చంద్రబాబు తేల్చిచెప్పారు.