జట్టుగా రాణించి సఫారీలపై గెలిచిన పాకిస్థాన్
ఇంటా బయట విమర్శల జడివానలో తడిసిముద్దయిన పాకిస్థాన్ బుద్ధి
తెచ్చుకుని జట్టుగా రాణించి దక్షిణాఫ్రికాపై ఘన విజయాన్ని సాధించింది. వరల్డ్ కప్-12 లండన్
లార్డ్స్ మైదానంలో ఆదివారం మ్యాచ్ నం.30లో దక్షిణాఫ్రికా జట్టుపై 49 పరుగుల తేడాతో
విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 7
వికెట్లు నష్టపోయి 308 పరుగుల భారీ స్కోరు సాధించింది. తప్పనిసరిగా గెలవాల్సిన
మ్యాచ్ లో సఫారీలు చతికిలబడి టోర్నీ నుంచే నిష్క్రమించారు. 2003 తర్వాత ద.ఆఫ్రికా
నాకౌట్ దశకు చేరలేకపోవడం ఇదే తొలిసారి. 309 పరుగుల లక్ష్య ఛేదనకు ఇన్నింగ్స్
ప్రారంభించిన సఫారీలకు ఓపెనర్ హషీమ్ అమ్లా(2) త్వరగా అవుటవ్వడంతో తొలి దెబ్బ తగిలింది.
మరో ఓపెనర్ కీపర్ బ్యాట్స్ మన్ క్వింటన్ డీకాక్(47), కెప్టెన్ వన్డౌన్ బ్యాటర్
ఫాఫ్ డుప్లెసిస్(63), రాసీవాన్డెర్ డస్సన్(36), అండైల్ ఫెహ్లుక్వాయొ(46) మాత్రమే
రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 259 పరుగులు మాత్రమే
చేయగల్గింది. పాక్ బౌలర్లలో వహాబ్ రియాజ్, షాదబ్ ఖాన్ చెరో 3 వికెట్లు, స్టార్
పేసర్ మహ్మద్ అమిర్ 2 వికెట్లు, షాహీన్ అఫ్రిది 1 వికెట్ తీసుకున్నారు. తొలుత
బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టులో ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్, ఫకర్ జమాన్ చెరో 44
పరుగులు చేశారు. తొలి వికెట్ కు 14.5 ఓవర్లలో 81 పరుగులు జోడించారు. ఫకర్ జమాన్
తర్వాత రెండో వికెట్ గా ఇమామ్ ఉల్ హక్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మూడో నెంబర్
బ్యాటర్ బాబర్ అజం(69), మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హరిస్ సోహాయిల్(89) జట్టు భారీ
స్కోరుకు తోడ్పడ్డారు. సఫారీల స్టార్ స్ట్రయిక్ బౌలర్ కగిసొ రబాడ ఈ మ్యాచ్ లోనూ
నిరాశ పరిచాడు. 65 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. మరో వైపు నిగిడి
64 పరుగులచ్చినా 3 వికెట్లు తీశాడు. టాప్ స్పినర్ ఇమ్రాన్ తాహిర్ 41 పరుగులకు 2
వికెట్లు పడగొట్టాడు. క్వాయో, మార్క్రమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో
పాక్ సెమీస్ అవకాశాల మాటెలా ఉన్నా స్వదేశానికి సురక్షితంగా ఆ జట్టు ఆటగాళ్లు
చేరుకోవడానికి మార్గం సుగమం కానుంది.