ప్రధాని
సారథ్యంలోని అఖిల పక్ష సమావేశానికి మమతా డుమ్మా!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని అఖిల పక్ష
అధినేతల సమావేశానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకానని తేల్చి
చెప్పారు. బుధవారం జరుగనున్న ఈ సమావేశానికి ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన
పార్టీల అధినేతలకు ఆహ్వానాలు అందాయి. అయితే ముందుగా నిర్ణయమైన కార్యక్రమాల్లో
పాల్గొనాల్సి ఉన్నందున తను ఈ సమావేశానికి హాజరుకాబోవడం లేదని మమతా మంగళవారం
తెలిపారు. జూన్ 15న జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం మమతా హాజరుకాని సంగతి
తెలిసిందే. `ఒకే దేశం.. ఒకే ఎన్నికలు` అనే అంశంపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని
కేంద్రానికి సూచించారు. ఈ విషయమై విస్తృత స్థాయిలో సమాలోచనలు జరగాలని కోరారు. దేశమంతా
ఒకేసారి ఎన్నికలు అంటూ హడావుడిగా నిర్ణయం తీసుకుని అమలుచేసే అంశం కాదని పార్లమెంటరీ
వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. తగినంత వ్యవధి తీసుకుని
అన్ని రాజకీయ పార్టీలతో విస్తృత చర్చలు జరిగాకే ఓ నిర్ణయానికి రావాల్సి
ఉంటుందన్నారు. చాలా ముఖ్యమైన విషయమైనందున కూలంకుషంగా ఆలోచించాకే నిర్మాణాత్మక
సూచనల్ని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చేస్తుందన్నారు. 2022లో జరుగనున్న దేశ 75వ
స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో, ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల్లో
టీఎంసీ హృదయపూర్వకంగా పాల్గొంటుందని మమతా తెలిపారు.