Tuesday, June 18, 2019

UP govt to now issue press releases in Sanskrit also


సంస్కృత భాషను ప్రోత్సహించే చర్యలు చేపట్టిన యూపీ
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత పురాతన భాషయిన సంస్కృతాన్ని ప్రోత్సహించేందుకు కంకణం కట్టుకుంది. ప్రభుత్వ ప్రకటనల్ని హిందీ, ఇంగ్లిష్, ఉర్దూతో పాటు ఇకపై సంస్కృతంలో కూడా ఇవ్వాలని మంగళవారం నిర్ణయించింది. ఇప్పటికే ఆరాష్ట్ర సమాచార శాఖ జూన్17 సోమవారం సంస్కృతంలో తొలి పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ప్రజలకు అందించే ముఖ్యమైన ప్రభుత్వ సమాచారం, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగాలను సంస్కృతంలో కూడా విడుదల చేయనున్నట్లు సమాచార శాఖ అధికారులు పేర్కొన్నారు. లక్నో లోని రాష్ట్రీయ సాంస్క్రీట్ సంస్థాన్ సీఎం ప్రసంగాల్ని సంస్కృతంలో తర్జుమా చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం యోగి ప్రసంగాన్ని సంస్కృతంలోనూ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందుకు పెద్ద ఎత్తున ప్రశంసలు లభించిన మీదట ఇప్పుడు అదే ఒరవడిని రాష్ట్రంలోనూ కొనసాగించాలని భావిస్తున్నామని అధికారులు తెలిపారు. సంస్కృతం భారతీయుల డీఎన్ఏ..అయితే ఆ భాషను కేవలం పండితులకే పరిమితం చేశామని ముఖ్యమంత్రి యోగి సోమవారం ఓ సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. యూపీలో ఇప్పటికే సంస్కృత భాష పునర్జీవానికి కృషి కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో 25 పత్రికా సంచికలు (పిరియాడికల్స్) సంస్కృతంలొనే వెలువడుతుండడం విశేషం. ప్రపంచంలోని సుమారు 850 భాషల పుట్టుకకు మాతృక గానో, ప్రేరణ గానో సంస్కృతం నిలవడం దేశం గర్వించదగ్గ పరిణామం. రాజభాషగా శతాబ్దాల పాటు వర్ధిల్లిన సంస్కృతం భారత్ కు ఎనలేని కీర్తిని తెచ్చిందనడంలో సందేహం లేదు.

No comments:

Post a Comment