Monday, June 17, 2019

Kejriwal seeks action against cops for thrashing driver


తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి:కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీలోని ముజఫర్ నగర్ లో ఆదివారం పోలీసులకు టెంపో డ్రైవర్ కు మధ్య జరిగిన ఘర్షణపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. పోలీసుల దాడిలో గాయపడిన బాధిత టెంపో డ్రైవర్ కుటుంబ సభ్యుల్ని సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితికి ఆదివారం నాటి ఘటన అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో నేరాల శాతం పెరిగిపోతోందన్నారు. శాంతిభద్రతల అంశంపై కేంద్రహోం మంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ దృష్టి సారించాలన్నారు. ఈ ఘటనలో తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు టెంపో డ్రైవర్ కు తొలుత వాగ్వాదం చోటు చేసుకుంది. సీనియర్ ఆఫీసర్ తో కూడిన పోలీసు బృందం టెంపో డ్రైవర్ తలపాగాను తీసివేయడానికి యత్నిస్తూ దాడికి పాల్పడ్డారు. దాంతో అతను పొడవాటి కత్తితో వారిపై ఎదురుదాడికి దిగాడు. రోడ్డుపై పోలీసుల్ని ఆ టెంపో డ్రైవర్ కత్తి చేత పట్టుకుని తరుముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోపోద్రిక్తులైన ఆ వర్గానికి చెందిన వారు పోలీసుల అనాగరిక వైఖరిపై ఆందోళన చేపట్టారు. ఈ పరిణామాలు తీవ్రరూపం దాల్చకుండా చక్కదిద్దాలని సీఎం కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విధి నిర్వహణలో దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురు పోలీసుల్ని సస్పెండ్ చేసినట్లు ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మొత్తం ఘటనపై ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులతో దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ ఘటన అప్పుడే రాజకీయ రంగు పులుముకుంటోంది. రాజౌరి గార్డెన్ బీజేపీ ఎమ్మెల్యే మణిందర్ సింగ్ శిర్సా మాట్లాడుతూ పోలీసులే తొలుత టెంపో డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అతని మత సంప్రదాయానికి విఘాతం కల్గించారన్నారు.

No comments:

Post a Comment