Monday, June 17, 2019

JP Nadda appointed bjp`s irst working president:PM calls him humble and affable


బీజేపీ తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన జేపీనడ్డా
భారతీయ జనతా పార్టీ తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యులైన జగత్ ప్రకాశ్ నడ్డా(జేపీనడ్డా) ఎంపికయ్యారు. సోమవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమై ఈ మేరకు నడ్డాను ఎంపిక చేసింది. ఆయన బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి కేంద్రమంత్రి పదవి పొందారు. గత మోదీ ప్రభుత్వంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ ప్రేమ్ కుమార్ దుమాల్(బీజేపీ) ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించిన అనుభవం ఉంది. 59ఏళ్ల నడ్డా హిమాచల్ ప్రదేశ్ లో డాక్టర్ నారాయణ్ లాల్ నడ్డా, శ్రీమతి కృష్ణ నడ్డా దంపతులకు జన్మించారు. పట్నా యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి చదివారు. 1993లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికయ్యారు. 2014 నుంచి రాజ్య సభ సభ్యులుగా ఉన్నారు. ఆయనకు భార్య మల్లికా నడ్డా, ఇద్దరు పిల్లలున్నారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికయిన నడ్డాను ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభినందించారు. అమిత్ షా ప్రస్తుతం హోంమంత్రిగా కూడా వ్యవహరిస్తున్నందున పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని ఆయనతో కలిసి నడ్డా పంచుకోనున్నారు. త్వరలో జరుగనున్న పార్టీ కార్యనిర్వాహక వర్గ ఎన్నికల అనంతరం పూర్తిగా అధ్యక్ష బాధ్యతలు నడ్డాయే చేపడతారా లేదా కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందో తేలుతుంది. బీజేపీ అధ్యక్షుడిగా రెండేళ్లకోసారి కొత్త నేత ఎన్నిక జరుగుతుంది. అయితే ఈసారి కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్షుణ్నిఎంపిక చేయడంతో అమిత్ షాయే అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశమూ ఉంది. పార్టీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంత్యుత్సవాల సందర్భంగా జులై 6 నుంచి బీజేపీ విస్తృత స్థాయి సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని పార్టీ పెద్దఎత్తున చేపట్టనున్న క్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జె.పి.నడ్డా కీలక పాత్ర పోషించనున్నారు.


No comments:

Post a Comment