యూపీ సీఎం పరువుకు నష్టం కల్గించారనే ఆరోపణలపై
ముగ్గురు జర్నలిస్టుల అరెస్ట్:ఖండించిన ఎడిటర్స్ గిల్డ్
ఉత్తరప్రదేశ్
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై అభ్యంతరకర వార్తలను ప్రసారం చేశారంటూ
జర్నలిస్టుల్ని అరెస్ట్ చేయడాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఖండించింది. ఓ మహిళ యూపీ సీఎంను
వివాహం చేసుకోవాలనుకుంటోందంటూ ప్రఖ్యాత జర్నలిస్ట్ కనొజియా ఓ వీడియోను ట్విటర్ లో
షేర్ చేశారు. దాంతో ఆయనను లక్నోలో శనివారం (జూన్8) యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ
వీడియోను నోయిడాలోని ఓ జాతీయ టీవీ చానల్ ప్రసారం చేసింది. ఈ ప్రసారానికి ఇషాంత్
సింగ్, అనుజ్ శుక్లా బాధ్యులుగా గుర్తించి వారిద్దర్ని ఆదివారం అరెస్ట్ చేశారు. ఆ
చానల్ కు ప్రసారాల లైసెన్స్ కూడా లేదని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు
జర్నలిస్టులు సీఎం ఆదిత్యనాథ్ పరువుకు భంగం కల్గించేలా వార్తలను ప్రసారం
చేసినందుకు గాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తొలుత ఆ మహిళ లక్నోలోని
సీఎం కార్యాలయం బయట విలేకర్లతో మాట్లాడుతూ ఆదిత్యనాథ్ తో తనకు సంబంధముందని ఆయనను పెళ్లి
చేసుకోవాలనుంటున్నట్లు పేర్కొంది. ఆ వీడియో తర్వాత ట్విటర్, ఫేస్ బుక్ వంటి సోషల్
మీడియాలో వైరల్ అయింది. జర్నలిస్టుల్ని నిర్హేతుకంగా ఏకపక్షంగా అరెస్టు చేశారని
ఇది న్యాయవిరుద్ధమంటూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది. పోలీసుల
చర్యను ఖండిస్తూ గిల్డ్ పత్రికా స్వేచ్ఛను హరించారని విలేకర్లను భయభ్రాంతులకు గురి
చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ఓ మహిళ మనోభావనను నిష్పక్షపాతంగా
ప్రసారం చేయడం, సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడం సీఎం పరువుకు భంగం కల్గించే
నేరానికి పాల్పడినట్లుగా ఎలా భావిస్తారని ప్రశ్నించింది. కర్ణాటకలోనూ ఇటీవల ఇదే
తరహాలో పోలీసులు వ్యవహరించారని తప్పుబట్టింది. ప్రాథమిక దర్యాప్తు
నివేదిక(ఎఫ్.ఐ.ఆర్) సైతం లేకుండా సుమోటాగా పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొంది.
ఈ చర్య అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టాన్ని దుర్వినియోగం చేయడంగా
అభివర్ణించింది. పరువునష్టం కేసుల్ని నేరపూరిత కేసుల జాబితా నుంచి తొలగించాలన్న
డిమాండ్ ను ఎడిటర్స్ గిల్డ్ పునరుద్ఘాటించింది. భారత శిక్షాస్మృతి(ఐ.పి.సి)లోని ఐ.టి.చట్టం
సెక్షన్ 66 ప్రకారం నేరపూరిత కేసుగా పరువునష్టం కేసుని చొప్పించారంది.
ఉద్దేశపూర్వకంగా, ప్రతీకారేచ్ఛతో జర్నలిస్టులపై నేరపూరిత పరువునష్టం కేసులు
పెడుతున్నారని విమర్శించింది.