Monday, June 3, 2019

women welcome free metro bus rides in delhi



ఢిల్లీ మహిళలకు సీఎం కేజ్రీవాల్ ఉచిత కానుక
దేశ రాజధాని ఢిల్లీలోని మహిళలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బహుమతి ప్రకటించారు. ఢిల్లీ మెట్రో సహా, అన్ని తరహా బస్ ల్లో(ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ - డీటీసీ) మహిళలు టికెట్ కొనకుండా ఉచితంగా ప్రయాణించొచ్చు. రానున్న కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు రేపుతోంది. అన్ని వర్గాల మహిళల్ని ఆకర్షించే ఈ ప్రకటనను ఢిల్లీ సీఎం సోమవారం(జూన్3) విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. ఇందుకు గాను రూ.1600 కోట్ల భారం పడుతుంది. ఈ మొత్తంలో రూ.700 కోట్ల భారాన్ని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఢిల్లీ మెట్రో రైళ్లలో రోజూ సుమారు 25 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మెట్రో-III ప్రాజెక్టు కూడా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య 40 లక్షలకు చేరుకుంటుందని అంచనా. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ఢిల్లీ మెట్రో టికెట్ల రేట్లు పెరగకుండా ఉంచడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రేట్ల పెంపుపై తమ అభ్యంతరాల్ని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం తాము తీసుకున్న నిర్ణయం మహిళా భద్రతకు పెట్టిన పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు. చదువుకునే విద్యార్థినులు, ఉద్యోగినులు, వివిధ వృత్తుల్లో ఉన్న మహిళలు అందరికీ ఢిల్లీ రవాణా సాధానాల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా అన్నిరంగాల్లో మహిళల ముందంజకు బాటలు వేయనున్నామని కేజ్రీవాల్ చెప్పారు. అయితే టికెట్ కొనే ప్రయాణించాలనుకునే మహిళలు ఆవిధంగా వెళ్లడానికి అభ్యంతరం లేదు.

IAF aircraft with 13 people on board goes missing



అదృశ్యమైన భారత వాయుసేన విమానం
భారత వైమానికి దళానికి చెందిన ఓ రవాణా విమానం జాడ తెలియకుండా పోయింది. సోమవారం(జూన్3) మధ్యాహ్నం 12.25 నిమిషాలకు గ్రౌండ్ కంట్రోల్ రూం తో ఈ విమానానికి సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. అసోం లోని జోర్హాట్ లో బయలుదేరిన 35 నిమిషాలకే విమానం ప్రమాదానికి గురైనట్లు భావిస్తున్నారు. ఈ ఏఎన్-32 యుద్ధ విమానం అరుణాచల్ ప్రదేశ్ లోని మెంచుకాకు ప్రయాణిస్తోంది. చైనా సరిహద్దుల్లోని ఈశాన్య పర్వతప్రాంతాల మీదుగా ప్రయాణిస్తుండగా ఈ విమానం నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. విమానంలో 8మంది సిబ్బందితో పాటు మరో అయిదురు ఇతరులు ప్రయాణిస్తున్నారు. అదృశ్యమైన విమానం జాడ కనుగొనేందుకు భారత వాయుసేన ప్రయత్నాలు ప్రారంభించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఈ విమానం జాడ కనుగొనడానికి ఐఏఎఫ్ సుఖోయ్ యుద్ధ విమానాల్నిరంగంలోకి దించింది. రక్షణ శాఖ నూతన మంత్రిగా గత వారమే బాధ్యతలు చేపట్టిన రాజ్ నాథ్ సింగ్ వాయుసేన అధికారులతో విమాన అదృశ్యం విషయమై మాట్లాడారు. విమానంలోని వారందరూ క్షేమంగా తిరిగిరావాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.


Sunday, June 2, 2019

bangladesh shocking victory against south Africa



వాహ్..బంగ్లాదేశ్.. అనూహ్యంగా ఓడిన ప్రొటీస్
12 వరల్డ్ కప్ లో సంచనాలు మొదలయ్యాయి. పసికూన స్థాయి నుంచి ఇటీవల ఎదిగిన బంగ్లాదేశ్ జట్టు మరోసారి సంచలనానికి నాంది పలికింది. తనకన్నా అత్యుత్తమమైన అతి పెద్ద జట్టు దక్షిణాఫ్రికాను కంగుతినిపించింది. ప్రొటీస్ తో ఆదివారం కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్ నం.5లో బంగ్లాదేశ్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని కనబర్చి చివరకు 21 పరుగుల తేడాతో విజయబావుటా ఎగురవేసింది. భారత ఉప ఖండం క్రికెట్ కీర్తి పతాకను రెపరెపలాడించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ టాస్ గెలిచి బంగ్లాను బ్యాటింగ్ కు దింపాడు. నిలకడైన ఆటతీరుతో నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 6వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. 331 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ప్రొటీస్ కెప్టెన్ డుప్లెసిస్ (62), మార్కరమ్(45), డుమిని(45), రాస్సే వాన్ డెర్ డస్సెన్(41), డేవిడ్ మిల్లర్(38) ఇలా జట్టులో అందరూ చెప్పకోదగ్గ స్కోరే చేశారు. ఒక్క ఆండిలే ఫెహ్లుక్వాయో(8)ఒక్కడు మాత్రమే రెండంకెల స్కోరు చేయలేకపోయాడు. అందరూ కొద్దొగొప్పో పరుగులు చేశారు గానీ చివరకు జట్టును విజయతీరాన నిలపలేకపోయారు. చివరికి 8 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. బంగ్లా పేసర్లలో ముస్తాఫిజర్ రెహమాన్ ధారాళంగా 67 పరుగులిచ్చినా మూడు వికెట్లను పడగొట్టాడు.  మహ్మద్ సైఫుద్దీన్ రెండు వికెట్లు తీశాడు. సైఫుద్దీన్ కూడా భారీగానే 57 పరుగులు ప్రత్యర్థికి సమర్పించుకున్నాడు. మెహిదీ హసన్, షకీబ్ అల్ హసన్ చెరో వికెట్ పడగొట్టి దక్షిణాఫ్రికాను ఓటమి పాల్జేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టులో మూడు,నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ కు దిగిన షకీబ్ అల్ హసన్(75), ముప్ఫికర్ రహేమ్(78)తో పాటుగా ఓపెనర్ సౌమ్య సర్కార్ (42) ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొని పరుగులు చేశారు. మహ్మదుల్లా(46), మెసద్దిక్ హుస్సేన్ (26) చివర్లో చెలరేగి ఆడ్డంతో జట్టు భారీ స్కోరు సాధించడమే కాకుండా మ్యాచ్ గెలుపునకు బాటలు పరిచింది. బ్యాటింగ్ లో 75 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్ లో ఓ వికెట్ తీసిన షకీబ్ అల్ హసన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

3 doctors held for colleague suicide sent to judicial custody



జూ.డా. ఆత్మహత్య కేసులో ముగ్గురు డాక్టర్లకు కటకటాలు
కులం పేరుతో వేధింపులకు పాల్పడి యువ వైద్యురాలి ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు మహిళా వైద్యుల్ని ముంబయిలోని ప్రత్యేక కోర్టు కటకటాల వెనక్కి నెట్టింది. 26 ఏళ్ల పాయల్ తద్వి అనే జూనియర్ డాక్టర్ ను డా.భక్తి మెహర్, డా.హేమా అహుజా, డా.అంకితా ఖండేల్వాల్ తరచు వేధించేవారు. ఈ నేపథ్యంలో పాయల్ భరించలేక మే22న తన హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయారు. వీరంతా బీవైఎల్ నాయర్ ఆసుపత్రిలోనే పనిచేస్తున్నారు. ఎస్టీ వర్గానికి చెందిన తద్వి రిజర్వేషన్ కోటాలో సీటు సంపాదించినట్లుగా ఈ ముగ్గురు సీనియర్ మహిళా వైద్యులు ఆమెను మానసికంగా వేధించేవారని తెలిసింది. నిందితులు ముగ్గురిపై ఎస్సీ,ఎస్టీ వర్గాలపై అకృత్యాల నివారణ చట్టం, యాంటీ ర్యాంగింగ్ చట్టం, ఐ.టి.చట్టం, ఆత్మహత్యకు ప్రేరేపించడం (సెక్షన్ 306) కింద కేసులు పెట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ స్థానిక పోలీసులకు కేసును అప్పగించొచ్చని వారి కస్టడీకి నిందితుల్ని ప్రశ్నించేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను అడిషనల్ సెషన్స్ జడ్జి ఆర్.ఎం.శద్రాణి తోసిపుచ్చారు. నిందితులకు జూన్ 10 వరకు జ్యూడిషియల్ కస్టడీ కొనసాగించాలని తీర్పిచ్చారు.