Sunday, June 2, 2019

bangladesh shocking victory against south Africa



వాహ్..బంగ్లాదేశ్.. అనూహ్యంగా ఓడిన ప్రొటీస్
12 వరల్డ్ కప్ లో సంచనాలు మొదలయ్యాయి. పసికూన స్థాయి నుంచి ఇటీవల ఎదిగిన బంగ్లాదేశ్ జట్టు మరోసారి సంచలనానికి నాంది పలికింది. తనకన్నా అత్యుత్తమమైన అతి పెద్ద జట్టు దక్షిణాఫ్రికాను కంగుతినిపించింది. ప్రొటీస్ తో ఆదివారం కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్ నం.5లో బంగ్లాదేశ్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని కనబర్చి చివరకు 21 పరుగుల తేడాతో విజయబావుటా ఎగురవేసింది. భారత ఉప ఖండం క్రికెట్ కీర్తి పతాకను రెపరెపలాడించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ టాస్ గెలిచి బంగ్లాను బ్యాటింగ్ కు దింపాడు. నిలకడైన ఆటతీరుతో నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 6వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. 331 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ప్రొటీస్ కెప్టెన్ డుప్లెసిస్ (62), మార్కరమ్(45), డుమిని(45), రాస్సే వాన్ డెర్ డస్సెన్(41), డేవిడ్ మిల్లర్(38) ఇలా జట్టులో అందరూ చెప్పకోదగ్గ స్కోరే చేశారు. ఒక్క ఆండిలే ఫెహ్లుక్వాయో(8)ఒక్కడు మాత్రమే రెండంకెల స్కోరు చేయలేకపోయాడు. అందరూ కొద్దొగొప్పో పరుగులు చేశారు గానీ చివరకు జట్టును విజయతీరాన నిలపలేకపోయారు. చివరికి 8 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. బంగ్లా పేసర్లలో ముస్తాఫిజర్ రెహమాన్ ధారాళంగా 67 పరుగులిచ్చినా మూడు వికెట్లను పడగొట్టాడు.  మహ్మద్ సైఫుద్దీన్ రెండు వికెట్లు తీశాడు. సైఫుద్దీన్ కూడా భారీగానే 57 పరుగులు ప్రత్యర్థికి సమర్పించుకున్నాడు. మెహిదీ హసన్, షకీబ్ అల్ హసన్ చెరో వికెట్ పడగొట్టి దక్షిణాఫ్రికాను ఓటమి పాల్జేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టులో మూడు,నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ కు దిగిన షకీబ్ అల్ హసన్(75), ముప్ఫికర్ రహేమ్(78)తో పాటుగా ఓపెనర్ సౌమ్య సర్కార్ (42) ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొని పరుగులు చేశారు. మహ్మదుల్లా(46), మెసద్దిక్ హుస్సేన్ (26) చివర్లో చెలరేగి ఆడ్డంతో జట్టు భారీ స్కోరు సాధించడమే కాకుండా మ్యాచ్ గెలుపునకు బాటలు పరిచింది. బ్యాటింగ్ లో 75 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్ లో ఓ వికెట్ తీసిన షకీబ్ అల్ హసన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

No comments:

Post a Comment