కొలంబో
చర్చిల్లో ఈ ఆదివారమూ ప్రార్థనల రద్దు
అంతర్జాతీయ
నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కొలంబో కేథలిక్ చర్చిల్లో వరుసగా రెండో ఆదివారం
ప్రార్థనలు రద్దు చేశారు. ఈ మేరకు శ్రీలంక
ప్రభుత్వ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. కొలంబో ఆర్చిబిషప్ మాల్కం రంజిత్
విలేకర్లతో మాట్లాడుతూ కొలంబో సహా పరిసర ప్రాంతాల్లోని అన్ని కేథలిక్
విద్యాసంస్థల్ని ఇంకా తెరవలేదని తెలిపారు. ఏప్రిల్ 21 ఈస్టర్ సండే వరుస బాంబు దాడుల
అనంతరం నెలకొన్న భయానక వాతావరణం దేశంలో ఇంకా కొనసాగుతోంది. మరోసారి ఇస్లామిక్
ఉగ్రవాదులు విరుచుకుపడే ప్రమాదముందని శ్రీలంక ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దేశంలో
హై అలర్ట్ కొనసాగుతోంది. పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్ని సోమవారం తెరవనున్నారు.
అయితే ప్రతి విద్యాసంస్థ వద్ద కనీసం ఒక సాయుధ పోలీసును కాపాలా ఉంచనున్నారు. ఈ
మేరకు శ్రీలంక విద్యా మంత్రిత్వ శాఖ భద్రత బలగాలకు ఆదేశాలచ్చింది. దేశంలో ఇంకా
చాలా ప్రాంతాల్లో పూర్తి భద్రతా వాతావరణం ఏర్పడలేదని భావిస్తున్నారు. అయితే అధికారంగా
దీనిపై వ్యాఖ్యానించడానికి నిఘా, భద్రత విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు నిరాకరించారు.