Friday, April 19, 2019

will priyanka go to contest in varanasi constituency against prime minister modi


ప్రియాంక వారణాసిలో ప్రధాని మోదీతో పోటీపడతారా?
2019 సార్వత్రిక ఎన్నికల వేడిలో అందర్నీ ఉత్కంఠకు గురి చేస్తున్న అంశం వారణాసి ఎన్నిక. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నారా లేదా అనే అంశమే రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. ప్రధాని మోదీ తొలిసారిగా లోక్ సభకు ఇక్కడ నుంచే బరిలో నిలిచి విజయం సాధించారు. నయా ఇందిరమ్మగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రియాంక వారణాసి నుంచి బరిలోకి దిగితే మాత్రం పోటీ మరింత రసవత్తరంగా మారడం ఖాయం. దిగ్గజం పై మరో దిగ్గజం పోటీ చేస్తున్న నియోజకవర్గం పైనే మొత్తం దేశం కళ్లు కేంద్రీకృతమౌతాయి. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని ప్రియాంక అంటుండగా అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్కంఠకు తెరదించడం లేదు. పైగా సస్పెన్స్ కొనసాగించడం తప్పేమీ కాదంటూ చలోక్తులు విసురుతున్నారు.
నెహ్రూ-గాంధీ వంశాంకురమైన ప్రియాంక ఇటీవలే పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు వరకు ఆమెది కేవలం ప్రచారకర్త పాత్రే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ (యూపీ) కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గాను వ్యవహరిస్తూ ఆమె పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. స్వయంగా ఆమె బరిలోకి దిగితే పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. మరోవైపు ప్రధాని మోదీ దేశంలో తిరుగులేని నాయకుడు. ఇందిరాగాంధీ తర్వాత అంతటి సమర్ధుడిగా పేరు. ముమ్ముర్తులా ఇందిరనే పోలిన ప్రియాంక పోటీకి దిగితే వీరిద్దరి ముఖాముఖి 2019 ఎన్నికల చిత్రానికి కొత్త రూపును తెస్తుంది. మోదీ, ప్రియాంకలు ఉభయులకూ అవినీతి అంశమే ప్రధాన ప్రచారాస్త్రం. తాజా ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే ఈ అంశంపై రెండుపార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.
రాఫెల్ ఒప్పందం గురించి ప్రియాంక ప్రస్తావిస్తే అక్కడ ఎన్నికల ప్రచారం మరింత సెగలు రేపుతుంది. రాబర్ట్ వాద్రా (డీఎల్ ఎఫ్ కేసు) భుజాల మీదుగా తుపాకీ ఎక్కుపెట్టి మరీ మోదీ ఆమెపై ఎదురుదాడికి దిగుతారు. ప్రచార సభల్లో, ఓటర్లను కలిసి మాట్లాడిన సందర్భాల్లో ఇందిరాగాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు వారి శైలే వేరు. వేదికలపై ప్రసంగించినప్పడు, జనంతో మమేకమైనప్పుడూ హుందాతనమే కనిపిస్తుంది. మాట, చేతల్లో సామాన్యుల్లో కలగలిసి పోతుంటారు. ప్రస్తుతం ప్రియాంక ప్రచార పర్వం అదే రీతిలో సాగుతోంది. ఇటీవల అలహాబాద్ నుంచి వారణాసికి గంగా(బోటు)యాత్రలో పర్యటించిన ప్రియాంక తన నాయనమ్మతో ఆనంద్ భవన్ (అలహాబాద్)లో గడిపిన మధుర స్మృతుల్ని గుర్తు చేసుకుని ఓటర్లలో సెంటిమెంట్ రగిలించారు. ముఖ్యంగా మోదీకి ప్రత్యామ్నాయం తామేనని తెల్పడమే ప్రధాన ఉద్దేశంగా ప్రియాంక పోటీ చేస్తున్నట్లు స్పష్టమౌతోంది.
 1952 నుంచి ఇంతవరకు ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్ అత్యధికంగా ఏడుసార్లు విజయం సాధించగా, భారతీయ జనతా పార్టీ ఆరుసార్లు, సీపీఎం, భారతీయ లోక్ దళ్, జనతాదళ్ ఒక్కోసారి  గెలిచాయి.  2014 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్(2,09,238 ఓట్లు)పై మోదీ(5,81,022 ఓట్లు) ఘన విజయం సాధించారు. ఆనాడు మోదీపై పోటీ చేయాలనే ఏకైక లక్ష్యంతో కేజ్రీవాల్ వారణాసి బరిలో నిలిచారు. ఈ సారి ఇక్కడ మే19న ఎన్నిక జరగనుంది.
దిగ్గజాలపై దిగ్గజాలు పోటీ పడిన సందర్భాలు గతంలోను తాజాగానూ కొనసాగుతున్నాయి. 1984లో గ్వాలియర్ నుంచి వాజ్ పేయి పై పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుడు మాధవరావు సింధియా విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో బళ్లారి నుంచి సుష్మాస్వరాజ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై పోటీ పడి ఓడిపోయారు. ప్రస్తుతం అమేథి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె రాహుల్ గాంధీ చేతిలో పరాజయం పాలయ్యారు.

Thursday, April 18, 2019

mumbai indians landslide victory against delhi capitals 2019 vivo ipl season12


ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ పై ముంబయి ఘన విజయం
సొంత మైదానంలోనే ఢిల్లీ కేపిటల్స్ ను ఓడించి ముంబయి ఇండియన్స్ కాలర్ ఎగరేసింది. 40 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ నం.34లో టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో ముంబయి 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. రోహిత్, డీకాక్ ల జోడీ దూకుడుగా ఆడ్డంతో 6.1 ఓవర్లలోనే ముంబయి 57 పరుగుల భాగస్వామ్యాన్ని అందుకుంది. రోహిత్(30) తో పాటు డీకాక్(37), కునాల్ పాండ్యా (37), హార్ధిక్ పాండ్యా(32) రాణించారు. చివరి మూడు ఓవర్లలో పాండ్యా సోదరులు చెలరేగిపోయి ఆడి 50 పరుగులు రాబట్టారు. దాంతో ముంబయి జట్టు మంచి లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచగలిగింది. టీ20ల్లో రోహిత్ 8 వేల పరుగుల మైలురాయిని దాటాడు. అనంతరం ఏదశ లోనూ ఢిల్లీ కేపిటల్స్ ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ను దీటుగా ఎదుర్కోలేకపోయింది. 9వికెట్లను కోల్పోయి 128 పరుగుల్ని మాత్రమే చేయగల్గింది. రాహుల్ చాహర్ 19 పరుగులిచ్చి 3 వికెట్లు, బుమ్రా 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ఢిల్లీని ఘోరంగా దెబ్బ తీశారు. పృద్వీ షా(20), ధావన్(35), అక్షర పటేల్(26) మాత్రమే రాణించారు. హార్ధిక్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. టోర్నీ తొలి మ్యాచ్ లోనే తమను ఓడించిన ఢిల్లీ కేపిటల్స్ పై ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. ముంబయికి ఇది వరుసగా రెండో విజయం కాగా పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత స్థానానికి చేరుకుంది. సీఎస్కే 14 పాయింట్లతో ఉండగా ఎం.ఐ 12 పాయింట్లు సాధించింది.

3 year old boy in coma after torture by mother said Kochi police

ఈమె తల్లేనా అసలు..
·    మూడేళ్ల కొడుకుని కొట్టి కోమాలోకి నెట్టింది
ఈమె తల్లేనా అసలు అనే అనుమానం ఈ ఘటన విన్నా,చూసిన ఎవరికైనా రాక మానదు. అంతటి అమానుషమైన అమానవీయ దుస్సంఘటన కొచిలో జరిగింది. బుధవారం జరిగిన ఘటన వివరాలు గురువారం (ఏప్రిల్18) వెలుగులోకి వచ్చాయి. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన మూడేళ్ల కొడుకుని ఓ తల్లి దుంగతో తలపై దారుణంగా కొట్టి గాయపరిచింది. మెదడులో అంతర్గతంగా రక్తస్రావం కావడంతో ఆ చిన్నారి కోమాలోకి వెళ్లిపోయాడు. అంతేగాక ఆ బాలుడ్ని తీవ్రంగా హింసించినట్లు కూడా శరీరంపై కాలిన గాయాలున్నాయి. స్పృహ లేని స్థితిలో ఉన్న బాలుడ్ని తండ్రి భుజానెత్తుకుని ఆసుపత్రికి తీసుకువచ్చాడు. టేబుల్ పైనుంచి పడి బాలుడు గాయపడినట్లు డాక్టర్లను నమ్మించాలని కట్టుకథలు చెప్పాడు. విశ్వసించని వైద్యులు పోలీసులకు సమాచారమివ్వడంతో ఈ దారుణం వెల్లడయింది. బాలుడి మెదడుకు శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నారు. చిన్నారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిసింది.

ivanka trump Says father offered her world bank job but she passed


వరల్డ్ బ్యాంక్ చీఫ్ పదవి వద్దన్న ఇవాంక

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ తండ్రి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు.  ప్రెసిడెంట్ సీనియర్ అడ్వయిజర్ గా వ్యవహరిస్తున్న ఆమెను ప్రపంచ బ్యాంక్ చీఫ్ బాధ్యతల్నీ తీసుకోవాల్సిందిగా ట్రంప్ కోరారు. అయితే ఇవాంక తనకు ఇష్టమైన పనే చేస్తానని.. శ్రామిక, మహిళా సాధికారత రంగాలలో సేవల పట్ల మక్కువని పేర్కొన్నారు. నాలుగు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా చివరి రోజు బుధవారం (ఏప్రిల్17) ఇథోయోఫియా, ఐవరీకోస్ట్ ల్లో ఇవాంక పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేటెడ్ ప్రెస్ తో ఆమె మాట్లాడుతూ పై విషయాన్ని తెలిపారు. త్వరలో ట్రంప్ కూడా ఇక్కడ పర్యటనకు వస్తారన్నారు. ఆఫ్రికా దేశాలతో సహా ప్రపంచమంతా ముఖ్యంగా మహిళలు అభివృద్ధి చెందాలన్నదే అమెరికా లక్ష్యమని ఇవాంక పేర్కొన్నారు. సొంత ఆసక్తితోనే ఇవాంక  ప్రస్తుత ఆఫ్రికా పర్యటనకు రావడం గమనార్హం.