ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ పై ముంబయి ఘన విజయం
సొంత మైదానంలోనే ఢిల్లీ కేపిటల్స్ ను ఓడించి ముంబయి ఇండియన్స్ కాలర్ ఎగరేసింది. 40 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్
నం.34లో టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
నిర్ణీత 20 ఓవర్లలో ముంబయి 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. రోహిత్,
డీకాక్ ల జోడీ దూకుడుగా ఆడ్డంతో 6.1 ఓవర్లలోనే ముంబయి 57 పరుగుల భాగస్వామ్యాన్ని
అందుకుంది. రోహిత్(30) తో పాటు డీకాక్(37), కునాల్ పాండ్యా (37), హార్ధిక్
పాండ్యా(32) రాణించారు. చివరి మూడు ఓవర్లలో పాండ్యా సోదరులు చెలరేగిపోయి ఆడి 50
పరుగులు రాబట్టారు. దాంతో ముంబయి జట్టు మంచి లక్ష్యాన్ని ప్రత్యర్థి
ముందుంచగలిగింది. టీ20ల్లో రోహిత్ 8 వేల పరుగుల మైలురాయిని దాటాడు. అనంతరం ఏదశ
లోనూ ఢిల్లీ కేపిటల్స్ ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ను దీటుగా ఎదుర్కోలేకపోయింది. 9వికెట్లను
కోల్పోయి 128 పరుగుల్ని మాత్రమే చేయగల్గింది. రాహుల్ చాహర్ 19 పరుగులిచ్చి 3
వికెట్లు, బుమ్రా 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ఢిల్లీని ఘోరంగా దెబ్బ తీశారు. పృద్వీ షా(20), ధావన్(35), అక్షర పటేల్(26) మాత్రమే
రాణించారు. హార్ధిక్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. టోర్నీ తొలి మ్యాచ్ లోనే తమను ఓడించిన ఢిల్లీ కేపిటల్స్ పై ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. ముంబయికి ఇది వరుసగా రెండో విజయం కాగా పాయింట్ల పట్టికలో
చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత స్థానానికి చేరుకుంది. సీఎస్కే 14 పాయింట్లతో ఉండగా
ఎం.ఐ 12 పాయింట్లు సాధించింది.
No comments:
Post a Comment