మదీరా ద్వీపంలో టూరిస్ట్ బస్ బోల్తా 29 మంది దుర్మరణం
పోర్చుగల్ మదీరా ద్వీపంలో బుధవారం (ఏప్రిల్17)
సాయంత్రం 6.30 ప్రాంతంలో ఘోర బస్ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 29
మంది యాత్రికులు దుర్మరణం చెందారు. మృతులంతా 44 నుంచి 50 ఏళ్ల లోపు వారే. డ్రైవర్,
టూర్ గైడ్ సహా 55 మంది బస్ లో ప్రయాణిస్తున్నారు. కేనికొ పట్టణానికి సమీపంలో
రోడ్డు మలుపు తిరుగుతుండగా అదుపుతప్పిన బస్ పక్కనున్న ఇళ్ల మీదుగా దూసుకుపోయి బోల్తా
పడింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా జర్మనీ దేశస్థులు. దుర్ఘటనలో మరో 27 మంది
గాయాలపాలయ్యారు. ఆ రోడ్డుపై నడుస్తున్న కొందరు పాదచారులు కూడా బస్ దూసుకెళ్లిన
క్రమంలో గాయపడినట్లు సమాచారం. ‘ప్రమాదంపై వ్యాఖ్యానించడానికి మాటలు రావడం లేదు..
మృతుల బంధువులు, క్షతగాత్రుల బాధల్ని తట్టుకోలేకపోతున్నా’ అని కేనికొ మేయర్ ఫిలిపె
సౌసా ఓ టీవీ చానల్ లో పేర్కొన్నారు. చనిపోయిన యాత్రికుల్లో 11 మంది పురుషులు, 18
మంది మహిళలని తెలిపారు. 28 మంది దుర్ఘటనా స్థలంలోనే చనిపోగా మరో మహిళ
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందన్నారు.