జలియన్ వాలా బాగ్ నరమేధానికి నూరేళ్లు
జలియన్ వాలా బాగ్ సామూహిక జన హననం జరిగి వందేళ్లయిన నేపథ్యంలో భారత జాతి నాటి
మృతవీరులకు ఘనంగా నివాళులర్పించింది. పంజాబ్ (అమృత్ సర్) లోని జలియన్ వాలా బాగ్ లో
ఏప్రిల్ 13, 1919లో బ్రిటిష్ పాలకులు సాగించిన ఈ ఘోర కలి ఇప్పటికీ దేశాన్ని
కలచివేస్తున్న దుర్మార్గపు ఘటన. సాక్షాత్తు బ్రిటన్ ప్రధాని థెరిసా మే జలియన్ వాలా
బాగ్ నరమేధం సిగ్గుతో తలదించుకునే పరిణామంగా పేర్కొన్నారు. భారత-బ్రిటన్ చరిత్రలో తీవ్ర విచారాన్ని
వ్యక్తం చేయాల్సిన రోజుని అభివర్ణించారు.
భారత రాష్ట్రపతి రామ్
నాథ్ కోవింద్ మృత వీరులకు నివాళులర్పిస్తూ ఈ భయానక నరమేధం పౌర సమాజంపై చెరగని నెత్తుటి
మరకన్నారు. మృత వీరుల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదని ట్విటర్ లో పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్ ద్వారా మృత వీరులకు ఘన నివాళులర్పించారు. వందేళ్ల
నాటి పీడ కల దేశం స్మృతి పథంలో ఇంకా చెరిగిపోలేదన్నారు. ఆ మృత వీరుల శౌర్యం,
త్యాగం ఎన్నటికి జాతి మరువదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,
పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ , మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూలు శనివారం
(ఏప్రిల్ 13, 2019) జలియన్ వాలా బాగ్ స్మారక ప్రాంతం వద్ద మృత వీరులకు ఘనంగా
నివాళులర్పించారు. స్వాతంత్ర్య ఫలాలు పొందుతున్న భారత దేశం ఆనాటి సమరవీరులు త్యాగాల్ని
ఎప్పటికీ మరవదని, వారికి తమ వందనాలంటూ రాహుల్ గాంధీ సందర్శకుల పుస్తకంలో లిఖితపూర్వకంగా
పేర్కొన్నారు.