Friday, April 12, 2019

russel brutal innings again in ipl delhi bowler morris got his wicket

రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్
·  ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చిన ధావన్      

·  కె.కె.ఆర్.పై డీసీ గెలుపు


ఐపీఎల్ మ్యాచ్ నెం.26 ను ఢిల్లీ కేపిటల్స్ గెలుచుకుంది. కోలకతా నైట్రైడర్స్ తో శుక్రవారం జరిగిన మ్యాచ్ ద్వారా ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్ మన్ ధావన్ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. అయితే తొలి ఐపీఎల్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ధావన్ 97* పరుగులు చేశాడు. అయితే మూడో వికెట్ కు రిషబ్ పంత్(47) తో కలిసి 100 పరుగుల్ని జోడించడంతో 179 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు తేలిగ్గానే అందుకుంది. మూడు వికెట్లనే కోల్పోయిన ఢిల్లీ జట్టు ఇంకా ఏడు బంతులు మిగిలి ఉండగానే 180 పరుగులు చేసి విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేసింది. రస్సెల్ బ్యాటింగ్ దిగాక పరిస్థితి మారిపోయింది.
రస్సెల్... బ్రూటల్...
ఐపీఎల్ సీజన్-12ల్లో ఆండ్రూ రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. కోలకతా ఈడేన్ గార్డెన్స్ లో ఢిల్లీ కేపిటల్ తో పోరులో మరోసారి చెలరేగిపోయాడు. కేవలం 21 బంతుల్లో నాలుగు సిక్సర్లు, మూడు బౌండరీలతో 45 పరుగులు చేశాడు. రబాడ, క్రిస్ మోరిస్ బౌలరెవరైనా అది ఏ బంతయినా చేరేది బౌండరీ లైన్ కే అన్నట్లుగా బ్యాటింగ్ చేశాడు. బౌలర్ అదృష్టం బాగుండి ఫీల్డర్ క్యాచ్ అందుకున్నాడు కాబట్టి గానీ లేదంటే మరో పెద్ద ఇన్నింగ్స్ తో జట్టు స్కోరును 200 దాటించేవాడే. క్రిస్ మోరిస్ ఆఫ్ కటర్ యార్కర్ ను సిక్స్ గా మలిచే ప్రయత్నంలో రస్సెల్ స్క్వేర్ లెగ్ బౌండరీ వద్ద రబాడకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు ఓపెనర్ సుభమన్ గిల్ చక్కటి అర్ధ సెంచరీ చేశాడు. 65 పరుగుల స్కోర్ వద్ద అతను వెనుదిరగడంతో కెప్టెన్ దినేశ్ కార్తీక్ రంగప్రవేశం చేసినా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలదొక్కుకోలేదు. పీయూష్ చావ్లా చివర్లో కొన్నైనా పరుగులు రాబట్టడంతో కోలకతా నైట్ రైడర్స్(కేకేఆర్) జట్టు 178/7 స్కోర్ సాధించింది.

pakistan deadly explosion rips through quetta market 20-dead


పాకిస్థాన్ లో బాంబు పేలుడుకు 20 మంది బలి
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో శుక్రవారం బాంబు పేలుడుకు 20 మంది దుర్మరణం చెందారు. క్వెట్టాలోని ఓ మార్కెట్ లో ఈ ఉదయం పేలుడు సంభవించింది. ఈ దాడిలో మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. షియా వర్గానికి చెందిన హజరాలు పెద్ద సంఖ్యలో ఈరోజు మార్కెట్ కు వచ్చారు. వీరంతా కూరగాయలు కొనుగోలు చేస్తుండగా పేలుడు జరిగింది. పేలుడు దాటికి పలువురు మాంసపు ముద్దలుగా మారారు. చాలా మంది శరీర భాగాలు ఎగిరిపడ్డాయి. ఈ ప్రాంతమంతా రక్తసిక్తమై యుద్ధభూమిని తలపించింది. ఆగంతకులు బంగాళాదుంపల సంచుల్లో బాంబును పెట్టి ఉంటారని అనుమానిస్తున్నట్లు క్వెట్టా పోలీస్ చీఫ్ అబ్దుల్ రజాక్ చీమా తెలిపారు. క్వెట్టాలో ఆరు లక్షల వరకు హజారాల జనాభా ఉంది. ఈ వర్గం వారిపై తరచు దాడులు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఈ మార్కెట్ ప్రాంతంలో భద్రత బలగాల గస్తీ ఉంటుంది. 2013 నుంచి బలూచిస్థాన్ ప్రావిన్స్ లో హజరాలపై కాల్పులు, బాంబు దాడులు జరుగుతుండగా ఇంతవరకు 509 మంది చనిపోయినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

sindhu seals semifinal spot in singapore open Saina ousted


సింగపూర్ ఓపెన్ సెమీస్ కు సింధు
భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు సింగపూర్ ఓపెన్ సెమీస్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్స్ లో మరో భారత స్టార్ క్రీడాకారిణి సైనా ఓటమి పాలయింది. క్వార్టర్ ఫైనల్స్ లో సింధు వరల్డ్ నం.18 రెండో సీడ్ చైనాకు చెందిన కేయాన్యాన్ పై 21-13,17-21,21-14 తేడాతో గెలుపొందింది. తొలి సెట్లో సింధుదే పైచేయి కాగా రెండు సెట్లో యాన్యాన్ పుంజుకుని సింధుని కంగు తినిపించింది. ఆఖరి సెట్లో ప్రత్యర్థికి సింధు ముచ్చెమటలు పట్టించి గెలుపొందింది. మూడు సెట్ల పోరాటంలో విజయం సాధించిన సింధు తన చిరకాల ప్రత్యర్థి వరల్డ్ చాంపియన్ నొజొమి ఒకుహరాతో సెమీస్ లో తలపడనుంది. సెకండ్ సీడ్ గా టోర్నీలో ఆడుతున్న ఒకుహరా ఆరోసీడ్ లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత భారత షట్లర్ సైనా పై విజయం సాధించి సింధుతో పోరుకు సిద్ధమౌతోంది. ఒకుహరాతో సైనా ఆడిన చివరి మూడు మ్యాచ్ ల్లోనూ గెలిచి తనదే పై చెయ్యి అనిపించుకుంది. మొత్తమ్మీద ఈ ఇద్దరు క్రీడాకారిణులు తలపడిన మ్యాచ్ ల్లో సైనా 9 మ్యాచ్ ల్లో గెలుపొందగా ఈ సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ కలుపుకొని ఒకుహరా 5 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.

urmila matondkar not approaching politics as a star


ప్రజా ప్రతినిధిగా సేవలందించేందుకే పోటీ చేస్తున్నా:ఊర్మిళ
సినీతార హోదాలో ఏదో పొందాలని రాజకీయాల్లోకి రాలేదని ప్రజా ప్రతినిధిగా జనానికి సేవలందించాలనే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళ పేర్కొన్నారు. 90వ దశకంలో రంగీలా, దౌడ్, జుడాయ్ సినిమాల ద్వారా యావత్ దేశంలో యువతను ఆకట్టుకున్నారామె. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ముంబయి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. గతంలో ఇదే స్థానానికి మరో బాలీవుడ్ స్టార్ గోవింద ప్రాతినిధ్యం వహించారు. ఈ ప్రాంతంలో పలువురికి గృహ సమస్య, నీటి ఎద్దడి, పారిశుద్ధ్యం వంటి ప్రధానమైన ఇబ్బందులున్నాయని వాటితో పాటు ఇతర ఇక్కట్లను పరిష్కరించడానికి కృషి చేయనున్నట్లు ఊర్మిళ తెలిపారు. ఆమె ప్రత్యర్థి భారతీయ జనతాపార్టీ (బీజేపీ) అభ్యర్థి గోపాల్ శెట్టి ఇటీవల మాట్లాడుతూ ఊర్మిళ పాపం అమాయకురాలు, రాజకీయాల్లో సున్నా అని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆమెతో ప్రస్తావించగా అది ఆయన మానస్తత్వాన్ని తెలియజేస్తోందని లోక్ సభకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులకు చక్కటి అవగాహన, ఆలోచన విధానం ఉండి తమ సమస్యల్ని తీర్చేవారే కావాలని ప్రజలు కోరుకుంటారని ఊర్మిళ సమాధానమిచ్చారు. రాజకీయాల్లో సున్నాగా ఉండడమే తనకిష్టమని ఎందుకంటే మాటల్లో,చేతల్లో ప్రజల వెన్నంటి ఉంటూ ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ముందుకెళ్లడానికి రాజకీయాల్లో ఇది తొలి అడుగన్నారు. ఇర్ఫాన్ ఖాన్ బ్లాక్ మెయిల్సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న సమయంలోనే సమాజానికి ఏదైనా చేయాలనే తాము ఆలోచించామన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని తొలుత అనుకోలేదని అయితే ప్రచారకర్తగా వ్యవహరిస్తుండగా పార్టీ టిక్కెటిచ్చి బరిలోకి దింపిందని 45ఏళ్ల ఊర్మిళ తెలిపారు. అయితే ఈ సార్వత్రిక ఎన్నికలు కచ్చితంగా దేశ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలని ఆమె పేర్కొన్నారు.