Friday, April 12, 2019

delhi brings relief from scorching heat light rains in the nextday too


ఢిల్లీలో వర్షం ఈదురు గాలులు
దేశ రాజధాని ఢిల్లీ వడగాల్పుల నుంచి శుక్రవారం ఉపశమనం పొందింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో మొదలై పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో నగరం చల్లబడింది. వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం ఉదయం ఉష్ణోగ్రత 23 డిగ్రీలు నమోదు కావడంతో జనం ఆహ్లాదకర వాతావరణంతో పులకించిపోయారు. పాలం, లోధీ రోడ్లలో 0.5 మి.మీ, 0.6 మి.మీ వర్షపాతం నమోదయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో 0.2 మి.మీ వర్షం కురిసింది. గాలిలో తేమ 72 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మరో 24 గంటలు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన స్వల్ప వర్షాలు కురవొచ్చని తెలుస్తోంది.

biopic modi sc to hear on april 15 plea challenging eci ban on release of film


సుప్రీంకోర్టులో మోదీ బయోపిక్ పై 15న వాదనలు
ప్రధాని ‘మోదీ జీవిత చరిత్ర’ సినిమా విడుదల్ని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) నిషేధించడంపై ఈనెల 15న వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సార్వత్రిక ఎన్నికల వేళ మోదీ బయోపిక్ విడుదల చేయరాదని ఈసీఐ నిషేధం విధించింది. ఈ సినిమా నిర్మాతలు ఈసీఐ నిర్ణయాన్ని సడలించాలించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో భారత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని సుప్రీం ధర్మాసనం వాదనలు వినేందుకు అంగీకారం తెల్పింది. అంతకుముందు కాంగ్రెస్ కార్యకర్త మోదీ బయోపిక్ విడుదలపై స్టే విధించాలని కోరుతూ వేసిన పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. సినిమా విడుదల కావాలా లేదా అనేది ఈసీఐ పరిధిలోని అంశంగా ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే సెన్సార్ బోర్డు ఇప్పటికే సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసింది. దాంతో కాంగ్రెస్ కార్యకర్త ఈ విషయాన్ని తెల్పుతూ సినిమా విడుదల నిలిపివేయాలని ఈసీఐని కోరడంతో నిషేధం విధించింది.

ap 2019 polling 80%


ఆంధ్రప్రదేశ్ లో 80% ఓట్ల పోలింగ్?
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ మునుపెన్నడూ లేని రీతిలో ఉద్రిక్తతలు, ఘర్షణల మధ్య గురువారం ముగిసింది. అర్ధరాత్రి వరకు కూడా అనేక ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించారు. ఈవీఎంలు మొరాయించడంతో ఆళ్లగడ్డ లో అర్ధరాత్రి వరకూ ఎన్నిక నిర్వహించారు. మొత్తమ్మీద 2014 కంటే 2019 ఎన్నికల ఓటింగ్ శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఇక మళ్లీ సీఎం కుర్చీ చంద్రబాబుదేనని కొందరు, ఈసారి ఛాన్స్ తమదేనని జగన్ అభిమానులు ఎవరి లెక్కల్లో వారున్నారు. ఫలితాలు వెల్లడికి మాత్రం మే 23 వరకు వేచి ఉండక తప్పదు. ఈ లోపు పందెం రాయుళ్లు బరిలోకి దిగడం ఖాయం.
అత్యధిక శాతం పోలింగ్:సీఈవో ద్వివేదీ
ఈసారి రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ లో అత్యధిక శాతం ఓటింగ్ నమోదైనట్లు ఏపీ సీఈవో ద్వివేదీ తెలిపారు. మరికొన్ని గంటల్లో అధికారికంగా ఓటింగ్ శాతం వివరాలు వెల్లడిస్తామన్నారు. 80% ఓట్లు పోలయినట్లు అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైన చోట్ల రీపోలింగ్, లేదా ఓటు వేయని వారుంటే వారికి పోలింగ్ నిర్వహించాల్సి వస్తే ఏర్పాట్లు చేస్తామని వివరించారు.

dhoni 100th win in ipl


ఐపీఎల్ లో ధోనికి వందో విజయం
మరో ఆఖరి బాల్ ఉత్కంఠ విజయానికి మొహాలీ వేదికయింది. ఐపీఎల్ సీజన్ 12లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్ధి రాజస్థాన్ రాయల్స్ పై చివరి బంతి సిక్సర్ తో విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్లో రెండో అర్ధ సెంచరీ కొట్టాడు. అంతకు ముందే అర్ధసెంచరీ పూర్తి చేసిన అంబటి రాయుడు(57) అవుటయ్యాడు. ఐపీఎల్లో ధోని కెప్టెన్ గా చెన్నైకిది వందో విజయం. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 151/7 చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 155/6 వికెట్లను కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్టోక్స్ వేసిన ఆఖరి ఓవర్ బౌలింగ్లో రవీంద్ర జడేజా తొలి బంతికే సిక్స్ సాధించాడు. 12 పరుగుల్ని చేయాల్సిన దశలో నోబాల్ పడింది. ఆ బాల్ కు ఒక పరుగు, ఫ్రీ హిట్ బాల్ కు మరో రెండు పరుగులు లభించాయి. ఆ తర్వాత స్టోక్స్ అద్భుతమైన యార్కర్ కు ధోని అవుట్ కావడంతో చివరి మూడు బంతుల్లో 8 పరుగుల్ని రాజస్థాన్ రాయల్స్ చేయాల్సి వచ్చింది. తర్వాత వైడ్ బాల్ పడగా ఆ తర్వాత బంతికి శాంటనర్ రెండు పరుగులు తీశాడు. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉండగా బ్రహ్మాండమైన స్ట్రెయిట్ సిక్సర్ కొట్టిన శాంటనర్ చెన్నై ఖాతాలో మరో గెలుపును జమ చేశాడు.