Thursday, June 13, 2019

India vs New Zealand, ICC Cricket World Cup Match abandoned after rain plays spoilsport



భారత్-కివీస్ వరల్డ్ కప్ మ్యాచ్ వర్షార్పణం
వాతావరణ  నిపుణులు ముందు ఊహించినట్లుగానే భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఐసీసీ వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.18 నాటింగ్ హామ్ లో గురువారం జరగాల్సిన మ్యాచ్ టాస్ వేయకుండానే రద్దయింది. మ్యాచ్ పరిమిత ఓవర్ల మేరకయినా జరుగుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురయింది. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటికి వర్షం వల్ల రద్దయిన నాల్గోమ్యాచ్ ఇది. శ్రీలంక వర్షం వల్ల రెండు మ్యాచ్ లు ఆడలేకపోగా, వెస్టిండిన్-దక్షిణాఫ్రికా మ్యాచ్ 7.3 ఓవర్లు కొనసాగి రద్దయింది. మ్యాచ్ నం.11 బ్రిస్టల్ లో జూన్ 7న పాకిస్థాన్-శ్రీలంక ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయింది. వర్షం గెలిచిన తొలి మ్యాచ్ ఇది. ఆ తర్వాత వర్షం గెలుచుకున్న రెండో మ్యాచ్.. నం.15 సౌథాంప్టన్ లో జూన్ 10న దక్షిణాఫ్రికా-వెస్టిండిస్ ల మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ నం.16 బ్రిస్టల్ వేదికగా జూన్11న బంగ్లాదేశ్ శ్రీలంక మ్యాచ్ లోనూ వర్షమే గెలిచింది. తాజా వరల్డ్ కప్ లో రద్దయిన మూడో మ్యాచ్ ఇది. ఆ తర్వాత వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం నాల్గో మ్యాచ్ లోనూ వర్షాన్నే విజయం వరించింది. నాటింగ్ హామ్ వేదికగా జూన్ 13న జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం జాబితాలో చేరింది. న్యూజిలాండ్ ఈ వరల్డ్ కప్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లో హ్యాట్రిక్ విజయాలతో ముందు వరుసలో ఉండగా భారత్ రెండింటికి రెండు మ్యాచ్ లు గెలిచి ఊపుమీదుంది. అయితే వర్షం మాత్రం నాలుగు మ్యాచ్ ల గెలుపుతో 8 పాయింట్లతో అన్ని జట్ల కంటే ముందుగానే సెమీస్ చేరినట్లు సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు షికారు చేస్తున్నాయి. అయితే మరో రెండ్రోజుల్లో వరుణుడు కరుణిస్తాడని వర్షాలు పడకపోవచ్చనే వాతావరణ శాఖాధికారుల అంచనా క్రికెట్ అభిమానులకు ఊరట కల్గిస్తోంది. అందరూ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఈ ఆదివారం జూన్ 16న మాంచెస్టర్ లో జరగనుంది. న్యూజిలాండ్ బుధవారం జూన్ 19న బర్మింగ్ హామ్ లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

No comments:

Post a Comment