Thursday, June 13, 2019

Dr.harsh vardhan condemns violence against doctors urges for restrain


వైద్యులపై దాడుల్ని రాష్ట్రాలు నిలువరించాలి: కేంద్రమంత్రి వర్ధన్
దేశంలో వైద్యులపై జరుగుతున్న దాడుల్ని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ తీవ్రంగా ఖండించారు. సమాజ శ్రేయస్సుకు వైద్యులు మూల స్తంభాలని అటువంటి వృత్తిలో ఉన్న వారికి ఇబ్బందులు కల్గించడం, ఒత్తిళ్లకు గురి చేయడం మంచిది కాదని హితవు పలికారు. వైద్యులపై దాడులు జరగకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని గురువారం (జూన్13) ఆయన ఓ ప్రకటనలో కోరారు. వైద్యులు కూడా రోగుల అత్యవసర ఆరోగ్య అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని నిరసనలకు స్వస్తి చెప్పి విధుల్లో చేరాలని మంత్రి హర్షవర్దన్ విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఎన్.ఎస్.ఆర్. మెడికల్ కాలేజీ లో మంగళవారం డాక్టర్ లపై జరిగిన దాడిని ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈ మేరకు విన్నవించారు. సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లపై కోల్ కతాలో దుండగులు దాడి చేయడంతో ఇద్దరు వైద్యులు గాయాలపాలయ్యారు. మరో వైపు సీఎం మమతా బెనర్జీ గురువారం మధ్యాహ్నం 2 గంటల కల్లా విధుల్లో చేరాలని సమ్మె చేస్తున్న వైద్యులకు అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాము కోరుకుంటున్న భద్రతా ప్రమాణాలు మెరుగయ్యే వరకు సమ్మె విరమించేది లేదని వైద్యులు తెగేసి చెబుతున్నారు. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సభ్యులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనల్లో పాల్గొనాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కోరింది. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఉదయం 10 నుంచి 12 వరకు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రధానమంత్రిని ఉద్దేశిస్తూ మెమొరాండంను ఆయా జిల్లాల కలెక్టర్లకు సమర్పించాలని ఐఎంఏ కోరింది. బెంగాల్ లో జూనియర్ డాక్టర్ల సమ్మెకు సంఘీభావం తెల్పుతూ ఢిల్లీ లోని ఆలిండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో వైద్యులు శుక్రవారం చేతులకు బ్యాండేజీలు ధరించి విధులు నిర్వహించనున్నట్లు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ (ఆర్డీఏ) ప్రకటించింది.

No comments:

Post a Comment