Tuesday, March 8, 2022

CM Jagan introduces mourning resolution for late Gautam Reddy in AP Assembly

గౌతంరెడ్డికి ఏపీ అసెంబ్లీ ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి సంతాపం ప్రకటించింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభంకాగానే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి స్వయంగా సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ గౌతం రెడ్డి హఠాన్మరణం వై.ఎస్.ఆర్.సి.పి కి తమకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నామంటూ ఆవేదన వెలిబుచ్చారు. 2010 నుంచి తాము సన్నిహితంగా మెలిగామంటూ వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి అకాల మరణంతో దిగ్ర్భాంతి చెందినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒక సమర్థ మంత్రిని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందంటూ బాధపడ్డారు. మంత్రులు పెద్దిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గౌతమ్ ఎప్పుడూ నవ్వుతూ పలకరించే వారని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా గౌతమ్ రెడ్డితో తమ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

సంగం బ్యారేజీకి గౌతం పేరు

సంతాప తీర్మానం సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ సంగం బ్యారేజీకి గౌతంరెడ్డి పేరు పెడతామన్నారు. ఆయన హఠాన్మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇద్దరం చిన్ననాటి నుంచి స్నేహితులం అని సీఎం చెప్పారు. గౌతం చిరస్థాయిగా జిల్లా ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా చేస్తామన్నారు. మరో ఆరు వారాల్లో పూర్తికానున్నసంగం బ్యారేజీకి `మేకపాటి గౌతం సంగం బ్యారేజీ`గా నామకరణం చేయనున్నట్లు తెలిపారు.

Monday, March 7, 2022

About 700 students are still trapped in Sumi, Ukraine

ఇంకా బంకర్లలోనే కొందరు..

ఉక్రెయిన్ లో ఇంకా పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయి ఉన్నారు. సుమీ లోగల బంకర్లలో వీరంతా తలదాచుకుంటున్నారు. ఉక్రెయిన్ లో నోఫ్లైజోన్ ఆంక్షలు నేటి నుంచి అమలు కావచ్చని భావిస్తున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 700 మంది విద్యార్థులు సుమీలోనే  క‌నీస సౌక‌ర్యాలు లేక అల‌మ‌టిస్తున్నారు. ఉక్రెయిన్ సరిహద్దులు దాటడానికి ఎదురుచూస్తున్నారు. అయితే రష్యా దాడులు తీవ్రమైన సమయంలో వారంతా ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు. తొలుత వీరందర్ని రష్యా మీదుగా భారత్ కు తీసుకురావాలని మన రాయబార కార్యాలయం యత్నించింది. అయితే ప్రస్తుత తరుణంలో ఈ యత్నం ప్రమాదకరమని భావిస్తున్నారు. ఈ విద్యార్థుల్ని పోలెండ్, హంగేరీల మీదుగానే భారత్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Friday, March 4, 2022

CM YSJagan union minister Sekhawat Polavaram visit

కేంద్రమంత్రి పోలవరం సందర్శన

* సీఎం జగన్ తో కలిసి పునరావాస గృహాల పరిశీలన

ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర షెకావత్ సందర్శించారు. శుక్రవారం ఉదయం సీఎం జగన్ తో కలిసి ఆయన ఇందుకూరిపేటలోని పునరావాస గృహాల్ని పరిశీలించి అక్కడ సౌకర్యాల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పూర్తికి కేంద్రం అన్ని విధాలా సహకారాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా షెకావత్ హామీ ఇచ్చారు. `పునరావాస కాలనీ అద్భుతంగా ఉంది.  కాలనీలో మంచి వసతులు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఇచ్చిన మాటకు మోదీ సర్కార్‌ కట్టుబడి ఉంది. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే. ప్రాజెక్టు పనుల పరిశీలనకు మధ్యలో మరోసారి పర్యటిస్తా`అని షెకావత్‌ తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ పోలవరం యావత్ ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సంస్థ ఏర్పాటుకు చేయూతనిస్తామని కేంద్రమంత్రి మాట ఇచ్చారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పునరావాస పనులపై మరింత శ్రద్ధ పెట్టాలని అధికారుల్ని సీఎం కోరారు.

Monday, February 28, 2022

AP CM YSJagan launches third instalment jagananna thodu scheme

చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.526 కోట్లు 

జగనన్న తోడు పథకం కింద సుమారు 5లక్షల 10వేల మంది చిరువ్యాపారులకి మేలు చేకూరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సుమారు రూ.526కోట్ల మొత్తాన్నినేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తూ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కారు. ఒక్కొక్కరికి రూ.10 వేల ఆర్థిక సాయం అందనుంది. విడతల వారీగా లబ్ధిదారులు తమ రుణ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. కాలవ్యవధి ప్రకారం రుణం చెల్లించిన అందరికీ వడ్డీని ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా చిరువ్యాపారులకు తోడుగా ఉండడమే తమ లక్ష్యమని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే క్రమం తప్పకుండా రుణ వాయిదాలను బ్యాంకులకు చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు జగనన్న తోడు కింద మూడో విడతతో కలిపి మొత్తం 14 లక్షల 16 వేల 14 మంది సాయం అందించినట్లయిందన్నారు. సోమవారం తాజాగా విడుదల చేసిన రూ.10 వేల వడ్డీ లేని రుణ సాయం అందని వారేవరైనా ఉంటే ఆందోళన చెందొద్దని సీఎం కోరారు. రుణ సాయం అందని వారు గ్రామ సచివాలయాల్లో వాలంటీర్లను కలుసుకొని అవసరమైతే మళ్లీ జగనన్న తోడు పథకానికి దరఖాస్తు చేయాలన్నారు.