Saturday, December 4, 2021

Konijeti Rosaiah passed away in Hyderabad

కాంగ్రెస్ మహానేత అజాతశత్రువు కొణిజేటి రోశయ్య (88) తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లో శనివారం ఉదయం 8 గంటలకు అస్వస్థత గురైన కొద్దిసేపటికే మరణించారు.  నాడి పడిపోతుండడంతో గమనించిన కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన స్టార్ హాస్పిటల్ కు తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారు. ఇటీవల బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పిటల్ లోనే ఆయన కొంతకాలం చికిత్స పొందారు. వైద్యులు రోశయ్య మరణించినట్లు ధ్రువీకరించిన అనంతరం పార్థివదేహాన్ని అమీర్ పేట, ధరంకరం రోడ్డులోని స్వగృహానికి తీసుకువచ్చారు. గాంధీభవన్ లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆయన భౌతికకాయన్ని పార్టీ శ్రేణులు సందర్శనార్థం ఉంచనున్నారు. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోశయ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు, ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్, సన్నిహిత సహచరులు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి  రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Friday, November 5, 2021

Delay in communication of bail orders affects liberty:SC judge

బెయిల్ కాపీ జాప్యంపై సుప్రీం జడ్జి ఆగ్రహం

బెయిల్ ఆర్డర్ కాపీ అందజేతలో జాప్యాన్ని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ చంద్రచూడ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది వ్యక్తుల స్వేచ్ఛను హరించడంగా పేర్కొన్నారు. ఈ అంశంలో దిద్దుబాటు చర్యల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని హితవు చెప్పారు. జైలు అధికారులకు సత్వరం బెయిల్ ఆర్డర్ కాపీలను అందించక అలసత్వం వహించడం వల్ల విచారణలో ఉన్న ఖైదీలపై మానసికంగా ప్రభావం పడుతోందన్నారు. ఇప్పటికే దేశంలోని ఆయా జిల్లా కోర్టుల్లో 2.97 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. వీటిలో 77 శాతం కేసులు ఏడాదిలోపువేనన్నారు.

Sunday, October 10, 2021

happy birthday s s rajamouli@20

దర్శకధీర@20

రాజమౌళి ఈ పేరు సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్. తెలుగు సినిమా పరిశ్రమను మరోసారి మహోన్నతంగా ప్రపంచానికి చూపించిన ఘనుడు. బాహుబలి-1,2 సినిమాలను నభూతో నభవిష్యతి అనే రీతిలో మలిచిన గ్రేట్ మేకర్. జూనియర్ ఎన్టీయార్ హీరోగా స్టూడెంట్ నం.1 చిత్రంతో పరిశ్రమలో మెగా ఫోన్ చేతపట్టాడు. ఓటమి మాట తన డిక్షనరీలో లేదని నిరూపించిన ఈ జక్కన పుట్టినరోజు ఈరోజు. రాజమౌళి దర్శకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఎన్టీయార్, రామ్ చరణ్‌లతో  రౌద్రం రణం రుధిరం’ (RRR) అనే భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. చాలా యేళ్ల తర్వాత తెలుగు తెరపై తళుకులీననున్న అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇది. చరిత్రలో అసలు కలవని  కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు కలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఫాంటసీ కథలకు క్లాస్, మాస్ పల్స్ జోడించి హిట్లు మీద హిట్లు కొడుతూ తనకు తనే సాటిగా దూసుకెళ్తున్నాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ `మహాభారతం` తన చివరి చిత్రంగా తీస్తానని పలు ఇంటర్వ్యూల్లో రాజమౌళి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా బహుబలి చిత్రాల్ని తలదన్నే మరో చిత్రరాజమవుతుందనడంలో సందేహమే లేదు.

Thursday, September 2, 2021

Pawan Kalyan birthday Chiranjeevi and tollywood celebrities best wishes

పవన్ కల్యాణ్@50

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 50వ పుట్టినరోజుని ఆయన అభిమానులు, కుటుంబసభ్యులు ఘనంగా జరుపుకుంటున్నారు. గురువారం ఆయన బర్త్ డే  సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి `తమ్ముడు నిప్పు కణం` అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. `సినీ కథానాయకులు, ప్రజా నాయకులు పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను` అంటూ ఏపీ మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ జాతీయఅధ్యక్షుడు నారా  చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, అల్లు అర్జున్, అనసూయ, శ్రీముఖిలతో పాటు పలువురు పవన్‌కి విషెస్ అందించారు. `హ్యాపీ బర్త్‌డే బాబాయ్.. అన్ని విషయాల్లో మీకు మంచి జరగాలని, విజయం వరించాలని కోరుకుంటున్నా` అని వరుణ్ తేజ్ శుభాకాంక్షలు తెలిపారు. మరో వైపు పవన్, రానాల తాజా సినిమా భీమ్లా నాయక్ కు సంబంధించిన టైటిల్ సాంగ్ ని చిత్ర యూనిట్ అభిమానులకు బర్త్ డే కానుకగా విడుదల చేసింది. ఆ సాంగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.