Saturday, August 7, 2021

India stands 47th position at Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు 47వ స్థానం

ఏడాది ఆలస్యంగా జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య పెరిగింది. చివరి రోజు శనివారం దక్కిన రెండు పతకాలతో కలిపి మొత్తం ఏడు భారత్ ఖాతాలో జమ అయ్యాయి. నీరజ్ చోప్రా జావెలిన్ లో బంగారు పతకం గెలుచుకోగా భజరంగ్ కు కాంస్యం లభించింది. 100 ఏళ్ల తర్వాత అథ్లెటిక్స్ లో భారత్ కు స్వర్ణ పతకాన్ని అందించి నీరజ్ చరిత్ర సృష్టించాడు. దాంతో ఈసారి ఒలింపిక్స్ లో భారత్ కు 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు దక్కాయి. మీరాబాయి చాను, రవి దహియాలు రజతాలు గెలుచుకోగా, తెలుగు తేజం షట్లర్ పీవీ సింధు, లవ్లీనా, భారత పురుషుల హాకీ టీమ్ లకు కాంస్య పతకాలు లభించాయి. మరో మూడు నాలుగు పతకాలు త్రుటిలో చేజారిపోయాయి గానీ లేదంటే ఈ ఒలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య రెండంకెల స్కోరు దాటి ఉండేది.

Monday, July 19, 2021

AP CM YSJagan Polavaram project tour highlights review development works

 సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షించారు. ప్రాజెక్టు సందర్శనలో భాగంగా తొలుత ఆయన ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి సీఎం క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టును హిల్ వ్యూ పాయింట్ వద్ద నుంచి జగన్ స్వయంగా పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. తర్వాత జగన్‌  పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు. స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్‌ను సీఎం పరిశీలించాకా పోలవరం పనుల ఫొటో గ్యాలరీని వీక్షించారు. సీఎం వెంట నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. గడువులోగా పనులు పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలుత నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2022 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరాలని సూచించారు.

Wednesday, June 23, 2021

IRCTC offers one day Tirumala tour package just for Rs 990

ఐఆర్‌సీటీసీ 'డివైన్ బాలాజీ దర్శన్'

తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలని ఆసక్తి చూపిస్తున్న వారికి శుభవార్త. కేవలం రూ.990కే తిరుమల ప్రయాణంతో పాటు స్వామి వారి దర్శనభాగ్యం దక్కనుంది. భారతీయ రైల్వే ఐఆర్‌సీటీసీ 'డివైన్ బాలాజీ దర్శన్' ప్యాకేజీని తిరిగి ప్రారంభించింది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోనూ కాస్త తగ్గిన నేపధ్యంలో లాక్ డౌన్ ఆంక్షల్ని సడలిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా కరోనా భయంతో ఎక్కడికీ వెళ్లలేకపోయిన ప్రజలు తీర్థయాత్రలు, టూర్ల పై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. అటువంటి వారు ముందుగా 'డివైన్ బాలాజీ దర్శన్' ప్యాకేజీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు తిరుపతికి చేరుకున్న తర్వాత ఈ ప్యాకేజీ మొదలవుతుంది. ఈ ప్యాకేజీ కింద భక్తులను ఉదయం 8 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో పికప్ చేసుకుని తిరుమలకు తీసుకెళ్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ ద్వారా మధ్యాహ్నం 1 గంట లోపే శ్రీవారిని దర్శించుకుంటారు.  తిరుమలలోనే భోజనం చేశాక భక్తులు తిరుచానూర్ బయల్దేరుతారు. తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం పూర్తైన తర్వాత భక్తులను తిరుపతి రైల్వే స్టేషన్‌లో దిగబెడతారు. దాంతో వన్డే తిరుమల టూర్ ముగుస్తుంది.

Saturday, June 19, 2021

Milkha Singh to get state funeral

మిల్కాసింగ్ కు కన్నీటి వీడ్కోలు

ఫ్లయింగ్ సిక్కు మిల్కా సింగ్‌ కు శనివారం చండీగఢ్ లో పూర్తిస్థాయి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 91 ఏళ్ల ఈ పరుగుల వీరుడికి కుటుంబ సభ్యులు కేంద్ర క్రీడా మంత్రి కిరెన్ రిజిజుతో సహా పలువురు ప్రముఖులు తుది వీడ్కోలు పలికారు. క్రీడా ప్రపంచం ఆయనను ది ఫ్లయింగ్ సిక్కుఅని ప్రేమగా పిలుచుకునేది. ఆసియా క్రీడల్లో ఆయన నాలుగుసార్లు స్వర్ణ పతకాలు గెలిచారు. 1960 రోమ్ ఒలింపిక్స్ లో నాల్గో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయారు. ఆయన మృతి పట్ల యావత్ భారత క్రీడాలోకం తీవ్ర సంతాపం ప్రకటించింది. ఐదు రోజుల క్రితం మిల్కా భార్య, మాజీ భారత వాలీబాల్ కెప్టెన్ నిర్మల్ కౌర్ కరోనాతో మొహాలి ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు.  మిల్కాకు  గోల్ఫ్ దిగ్గజం కుమారుడు జీవ్ మిల్కా సింగ్, కుమార్తెలు మోనా సింగ్, సోనియా సింగ్, అలీజా గ్రోవర్ ఉన్నారు. ఆయనకు మే 20 న కరోనా పాజిటివ్ అని తేలడంతో మే 24 న మొహాలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. మే 30 న మిల్కా డిశ్చార్జ్ అయ్యారు. మళ్లీ ఆక్సిజన్ స్థాయులు పడిపోవడంతో జూన్ 3 న ఆసుపత్రిలో చేర్చారు. ఈ భారత మాజీ అథ్లెట్ కు గురువారం కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చింది. అయితే మరుసటి రోజే ఆకస్మికంగా ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు.