Saturday, June 19, 2021

Milkha Singh to get state funeral

మిల్కాసింగ్ కు కన్నీటి వీడ్కోలు

ఫ్లయింగ్ సిక్కు మిల్కా సింగ్‌ కు శనివారం చండీగఢ్ లో పూర్తిస్థాయి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 91 ఏళ్ల ఈ పరుగుల వీరుడికి కుటుంబ సభ్యులు కేంద్ర క్రీడా మంత్రి కిరెన్ రిజిజుతో సహా పలువురు ప్రముఖులు తుది వీడ్కోలు పలికారు. క్రీడా ప్రపంచం ఆయనను ది ఫ్లయింగ్ సిక్కుఅని ప్రేమగా పిలుచుకునేది. ఆసియా క్రీడల్లో ఆయన నాలుగుసార్లు స్వర్ణ పతకాలు గెలిచారు. 1960 రోమ్ ఒలింపిక్స్ లో నాల్గో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయారు. ఆయన మృతి పట్ల యావత్ భారత క్రీడాలోకం తీవ్ర సంతాపం ప్రకటించింది. ఐదు రోజుల క్రితం మిల్కా భార్య, మాజీ భారత వాలీబాల్ కెప్టెన్ నిర్మల్ కౌర్ కరోనాతో మొహాలి ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు.  మిల్కాకు  గోల్ఫ్ దిగ్గజం కుమారుడు జీవ్ మిల్కా సింగ్, కుమార్తెలు మోనా సింగ్, సోనియా సింగ్, అలీజా గ్రోవర్ ఉన్నారు. ఆయనకు మే 20 న కరోనా పాజిటివ్ అని తేలడంతో మే 24 న మొహాలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. మే 30 న మిల్కా డిశ్చార్జ్ అయ్యారు. మళ్లీ ఆక్సిజన్ స్థాయులు పడిపోవడంతో జూన్ 3 న ఆసుపత్రిలో చేర్చారు. ఈ భారత మాజీ అథ్లెట్ కు గురువారం కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చింది. అయితే మరుసటి రోజే ఆకస్మికంగా ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు.

Friday, June 18, 2021

Curfew relaxation 6A.M- 6P.M in A.P

21 నుంచి ఉ.6 - సా.6 కర్ఫ్యూ బ్రేక్

లాక్ డౌన్ వేళల్లో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి క్రమంగా తగ్గుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్యా దిగివస్తుండడంతో సర్కారు ఈ మేరకు సడలింపులకు మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కరోనా కేసులపై శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 1,07,764 శాంపిల్స్ ని పరీక్షించగా 6,341 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడు జిల్లాలు మినహా మిగిలిన 10 జిల్లాల్లో కేసుల ఉధృతి అదుపులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా(1,247), చిత్తూరు జిల్లా(919), పశ్చిమగోదావరి జిల్లా(791) పాజిటివ్ కేసులతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. దాంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోన్న కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేయాలని నిశ్చయించింది. ఈ నెల 21 సోమవారం నుంచి ఉదయం 6 - సాయంత్రం6 వరకు లాక్ డౌన్ సడలింపు ప్రకటించింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు సాయంత్రం 5కు మూసివేయాలి. జనం 6  గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. ఆ మేరకు సిబ్బందిని కార్యాలయ విధుల్లో వినియోగించుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో కేసులు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో కర్ఫ్యూ యథావిధిగా కొనసాగనుంది. సడలింపు  ఉదయం 6 - మధ్యాహ్నం 2 వరకు అమలులో ఉంటుంది.

Friday, June 11, 2021

CJI NV Ramana to Tour AP&TS

స్వామి కృపతోనే సీజేఐ స్థాయి

శ్రీవేంకటేశ్వరస్వామి దయ వలనే తను ఈరోజు  అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆయన ఆలయానికి విచ్చేసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్ద జస్టిస్ రమణ దంపతులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకకులు వేణుగోపాల దీక్షితులు, ఇతర అర్చకస్వాములు వారికి శ్రీవారి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఈ సాయంత్రం తెలంగాణ రాజ్ భవన్ కు చేరుకున్నారు. సీజేఐ హోదాలో ఆయన తొలిసారి హైదరాబాద్‌కు విచ్చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు శంషాబాద్ ఎయిర్ పోర్టులో జస్టిస్ రమణకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, మంత్రులు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి చీఫ్ జస్టిస్ కారులో తెలంగాణ రాజ్ భవన్‌కు చేరుకున్నారు.

Wednesday, June 9, 2021

Telugu people gave me life Navneet Kaur

శభాష్ సోనూసూద్:నవనీత్ కౌర్

నాటి తెలుగు హీరోయిన్ ప్రస్తుత లోక్ సభ ఎంపీ నవనీత్ కౌర్  రియల్ హీరో సోనూసూద్ సేవల్ని ప్రశంసలతో ముంచెత్తారు. కరోనా నేపథ్యంలో ఆయన బాధితులకు అందించిన చేయూత తమబోటి రాజకీయ నాయకులందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. మహారాష్ట్రలోని అమరావతి (ఎస్సీ) లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచి ఎంపీ అయిన నవనీత్‌ కౌర్‌ కులధ్రువీకరణ పత్రం వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా ఆమె ఎంపీ పదవికి గండం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఓ టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు తెలుగు భాష అంటే ఎంతో అభిమానం. తెలుగు ఇండస్ట్రీ లైఫ్‌ ఇచ్చిందన్నారు. కోవిడ్‌ సమయంలో చాలా మంది విద్యార్థులకు హెల్ప్‌ చేశాను. పార్టీలకతీతంగా పార్లమెంట్‌లో గళం వినిపిస్తున్నా అని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు పలు దక్షిణాది చిత్రాల్లో నవీనత్ తళుక్కున మెరిశారు. తెలుగులో బాలకృష్ణజగపతి బాబు వంటి స్టార్లతో పాటు అల్లరినరేశ్వడ్డే నవీన్ తదితర హీరోలతో పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. అదేవిధంగా తమిళకన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్ గా రాణించారు.  రాజకీయాల్లోకి వచ్చాక పూర్తిగా ప్రజాసేవలోనే నిమగ్నమయినట్లు తెలిపారు. తన భర్త ఎమ్మెల్యే కావడంతో రాజకీయాలపై మరింత ఆసక్తి పెరిగిందన్నారు. అదేవిధంగా మా కుటుంబమంతా రాజకీయాల్లోనే ఉంది.. ప్రజల సహకారం వల్లే రాజకీయాల్లో కొనసాగుతున్నా అని నవనీత్ గర్వంగా చెప్పారు. అమరావతిలో ఇండిపెండెంట్‌గా గెలవాలంటే అంత సులువు కాదు.ప్రజాభిమానమే తనను గెలిపించిందన్నారు. గోవిందాసునీల్‌శెట్టి తన తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారని వారికి తన కృతజ్ఞతలు తెలిపారు.