Monday, April 19, 2021

Mahesh Babu tweets TS CM KCR get well soon recovery

కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మహేష్ బాబు ట్వీట్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. కేసీఆర్ కు సోమవారం నిర్వహించిన ఆర్టీ పీసీఆర్, యాంటిజెన్ పరీక్షల్లో  కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల కోవిడ్ బారిన పడ్డ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ తో పలు సందర్భాల్లో కేసీఆర్ భేటీ అయ్యారు. దాంతో ఆయనలో స్వల్ప కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆయన గజ్వేల్ లోని సొంత వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్ లో ఉన్నారు. 10 రోజుల పాటు ఆయన అక్కడే అవసరమైన చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటారని వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీరావు తెలిపారు. కేసీఆర్ గొప్ప పోరాటయోధుడని ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఎవరూ ఆందోళన చెందవద్దంటూ తనయుడు కేటీరామారావు ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో యావత్ తెలుగుపరిశ్రమ కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. కేటీఆర్ తో వ్యక్తిగత స్నేహమున్న మహేశ్ బాబు వెంటనే స్పందించి సీఎం ఆరోగ్యం గురించి వాకబు చేసినట్లు సమాచారం.

Thursday, April 15, 2021

4 persons from same family died after burnt alive in Visakhapatnam Madhurawada

కుటుంబాన్ని కడతేర్చి.. యువకుడి ఆత్మహత్య

బెహ్రెయిన్ లో స్థిరపడిన ఓ కుటుంబం విశాఖపట్నంలో కడతేరిన ఉదంతమిది. ఇంట్లోని పెద్ద కొడుకే తల్లి,తండ్రి, తమ్ముణ్ని చంపేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా గంట్యాడకు చెందిన సుంకర బంగారినాయుడు (52).. భార్య నిర్మల (44), దీపక్ (22) , కశ్యప్ (19) ఇద్దరు కొడుకులతో నగరంలో నివాసముంటున్నారు. మధురవాడ లోని మిథిలాపురి కాలనీలో ఆదిత్య ఫార్చ్యూన్స్ (ఫ్లాట్ నెం.505)లో  అద్దెకు దిగారు. ఎనిమిది నెలల నుంచి ఈ కుటుంబం ఇక్కడి గెటెడ్ కమ్యూనిటీకి చెందిన అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. ఎన్.ఐ.టి.లో ఇంజనీరింగ్ చేసిన దీపక్ కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అతను ప్రస్తుతం సివిల్స్ కు సిద్ధమవుతున్నాడు. ఆ మానసిక ఒత్తిడితోనే ఇంట్లో తరచు గొడవపడేవాడని ఇరుగుపొరుగు వారి కథనం. గురువారం తెల్లవారుజామున కూడా ఇంట్లో గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. తండ్రి, తల్లి, తమ్ముణ్ని దీపక్ కొట్టి చంపడంతో వారి తలలపైన ఒంటిపైన తీవ్ర గాయాలున్నాయి. ఇంటి లోపల నేల, గోడలపై రక్తపు మరకల్ని గుర్తించినట్లు సీపీ మనీష్ కుమార్ సిన్హా వివరించారు. ప్రాథమిక అంచనా ప్రకారం కుటుంబ సభ్యుల్ని హత్య చేసి వారిపై పెట్రోల్ పోసి అంటించిన అనంతరం దీపక్ కూడా ఒంటికి నిప్పుపెట్టుకున్నట్లు తెలిపారు. దాంతో మొత్తం నాలుగు మృతదేహాలు కాలిన స్థితిలో పోలీసులు గుర్తించారు. తొలుత అగ్నిప్రమాదం జరిగి కుటుంబం సజీవదహనం అయినట్లు భావించారు. గెటెడ్ కమ్యూనిటీ కావడంతో బయట వ్యక్తులు లోపలకు వచ్చే వీలులేనందున ఆత్మహత్యలై ఉండొచ్చని ఆ తర్వాత అనుమానించారు. చివరకు పోలీసులు చుట్టుపక్కల విచారణ చేపట్టడంతో దీపక్ ఈ హత్యలకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. 

Thursday, April 1, 2021

AP CM YSJagan launches covid vaccination for above 45 years people

కరోనా వ్యాక్సినేషన్ లో దేశానికే ఏపీ ఆదర్శం: సీఎం

కోవిడ్ టీకా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యావద్దేశానికే ఆదర్శంగా నిలవనుందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంటూరు భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయానికి సతీమణి వైఎస్‌ భారతితో కలిసి వెళ్లిన సీఎం జగన్ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. జగన్ తో పాటు భారతికి కూడా ఈ రోజు తొలిడోసు టీకా వేశారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ వేయాలని కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జగన్ మాట్లాడుతూ కరోనాను నిలువరించలేమని దానితో సహజీవనం తప్పదని చెప్పారు. అయితే నివారణకు మనదగ్గర ఉన్న ఏకైక అద్భుత అస్త్రం టీకాయేనని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో మనకున్న వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ జాతీయస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ లో ఏపీని ముందువరుసలో నిలబెట్టగలవని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు రెండునెలల్లో రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకా వేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

Monday, March 29, 2021

Bus accident near Visakhapatnam five passengers dead 30 injured

 విశాఖ హైవే రక్తసిక్తం

విశాఖపట్నం-విజయనగరం హైవే రక్తమోడింది. విజయనగరం జిల్లా సుంకరపేట వద్ద సోమవారం ఉదయం జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు మృత్యువాత పడ్డారు. గ్యాస్ లారీ, రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 30 మంది క్షతగాత్రులయ్యారు. వీరిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఎదురెదురుగా వచ్చిన గ్యాస్ సిలండర్ల లారీ, ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. అదే సమయంలో విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు వస్తున్న మరో ఆర్టీసీ బస్సు  ప్రమాదానికి గురైన బస్సును ఢీకొంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే డంపింగ్ యార్డ్ ఉండడం.. తెల్లవారుజామున అక్కడ ఉన్న చెత్తను తగులబెట్టడంతో విపరీతంగా వెలువడిన పొగ కారణంగా డ్రైవర్లకు రోడ్డు సరిగ్గా కనిపించలేదు. దాంతో వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హటాహుటిని దుర్ఘటనా స్థలానికి  చేరుకుని క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అందులో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.