కుటుంబాన్ని కడతేర్చి.. యువకుడి ఆత్మహత్య
బెహ్రెయిన్ లో స్థిరపడిన ఓ కుటుంబం విశాఖపట్నంలో కడతేరిన ఉదంతమిది. ఇంట్లోని పెద్ద కొడుకే తల్లి,తండ్రి, తమ్ముణ్ని చంపేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా గంట్యాడకు చెందిన సుంకర బంగారినాయుడు (52).. భార్య నిర్మల (44), దీపక్ (22) , కశ్యప్ (19) ఇద్దరు కొడుకులతో నగరంలో నివాసముంటున్నారు. మధురవాడ లోని మిథిలాపురి కాలనీలో ఆదిత్య ఫార్చ్యూన్స్ (ఫ్లాట్ నెం.505)లో అద్దెకు దిగారు. ఎనిమిది నెలల నుంచి ఈ కుటుంబం ఇక్కడి గెటెడ్ కమ్యూనిటీకి చెందిన అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. ఎన్.ఐ.టి.లో ఇంజనీరింగ్ చేసిన దీపక్ కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అతను ప్రస్తుతం సివిల్స్ కు సిద్ధమవుతున్నాడు. ఆ మానసిక ఒత్తిడితోనే ఇంట్లో తరచు గొడవపడేవాడని ఇరుగుపొరుగు వారి కథనం. గురువారం తెల్లవారుజామున కూడా ఇంట్లో గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. తండ్రి, తల్లి, తమ్ముణ్ని దీపక్ కొట్టి చంపడంతో వారి తలలపైన ఒంటిపైన తీవ్ర గాయాలున్నాయి. ఇంటి లోపల నేల, గోడలపై రక్తపు మరకల్ని గుర్తించినట్లు సీపీ మనీష్ కుమార్ సిన్హా వివరించారు. ప్రాథమిక అంచనా ప్రకారం కుటుంబ సభ్యుల్ని హత్య చేసి వారిపై పెట్రోల్ పోసి అంటించిన అనంతరం దీపక్ కూడా ఒంటికి నిప్పుపెట్టుకున్నట్లు తెలిపారు. దాంతో మొత్తం నాలుగు మృతదేహాలు కాలిన స్థితిలో పోలీసులు గుర్తించారు. తొలుత అగ్నిప్రమాదం జరిగి కుటుంబం సజీవదహనం అయినట్లు భావించారు. గెటెడ్ కమ్యూనిటీ కావడంతో బయట వ్యక్తులు లోపలకు వచ్చే వీలులేనందున ఆత్మహత్యలై ఉండొచ్చని ఆ తర్వాత అనుమానించారు. చివరకు పోలీసులు చుట్టుపక్కల విచారణ చేపట్టడంతో దీపక్ ఈ హత్యలకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
No comments:
Post a Comment