Tuesday, March 16, 2021

Andhra Pradesh CID Notices To Chandrababu Naidu In Amaravati Lands Scam

చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి సీఐడీ పోలీసులు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు అందజేశారు. రాజధాని భూముల ధారాదత్తంపై ఫిబ్రవరి 24నే చంద్రబాబుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఆయన హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ గత ఆరు నెలలుగా వై.ఎస్.ఆర్.సి.పి సర్కారు పలు విచారణలు చేపట్టిన సంగతి తెలిసిందే.  తాజాగా 500 ఎకరాల అసెన్డ్ భూముల విక్రయాలపై చంద్రబాబుకు ఈ నోటీసులు అందాయి. మంగళవారం ఉదయం ఏపీ సీఐడీ పోలీసు బృందాలు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకుని విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుకు వారం రోజుల గడువిస్తూ ఈనెల 23న విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. సెక్షన్ 41ఏ సి.ఆర్.పి.సి కింద ఈ నోటీసులు జారీ చేశారు. నోటీసుని అందుకుని చంద్రబాబు సంతకం చేశారు. ఆయనతో పాటు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖను నిర్వహించిన మాజీ మంత్రి నారాయణను కూడా ఈనెల 22న విచారణకు హాజరుకావాల్సిందిగా సీఐడీ పోలీసులు నోటీసు అందించారు. అసెన్డ్ భూముల్ని క్రయవిక్రయాలు జరపడం, ప్రత్యేక జీవో ద్వారా రిజిస్ట్రేషన్లు చేయడంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన సీఐడీ పోలీసులు ఈ మేరకు చంద్రబాబు, నారాయణలపై ఎస్సీ,ఎస్టీ కేసు ఫైల్ చేసి ఈ నోటీసులు ఇచ్చారు. వీరు విచారణకు హాజరుకానట్లయితే అరెస్టు చేయాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ విషయమై చంద్రబాబు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

Friday, March 12, 2021

Mumbai based business man signs pact with TTD to donate Rs 300 crore for hospital

టీటీడీకి ముంబయి వ్యాపారవేత్త రూ.300 కోట్ల భారీ విరాళం

తిరుమల వెంకన్న పట్ల ఓ ముంబయి వ్యాపారవేత్త అచంచల భక్తి ప్రపత్తుల్ని చాటుకున్నాడు. తిరుపతిలో నిర్మించతలపెట్టిన చిన్న పిల్లల ఆసుపత్రికి ఏకంగా రూ.300 కోట్ల భారీ విరాళం ప్రకటించాడు.  సంజయ్ సింగ్ అనే ఆ భక్తుడు తన ఫౌండేషన్ ద్వారా యావత్ ఆసుపత్రి నిర్మాణ ఖర్చుని భరిస్తానని తెలిపారు. ఈ మేరకు ఎంఓయూ కుదుర్చుకున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం మీడియాకు వివరాలు అందించారు. కిమ్స్ ఆవరణలో 300 పడకలతో ఈ ఆసుపత్రిని నిర్మించాలని గత ఏడాది టీటీడీ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల బోర్డు సమావేశంలో నూతన హాస్పిటల్ నిర్మాణం గురించి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. మొత్తం ఆసుపత్రి వ్యయాన్ని భరించేందుకు సంజయ్ సింగ్ ముందుకు రావడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Tuesday, March 9, 2021

Andhra Pradesh government allows beneficiaries to get Corona vaccine without registration

ఏపీలో కరోనా టీకా ఈజీగా..

ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినా ఆంధ్రప్రదేశ్ లో ఎంచక్కా కరోనా టీకా తీసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వ్యాక్సిన్ వేసుకోవాలనుకునేవారు జస్ట్ తమ ఆధార్ కార్డులు చూపిస్తే చాలు. అదేవిధంగా ఎంపిక చేసిన 20 దీర్ఘకాలిక వ్యాధుల్లో ఏదో ఒక జబ్బు ఉన్నట్లు టెస్టుల రిపోర్టులు, డాక్టర్లు ఇచ్చిన మందుల చీటీలు చూపిస్తే టీకా వేస్తారు. చూపించిన ఆధారాలతో అక్కడికక్కడే వివరాలు నమోదు చేసి వ్యాక్సిన్ ఇచ్చేలా రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. తొలి విడత వైద్య సిబ్బందికి, రెండో విడతలో పోలీసులు, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవాలంటే తొలుత కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. చాలా మందికి రిజిస్ట్రేషన్ పై అవగాహన లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. వ్యాక్సిన్ వేసుకోవాలనుకునే అర్హులకు మంగళవారం నుంచి ప్రభుత్వం చాలా సులభంగా అందిస్తోంది.

Thursday, March 4, 2021

Tunnels to link PM, VP homes to new Parliament building

 ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసాలకు

పార్లమెంట్ నుంచి సొరంగ మార్గం

ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం నుంచి ప్రధాని నివాసంతో పాటు ఉపరాష్ట్రపతి నివాసం, ఎంపీ చాంబర్స్‌కు సొరంగ మార్గాలను నిర్మిస్తున్నారు. టాటా ప్రాజెక్ట్స్ సంస్థ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తోంది. రూ.971 కోట్ల వ్యయంతో అన్ని హంగులు, అత్యాధునిక టెక్నాలజీతో  కొత్త పార్లమెంట్ భవనం నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. గత డిసెంబరు 10న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణాన్ని దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలువడ్డాయి. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వంటి వీవీఐపీలు రోడ్డు మార్గంలో పార్లమెంట్‌ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొరంగం మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డుపై ప్రధాని కాన్వాయ్ వెళ్తే భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్‌ను నిలిపివేయాలి. కొత్త  పార్లమెంట్ భవనం ఈ సమస్యలకు తెరదించనుంది. అయితే రాష్ట్రపతి ఇంటికి మాత్రం సొరంగ మార్గాన్ని నిర్మించడం లేదు. రాష్ట్రపతి పార్లమెంట్‌కు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తారు. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని, ఉపరాష్ట్రపతి, ఎంపీలు ఏడాదిలో మూడు దఫాలు సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలు జరిగే రోజులన్నీ పార్లమెంట్‌కు రావాలి. అందువల్ల ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసంతో పాటు ఎంపీ చాంబర్స్‌కు సొరంగం మార్గం ఏర్పాటు చేస్తున్నారు. గోల్ఫ్ కార్ట్‌లోనే సొరంగ మార్గం గుండా నేతలు పార్లమెంట్‌కు వెళ్తారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా సౌత్ బ్లాక్‌ వైపు ప్రధాని నివాసం, ప్రధానమంత్రి కార్యాలయం నిర్మిస్తున్నారు. నార్త్ బ్లాక్ వైపు ఉపరాష్ట్రపతి నివాసం రూపుదిద్దుకుంటోంది.