Friday, February 19, 2021

Kerala Doctors Remove Whistle Stuck In Woman's Respiratory System For 25 Years

25 ఏళ్లుగా మహిళ గొంతులో ఇరుక్కున్న విజిల్

  ·శస్త్రచికిత్స ద్వారా వెలికితీసిన కేరళ వైద్యులు

కేరళలోని కన్నూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల వైద్యులు ఒక మహిళకు వీడని పీడ నుంచి విముక్తి  కలిగించారు. సదరు మహిళ శ్వాసకోశ వ్యవస్థ నుంచి విజిల్‌ను విజయవంతంగా వెలికితీశారు. దాంతో 25 ఏళ్లుగా విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న ఆమెకు ఉపశమనం లభించింది. కేరళకు చెందిన ఆ మహిళ తన 15వఏట అనుకోకుండా ఈల మింగింది. అప్పుడు కంగారు పడిన బాలిక అధికంగా నీరు తాగింది. అంతటితో ఆ విజిల్  సమస్య తీరిపోయినట్లు భావించి మిన్నకుండిపోయింది. అయితే ఆ ఈల బాలిక గొంతు నుంచి ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే నాళంలో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆమెకు దగ్గు వీడని పీడగా మారింది. అలా రెండు దశాబ్దాలపాటు తీవ్రమైన దగ్గుతో బాధపడుతూనే ఉంది. ప్రస్తుతం ఆమె 40వ పడిలోకి చేరింది. దగ్గు అంతకంతకు పెరిగిపోతుండడంతో తొలుత ఆస్తమా సోకిందని వైద్యులు అనుకున్నారు. కన్నూర్ జిల్లా మత్తన్నూరులో నివసిస్తున్న ఆమెకు వైద్యం అందిస్తోన్న ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు ఏదో వస్తువు గొంతులో ఇరుక్కున్నట్లు గుర్తించారు. కేసును ప్రభుత్వ వైద్య కళాశాలకు రిఫర్ చేశారు. మెడికల్ కాలేజీ వైద్యులు రాజీవ్ రామ్, పద్మనాభన్ బృందం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి గాలిగొట్టంలో ఇరుక్కున్న విజిల్‌ను బయటకు తీసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సుదీప్ తెలిపారు.

Wednesday, February 17, 2021

Kalyanamasthu scheme revived after 10 years in Tirumala

మే 28 నుంచి మళ్లీ కల్యాణమస్తు!

తిరుమలలో మళ్లీ కల్యాణమస్తు కార్యక్రమానికి ముహూర్తం ఖరారయింది. దాదాపు దశాబ్దం తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మళ్లీ ఈ కార్యక్రమం ప్రారంభించదలిచింది. దేశవ్యాప్తంగా కల్యాణమస్తు పేరిట సామూహిక వివాహాల్ని టీటీడీ నిర్వహించనుంది.  ఈ ఏడాది మే 28  మధ్యాహ్నం 12.34  నుంచి 12:40 వరకు, అక్టోబర్ 30 ఉదయం 11:04 నుంచి 11:08  వరకు,  నవంబర్ 17 ఉదయం 9:56 నుంచి 10.02 వరకు కల్యాణమస్తు ముహూర్తాలు ఖరారు చేశారు. పాలకమండలిలో చర్చించి పెళ్లిళ్ల వేదికలను నిర్ణయిస్తామని టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి తెలిపారు.  కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా వివాహం చేసుకున్న వారికి  మంగళసూత్రం, నూతన వస్త్రాలు, 40 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తామన్నారు.

Tuesday, February 9, 2021

YSSharmila`s new party YSRTP!

షర్మిల కొ్త్త పార్టీ వైఎస్ఆర్టీపీ!

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. ఈ రాష్ట్రంలో రాజన్నరాజ్యం మళ్లీ రావాల్సి ఉందని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల పేర్కొన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆమె మంగళవారం స్వగృహం లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తొలుత షర్మిల నల్గొండకు చెందిన వైఎస్ అనుచరులైన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భేటీ అయ్యారు. ఈరోజు ఫిబ్రవరి 9 వైఎస్ఆర్, విజయమ్మల పెళ్లిరోజని శుభసూచకంగా ఈ ఆత్మీయ సమావేశాలకు శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తను మాట్లాడ్డానికి రాలేదని వారు చెప్పేది వినడానికి వచ్చానన్నారు. స్థానికంగా గల సాధకబాధకాలు వినాలనుకుంటునట్లు చెప్పారు. ఈ రాష్ట్రానికి ఆనాటి వైఎస్ పాలన కావాలని తాము తీసుకువస్తామని షర్మిల తెలిపారు. ఆమె ప్రారంభించనున్న కొత్త పార్టీకి వైఎస్ఆర్టీపీగా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఈసరికే ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. తెల్లనిరంగుపై మండే సూర్యుడి చిహ్నంతో జెండా కూడా ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా ఆమె మళ్లీ పాదయాత్ర చేపట్లనున్నట్లు తెలుస్తోంది. 

Monday, February 8, 2021

What Is Glacial Lake Outburst? What caused flooding in Uttarakhand?

హిమాలయాలతో చెలగాటం..

అందుకే ఉత్తరాఖండ్ విలయం

ఉత్తరాఖండ్‌లో ఈ శీతాకాలంలో హిమపాతం తగ్గింది. దాని వల్లే తాజాగా మంచు చరియలు విరిగిపడి ఉండొచ్చని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ మౌంటెయిన్‌ డెవలప్‌మెంట్‌ (ఐసీఐఎంవోడీ) నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఆదివారం ఉదయం మంచు చరియలు విరిగిపడి ఒక్కసారిగా వరదలు ముంచెత్తడంతో సుమారు 150 మంది మృత్యుఒడికి చేరిన సంగతి తెలిసిందే. విపరీతంగా మంచు కరగడంతో ఇక్కడ మరోసారి జల ప్రళయం సంభవించింది. జోషీ మఠ్‌లో ధౌలిగంగ నదికి అకస్మాత్తుగా వరదలు రావడంతో తపోవన్‌లోని రుషి గంగ పవర్ ప్రాజెక్టుకు భారీ నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా ఈ ప్రాజెక్టులోకి వరద పోటెత్తడంతో అక్కడ పనిచేస్తున్న వందల మంది కార్మికులు గల్లంతయ్యారు. ఎందుకీ వైపరీత్యం అనే అంశంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. శీతాకాలంలో వర్షం, హిమపాతం వల్ల హిమానీ నదాలు పరిపుష్టమవుతాయి. ఈ ఏడాది ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో హిమపాతం తక్కువగా ఉండటం వల్ల హిమానీనదాల నిర్మాణపరమైన లోపాలు సరికాలేదని భావిస్తున్నారు. అందువల్లే ఈ విపత్తు జరిగి ఉంటుందంటున్నారు. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దాదాపు 2 డిగ్రీల మేర పెరిగినట్లు ఐసీఐఎంవోడీ అధ్యయనంలో తేలింది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే భూతాపం ప్రభావం ఇక్కడే ఎక్కువగా ఉందని తద్వారా హిమానీనదాలు వేగంగా తరిగిపోతున్నాయి. మంచు కరగడం, వాతావరణ తీరుతెన్నులూ గందరగోళానికి కారణమని స్పష్టమౌతోంది. వాతావరణ మార్పులు, మానవ చర్యలు, పెరుగుతున్న భూతాపం వల్ల హిమాలయాలకు అపారనష్టం వాటిల్లుతోంది. అప్ఘనిస్థాన్‌ నుంచి మయన్మార్‌ వరకూ 3500 కిలోమీటర్ల మేర విస్తరించిన హిందుకుష్‌ పర్వతశ్రేణులు.. ఎవరెస్టు సహా ప్రపంచంలోనే అతిపెద్ద పర్వత శిఖరాలకు హిమాలయాలు నిలయంగా ఉన్నాయి.  ప్రపంచంలోనే అత్యంత భారీగా మంచినీటి నిల్వలు ఉన్న ప్రాంతం హిమలయాలు. గంగా, మెకాంగ్‌, యాంగ్జీ, బ్రహ్మపుత్ర సహా ఆసియాలోని పది అతిపెద్ద నదులకు మూలధారం. ఇక్కడ 30వేల చదరపు మైళ్లకుపైగా మంచు నిక్షిప్తమై ఉంది. ప్రకృతి సమతౌల్యతను దెబ్బతీస్తే ఏం జరుగుతుందో మరోసారి ఉత్తరాఖండ్ మంచు చరియల దుర్ఘటన నిరూపించింది. విచ్చలవిడిగా విడుదల చేస్తున్న హానికారక వాయువులతో హిమాలయాలకు తీవ్ర ముప్పు వాటిళ్లుతోంది. వాటి నుంచి వెలువడే వేడికి నిలువెల్లా మంచు కొండలు కరిగిపోతున్నాయి. వేల కిలోమీటర్ల మేర విస్తరించిన హిమాలయ పర్వతాలపై ఉన్న హిమానీ నదాలు తరిగిపోయి, జలవిలయానికి కారణమవుతున్నాయి.