హిమాలయాలతో చెలగాటం..
అందుకే ఉత్తరాఖండ్ విలయం
ఉత్తరాఖండ్‌లో ఈ శీతాకాలంలో
హిమపాతం తగ్గింది. దాని వల్లే తాజాగా మంచు చరియలు విరిగిపడి ఉండొచ్చని ఇంటర్నేషనల్
సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్‌మెంట్ (ఐసీఐఎంవోడీ) నిపుణులు
చెబుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఆదివారం ఉదయం మంచు చరియలు విరిగిపడి
ఒక్కసారిగా వరదలు ముంచెత్తడంతో సుమారు 150 మంది మృత్యుఒడికి చేరిన సంగతి తెలిసిందే. విపరీతంగా మంచు కరగడంతో ఇక్కడ
మరోసారి జల ప్రళయం సంభవించింది. జోషీ మఠ్‌లో ధౌలిగంగ నదికి అకస్మాత్తుగా వరదలు
రావడంతో తపోవన్‌లోని రుషి గంగ పవర్ ప్రాజెక్టుకు భారీ నష్టం వాటిల్లింది.
ఒక్కసారిగా ఈ ప్రాజెక్టులోకి వరద పోటెత్తడంతో అక్కడ పనిచేస్తున్న వందల మంది
కార్మికులు గల్లంతయ్యారు. ఎందుకీ వైపరీత్యం అనే అంశంపై జాతీయ, అంతర్జాతీయ
స్థాయి శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. శీతాకాలంలో వర్షం, హిమపాతం వల్ల
హిమానీ నదాలు పరిపుష్టమవుతాయి. ఈ ఏడాది ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో హిమపాతం
తక్కువగా ఉండటం వల్ల హిమానీనదాల నిర్మాణపరమైన లోపాలు సరికాలేదని భావిస్తున్నారు.
అందువల్లే ఈ విపత్తు జరిగి ఉంటుందంటున్నారు. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు
దాదాపు 2 డిగ్రీల మేర
పెరిగినట్లు ఐసీఐఎంవోడీ అధ్యయనంలో తేలింది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే భూతాపం
ప్రభావం ఇక్కడే ఎక్కువగా ఉందని తద్వారా హిమానీనదాలు వేగంగా తరిగిపోతున్నాయి. మంచు కరగడం, వాతావరణ
తీరుతెన్నులూ గందరగోళానికి కారణమని స్పష్టమౌతోంది. వాతావరణ మార్పులు, మానవ చర్యలు, పెరుగుతున్న
భూతాపం వల్ల హిమాలయాలకు అపారనష్టం వాటిల్లుతోంది. అప్ఘనిస్థాన్ నుంచి మయన్మార్
వరకూ 3500 కిలోమీటర్ల మేర
విస్తరించిన హిందుకుష్ పర్వతశ్రేణులు.. ఎవరెస్టు సహా ప్రపంచంలోనే అతిపెద్ద పర్వత
శిఖరాలకు హిమాలయాలు నిలయంగా ఉన్నాయి.
ప్రపంచంలోనే అత్యంత భారీగా మంచినీటి నిల్వలు ఉన్న ప్రాంతం హిమలయాలు. గంగా, మెకాంగ్, యాంగ్జీ, బ్రహ్మపుత్ర సహా
ఆసియాలోని పది అతిపెద్ద నదులకు మూలధారం. ఇక్కడ 30వేల చదరపు మైళ్లకుపైగా మంచు నిక్షిప్తమై ఉంది.
ప్రకృతి సమతౌల్యతను దెబ్బతీస్తే ఏం జరుగుతుందో మరోసారి ఉత్తరాఖండ్ మంచు చరియల
దుర్ఘటన నిరూపించింది. విచ్చలవిడిగా విడుదల చేస్తున్న హానికారక వాయువులతో
హిమాలయాలకు తీవ్ర ముప్పు వాటిళ్లుతోంది. వాటి నుంచి వెలువడే వేడికి నిలువెల్లా
మంచు కొండలు కరిగిపోతున్నాయి. వేల కిలోమీటర్ల మేర విస్తరించిన హిమాలయ పర్వతాలపై
ఉన్న హిమానీ నదాలు తరిగిపోయి, జలవిలయానికి కారణమవుతున్నాయి.
No comments:
Post a Comment