Tuesday, January 19, 2021

Turkey slaps advertising ban on twitter with new social media law

ట్విటర్ పై టర్కీ కొరడా

టర్కీ ట్విటర్ పై కొరడా ఝళిపించింది. మంగళవారం నుంచి అమలులోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం ట్విటర్ దాని అనుబంధ సంస్థలు పెరిస్కోప్, పిన్‌టారెస్ట్ లలో ప్రకటనల నిషేధాన్ని విధించింది. టర్కీలో స్థానిక ప్రతినిధులను నియమించడంలో విఫలమైన ట్విటర్ పై ఈ మేరకు టర్కీ చర్యలు తీసుకుంది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అథారిటీ చట్టం ప్రకారం తమ స్థానిక ప్రతినిధులను నియమించని సోషల్ మీడియా కంపెనీలపై జరిమానాలను సైతం ప్రభుత్వం విధిస్తోంది. ఈ కొత్త చట్టం ప్రకారం తమ దేశ నిబంధనలకు అనుగుణంగా లేని కంటెంట్‌ను ఆయా సోషల్ మీడియా స్థానిక ప్రతినిధులు తొలగించాలి. ముఖ్యంగా విషపు ప్రచారంగా ప్రభుత్వం పేర్కొన్న ట్వీట్లు అన్నింటినీ ఈ ప్రతినిధులు తీసివేయాలి.  ఫేస్‌బుక్  కొత్త నిబంధనలు అమలు పరుస్తున్నప్పటికీ ట్విటర్ మాత్రం తాత్సారం చేస్తుండడంతో టర్కీ ప్రభుత్వానికి చిరెత్తుకొచ్చింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌పై ప్రకటనల నిషేధం పడింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇప్పటికే ఫేస్‌బుక్, యూట్యూబ్ లు ప్రభుత్వానికి భారీ జరిమానాలు చెల్లించుకున్నాయి.  టర్కీలో యథేచ్ఛగా చట్ట ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని ఈ సందర్భంగా టర్కీ ఉప రవాణా మంత్రి ఒమర్ ఫాతిహ్ సయాన్ వ్యాఖ్యానించారు.

Friday, January 15, 2021

Rahul Gandhi attends Tamilanadu Jallikattu Celebrations

జల్లికట్టుకు హాజరైన రాహుల్ గాంధీ

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా  పొంగల్ వేడుకలు సంబరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మదురై సహా ఆయా ప్రాంతాల్లో జోరుగా జల్లికట్టు నిర్వహించారు. అవనియపురంలో వార్షిక జల్లికట్టు (బుల్ టామింగ్) కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులో మూడు రోజుల పర్యటనకు విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,  ద్రవిడ మున్నేట్రా కగం (డిఎంకె) యువజన విభాగం నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్ కే ఎస్ అలగిరి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణసామి సహా ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ సంప్రదాయం, సంస్కృతికి మద్దతుగా తను ఇక్కడకి వచ్చానన్నారు. అయితే రాహుల్ గాంధీ జల్లికట్టుకు హాజరుకావడంపై చాలా మంది నిరసన వ్యక్తం చేశారు. పలువురు బీజేపీ నాయకులు, ఇతర ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ నాయకుడివి అవకాశవాద రాజకీయాలని ఆరోపించారు. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో జల్లికట్టుపై నిషేధానికి యూపీఏ ప్రభుత్వం కారణమని అవనిపురానికి రావడానికి రాహుల్ కు నైతిక హక్కు లేదు అని విమర్శించారు.

Thursday, January 7, 2021

Cold Waves in Telangana next coming four days

గజగజ వణుకుతున్నతెలంగాణ

శీతల పవనాలకు తోడు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలికి  తెలంగాణ గజ గజ వణుకుతోంది. ఈరోజూ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రానున్న మూడు నాలుగు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధ,గురువారాల్లో హైదరాబాద్‌, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వానలు పడుతున్నాయి.  ద్రోణి కారణంగా తూర్పు దిశ నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలోని తేమ దక్షిణ కోస్తా నుంచి తెలంగాణ మీదుగా రావడంతో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తున్నాయి. మరోవైపు పొగమంచు కూడా కమ్మేసింది. ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం ఆదిలాబాద్‌లో 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకాగా, కామారెడ్డిలో 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా సంగారెడ్డి, నిర్మల్, కుమురం భీమ్, వికారాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలు సహా పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

Tuesday, January 5, 2021

7th pay commission according to report central government employees likely to get four percent hike in dearness allowance from January

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు

 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2021 కొత్త సంవత్సరంలో ఏడో వేతన చెల్లింపుల సంఘం వారికి ఈ శుభవార్త చెప్పింది. జనవరి నుంచి వారి జీతాల్లో ఈ మేరకు పెంపు ఉండనుంది. జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కరవు భత్యం (డియర్ నెస్ అలవెన్సు-డీఏ) 4 శాతం అదనంగా పొందనున్నట్లు సమాచారం. అదేవిధంగా పెండింగ్ భత్యాలను వారికి సత్వరం పెంచి అందించేలా ప్రతిపాదించినట్లు తెలిసింది. 2020 మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఈ అంశంపై చర్చించింది. జనవరి 2020 నుంచి అదనపు డీఏతోపాటూ, పెన్షనర్లకు ఉపశమన భత్యం (డియర్ నెస్ రిలీఫ్-డీఆర్) ఇచ్చేందుకు అదనపు నిధులను విడుదల చేసే ప్రతిపాదనను ఆమోదించింది. తాజా రిపోర్టుల ప్రకారం ఇప్పుడు బేసిక్ పే/పెన్షన్‌ కి ఇస్తున్న 17 శాతానికి అదనంగా మరో 4 శాతం కలపబోతున్నట్లు సమాచారం. ఈ పెంపు ద్వారా దేశవ్యాప్తంగా 48.34 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65.26 లక్షల మంది పెన్షనర్లకు మేలు చేకూరనుంది.