గజగజ వణుకుతున్నతెలంగాణ
శీతల పవనాలకు తోడు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలికి తెలంగాణ గజ గజ వణుకుతోంది. ఈరోజూ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రానున్న మూడు నాలుగు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధ,గురువారాల్లో హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వానలు పడుతున్నాయి. ద్రోణి కారణంగా తూర్పు దిశ నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలోని తేమ దక్షిణ కోస్తా నుంచి తెలంగాణ మీదుగా రావడంతో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తున్నాయి. మరోవైపు పొగమంచు కూడా కమ్మేసింది. ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం ఆదిలాబాద్‌లో 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకాగా, కామారెడ్డిలో 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా సంగారెడ్డి, నిర్మల్, కుమురం భీమ్, వికారాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలు సహా పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
No comments:
Post a Comment