Saturday, December 19, 2020

Hectic cold waves in north India

ఉత్తరాదిలో చలి పంజా

ఉత్తర భారతదేశంలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. శీతల గాలులకు జనం వణికిపోతున్నారు. ముఖ్యంగా సిమ్లా, కశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది.  ఢిల్లీలో కూడా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నవెూదవుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ అత్యల్ప డిగ్రీలు ఉష్ణోగ్రతల నమోదులో సిమ్లాతో పోటీపడుతోంది. ఢిల్లీలోని జాఫర్‌పూర్‌లో సాధారణం కన్నా 6 డిగ్రీల దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అదేవిధంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠానికి పడిపోయి గత పదేళ్ల నాటి రికార్డులను బద్దలు కొట్టాయి. ఇక్కడ 0.4 డిగ్రీల ఉష్ణోగ్రత నవెూదైంది. జలంధర్‌లో 1.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బీహార్‌ లోనూ  4 డిగ్రీలకు కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజస్థాన్‌లో గడచిన 24 గంటల్లో అనేక నగరాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నవెూదయ్యాయి. మౌంట్‌ అబూ, చందన్‌ తదితర ప్రాంతాల్లో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.

Friday, December 18, 2020

Nithyananda, absconding rape accused, announces visa for Kailasa, flights from Australia

కైలాస దేశానికి నిత్యానంద ఆహ్వానం

   ·   వీసాకు kailaasa.org లో సంప్రదించొచ్చు

`కైలాస` పేరుతో ఏకంగా దేశాన్నే ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన వివాదాస్పద నిత్యానందస్వామి తాజాగా వీసా ఆహ్వానంతో తెరముందుకు వచ్చారు. ఈ ఏడాది వినాయకచవితి రోజున తమ దేశంలో రిజర్వుబ్యాంక్ ను కూడా ఏర్పాటు చేసినట్లు స్వాములవారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎక్కడుందో తెలియని దేశానికి హిందూమత ప్రేమికులకు వీసా ఇస్తామంటూ ఆహ్వానం పలికారు. ఆస్ట్రేలియా వరకు సొంత ఖర్చులతో వచ్చిన వారిని తామే స్వయంగా సకల లాంఛనాలతో తమ దేశంలోకి తీసుకుపోతామన్నారు. పరమశివుని సందర్శించడానికి అనుమతిస్తామని సెలవిచ్చారు. అత్యాచారం, మహిళల అక్రమ నిర్బంధం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ నిత్యానందస్వామి ఏడాదిగా పరారీలో ఉన్నారు. ఓ దివిలో తలదాచుకుంటున్న స్వామి ఆకస్మికంగా కైలాస పేరుతో ఓ దేశాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు.  ఇందులో ఆరోగ్య శాఖ, రాష్ట్ర విభాగం, సాంకేతిక విభాగం, జ్ఞానోదయ నాగరికత విభాగం, విద్యా శాఖ, మానవ సేవల విభాగం, హౌసింగ్ విభాగం, వాణిజ్య విభాగం, ఖజానా విభాగం ఉన్నాయని వివరించారు. రిషభ ధ్వజ- కైలాస జెండాలో నిత్యానందతో పాటు దేశ జాతీయ జంతువు నంది కూడా ఉంది. కైలాస దేశానికి వెళ్లగోరే వారు kailaasa.org లో సంప్రదించొచ్చునట. 

Thursday, December 17, 2020

PSLV-C50 successfully launches CMS-01 from Sriharikota

పీఎస్ఎల్వీ-సీ50 సక్సెస్

పీఎస్ఎల్వీ-సి50 రాకెట్‌ నింగిలోకి దిగ్విజయంగా దూసుకెళ్లింది. సీఎంఎస్-01 దేశీయ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని నిప్పులు చిమ్ముకుంటూ సగర్వంగా మోసుకెళ్లింది. ఇస్రో సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు ఈ శాటిలైట్ ను కక్ష్యలోకి పంపింది.  నిర్దేశిత సమయంలోనే ఉపగ్రహం కక్ష్యలోకి చేరుకునేలా శాస్త్రవేత్తలు కృషి చేశారు. పీఎస్ఎల్వీ కేటగిరిలో ఇది 52వ ప్రయోగం కాగా ఎక్సెల్ కేటగిరిలో 22వది. 42వ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ లాంచ్ ప్రయోగం. మొత్తంగా ఇస్రోకు ఇది 77వ రాకెట్‌ ప్రయోగం. 2011లో ప్రయోగించిన జీశాట్‌-12 కాలపరిమితి ముగిసిపోవడంతో దాని ప్లేస్‌లో జీశాట్‌-12ఆర్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలని ఇస్రో నిర్ణయించింది. అయితే ప్రస్తుతం దాని పేరును సీఎంఎస్-01గా మార్చి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. గతంలో జీశాట్‌-12 ఉపగ్రహాన్ని 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూస్థిర కక్షలోకి ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం సీఎంఎస్-01 శాటిలైట్‌  42 వేల 164 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరగనుంది. మొత్తం 1410 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహం అండమాన్‌, ‌నికోబార్‌ ‌దీవులు, లక్షద్వీప్‌ ‌దీవులతో పాటు యావత్ భారత్ దేశంలో కమ్యూనికేషన్ సేవలను అందించనుంది. ఏడేళ్ల పాటు ఈ ఉపగ్రహం విధులు నిర్వర్తించనుంది. ఇస్రో చైర్మన్ కె.శివన్ ఈ ప్రయోగ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలిపారు.

Wednesday, December 16, 2020

TRS gets cracking on crucial Nagarjunasagar bypoll

మార్చిలో తిరుపతి, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు!

తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక మార్చిలో జరగవచ్చని తెలుస్తోంది. ఆ మేరకు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇటీవల నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాలమరణం చెందిన సంగతి తెలిసిందే. దాంతో టీఎస్ లో మరో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల సీటును పార్టీ కోల్పోయింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాలమరణంతో జరిగిన ఉపఎన్నికలో బీజేపీ గెలుపొందింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీకి ఆశించిన ఫలితం దక్కలేదు. మరోసారి అలా జరగకూడదని టీఆర్ఎస్ భావిస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి వైఎస్ఆర్ సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మరణించారు. ఆ స్థానానికి ఉపఎన్నిక జరగాల్సి ఉంది. ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఈ రెండు స్థానాలకు మార్చిలో ఒకేసారి షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.