Sunday, November 8, 2020

CM Jagan condolences to YSRCP Kakinada city president Frooti Kumar`s Death

వైఎస్సార్సీపీ తూ.గో. నేత మృతి: సీఎం సంతాపం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్ కరోనాతో ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన చురుగ్గా పనిచేస్తున్నారు. కరోనా సోకడంతో గత కొంతకాలంగా విశాఖపట్నంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. ఇటీవల సీఎం జగన్.. ఫ్రూటీకుమార్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి చంద్రకళా దీప్తికి ఫోన్‌ చేసి ఆరా తీశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన అకాల మరణం బాధిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుమార్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఇలా జరగడం పట్ల విచారం వెలిబుచ్చారు.

Friday, November 6, 2020

TV9 has bagged a record 17 NT awards

టీవీ9 కు ఎన్టీ అవార్డుల పంట

టీవీ9 తెలుగు రికార్డు స్థాయిలో న్యూస్ టెలివిజన్ అవార్డులు సాధించింది. వివిధ విభాగాల్లో మొత్తం 17 అవార్డులు సొంతం చేసుకుని కాలరేగరేసింది. బెస్ట్ న్యూస్ డిబేట్ షో అవార్డును `బిగ్ న్యూస్ బిగ్ డిబేట్` దక్కించుకోగా బెస్ట్ ప్రైమ్టీవీ న్యూస్ యాంకర్ అవార్డును మురళీకృష్ణ కైవసం చేసుకున్నారు. బెస్ట్ టీవీ న్యూస్ ప్రెజెంటర్ అవార్డు పూర్ణిమకు లభించింది. బెస్ట్ డైలీ న్యూస్ బులిటెన్ అవార్డు `టాప్ న్యూస్ 9` ఖాతాలో వేసుకుంది. అదేమాదిరిగా బెస్ట్ టీవీ న్యూస్ రిపోర్టర్ గా అశోక్ వేములపల్లి, బెస్ట్ యంగ్ టీవీ జర్నలిస్ట్ గా స్వప్నిక అవార్డులు గెలుచుకున్నారు. బెస్ట్ ప్రైమ్ టైమ్ న్యూస్ షో అవార్డును `అనగనగా ఒక ఊరు` దక్కించుకుంది. అలాగే టీవీ9 తెలుగు బెస్ట్ న్యూస్ చానల్ వెబ్సైట్ అవార్డు tv9telugu.com ను వరించింది.

Tuesday, November 3, 2020

3 Killed in Vienna `Terror Attack` At 6 Locations

వియన్నాలో ఉగ్రపంజా

          · ముంబయి దాడి తరహాలో ఘటన

ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉగ్రవాదులు పంజా విసిరారు. దేశంలో మంగళవారం నుంచి రెండో విడత కరోనా లాక్ డౌన్ విధించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా సోమవారం అర్ధరాత్రి వరకు హోటళ్లు, మార్కెట్, మాల్స్ లో ఆనందంగా గడిపారు. ఇదే అదునుగా వియన్నా లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో ముష్కరులు ఇష్టానుసారం కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ముగ్గురు దుర్మరణం చెందగా మరో 15 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సెంట్రల్ వియన్నా అంతటా సోమవారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో జట్లుగా విడిపోయిన ఉగ్రవాదులు పెద్దఎత్తున కాల్పులకు దిగారు.  ఈ దుశ్చర్యను ఛాన్సలర్ సెబాస్టియన్ కుర్జ్ `పాశవిక ఉగ్రవాద దాడి`గా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిలో ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా బంధించినట్లు తెలుస్తోంది. అయితే ప్రజలంతా నగరం మధ్యలోనే సురక్షితంగా ఉండాలని సరిహద్దు తనిఖీలను ముమ్మరం చేశామని దేశ అంతర్గత వ్యవహారాలశాఖ (హోం) మంత్రి కార్ల్ నెహమ్మర్ తెలిపారు. పిల్లలు మంగళవారం పాఠశాలకు హాజరు కానవసరం లేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారత్ లో పన్నేండేళ్ల క్రితం (2008 నవంబర్ 26-29 తేదీల్లో) పాక్ నుంచి దేశంలోకి చొరబడిన లష్కర్ ఎ తోయిబాకు చెందిన ముష్కరులు 166 మందిని బలిగొన్న సంగతి తెలిసిందే. నాడు ఈ ఉగ్రదాడిలో మొత్తం 10 మంది పాల్గొన్నారు.

Saturday, October 31, 2020

Government directs private schools to cut tuition fee by 30%

30% ఫీజుల కోతకు సర్కారు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూలు, కాలేజీ ఫీజుల్లో కోత విధిస్తూ శుభవార్తను అందించింది. స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ (ఎ.పి.ఎస్.ఇ.ఆర్.ఎం.సి) సిఫారసు ఆధారంగా, ప్రస్తుత విద్యా సంవత్సరానికి (2020-21) ఫీజుల్లో 30% తగ్గించి వసూలు చేయాలని ఆదేశించింది. విద్యా సంవత్సరానికి గాను ట్యూషన్ ఫీజులో 70 శాతం మాత్రమే వసూలు చేయాలని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు తెలియపర్చింది.
కోవిడ్ -
19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వెసులుబాటు తప్పనిసరి అయినందునే ఈమేరకు ఆదేశాలిచ్చినట్లు జగన్ సర్కారు స్పష్టం చేసింది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు 2020-21 సంవత్సరానికి సమీక్షించి ఫీజులు నిర్ణయించాలని ఎ.పి.ఎస్‌.ఇ.ఆర్‌.ఎం.సి. ఇంతకుముందే ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ఈ  మే 26 న నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేగాక సంబంధిత డేటాను సమర్పించాలని యాజమాన్యాల్ని ఆదేశించింది. ఇదిలావుండగా తాజా ఆదేశాలను లెక్కజేయకుండా పూర్తి ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.                                                                  
నవంబర్ 2 నుంచి 9,10 తరగతులు, ఇంటర్‌కు క్లాస్‌లు జరుగుతాయి. 23 నుంచి 6,7,8 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్-14 నుంచి 1,2,3,4,5 తరగతులకు క్లాస్‌లు ప్రారంభమవుతాయి. రోజు విడిచి రోజు పాఠశాలల్లో తరగతులు నిర్వహించనున్నట్లు ఇటీవల ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహిస్తామని ఇదివరకే ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.