వియన్నాలో ఉగ్రపంజా
· ముంబయి దాడి తరహాలో ఘటన
ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉగ్రవాదులు పంజా విసిరారు. దేశంలో మంగళవారం నుంచి రెండో విడత కరోనా లాక్ డౌన్ విధించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా సోమవారం అర్ధరాత్రి వరకు హోటళ్లు, మార్కెట్, మాల్స్ లో ఆనందంగా గడిపారు. ఇదే అదునుగా వియన్నా లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో ముష్కరులు ఇష్టానుసారం కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ముగ్గురు దుర్మరణం చెందగా మరో 15 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సెంట్రల్ వియన్నా అంతటా సోమవారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో జట్లుగా విడిపోయిన ఉగ్రవాదులు పెద్దఎత్తున కాల్పులకు దిగారు. ఈ దుశ్చర్యను ఛాన్సలర్ సెబాస్టియన్ కుర్జ్ `పాశవిక ఉగ్రవాద దాడి`గా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిలో ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా బంధించినట్లు తెలుస్తోంది. అయితే ప్రజలంతా నగరం మధ్యలోనే సురక్షితంగా ఉండాలని సరిహద్దు తనిఖీలను ముమ్మరం చేశామని దేశ అంతర్గత వ్యవహారాలశాఖ (హోం) మంత్రి కార్ల్ నెహమ్మర్ తెలిపారు. పిల్లలు మంగళవారం పాఠశాలకు హాజరు కానవసరం లేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారత్ లో పన్నేండేళ్ల క్రితం (2008 నవంబర్ 26-29 తేదీల్లో) పాక్ నుంచి దేశంలోకి చొరబడిన లష్కర్ ఎ తోయిబాకు చెందిన ముష్కరులు 166 మందిని బలిగొన్న సంగతి తెలిసిందే. నాడు ఈ ఉగ్రదాడిలో మొత్తం 10 మంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment