Saturday, September 12, 2020

PubG ban B.tech student self elimination in anantapur


బీటెక్ విద్యార్థిని బలిగొన్న పబ్జీ గేమ్

ఎంతో భవిత ఉన్న ఓ బీటెక్ విద్యార్థి ఆన్ లైన్ గేమ్ కు బానిసై బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఇది. అనంతపురం రెవెన్యూ కాలనీలో నివాసముంటున్న నరసింహారెడ్డి పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్‌రెడ్డి (23) గత కొంతకాలంగా పబ్జీ గేమ్ కు బానిసయ్యాడు. చెన్నైలో అతను బీటెక్ చదువుతున్నాడు. అక్కడ ఉండగానే ఈ పబ్జీ గేమ్ ఆడ్డానికి అలవాటు పడ్డాడు. లాక్ డౌన్ నేపథ్యంలో అనంత స్వగృహానికి చేరుకుని గత అయిదు నెలలుగా కుటుంబసభ్యులతోనే ఉంటున్నాడు. చైనాతో పరిణామాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఈ పబ్జీ గేమ్ నూ నిషేధించింది. పబ్‌జీ సహా 118 చైనా యాప్‌లపై భారత సర్కారు వేటు వేసింది. ఈ ఆట కు బానిసైన కిరణ్ గత కొద్ది రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం అతను కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు మూడో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే శనివారం  కిరణ్ సొంత ఇంట్లోని స్టోర్ రూమ్ లో శవంగా కనిపించాడు. అందులోనే ఉరివేసుకుని చనిపోయాడని తెలుస్తోంది. అయితే అతను ఈరోజే చనిపోయాడా మూడ్రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే విషయమై పోలీసు విచారణ కొనసాగుతోంది. అనంత సర్వజన ఆసుపత్రికి కిరణ్ మృతదేహాన్ని తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Monday, September 7, 2020

Hyderabad Metro Services Resume After Centres Unlock4 Guidelines Less Footfall Seen


మెట్రో ప్రారంభం.. పలుచగా జనం

దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి మెట్రో రైలు సర్వీసులు పున:ప్రారంభమయ్యాయి. మార్చి 22న ఆగిన మెట్రో రైలు కూత మళ్లీ ఈ ఉదయం నుంచే వినపడుతోంది. అయితే కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీ అంతంతమాత్రంగానే ఉంది. దేశంలోని 11 నగరాల్లో ఈ సోమవారం ఉదయం నుంచి మెట్రో సర్వీసుల్ని పునరుద్ధరించారు. అన్ లాక్ 4లో సడలించిన నిబంధనల ప్రకారం మాస్కులు ధరించి భౌతికదూరం పాటిస్తూ చేతులు శానిటైజ్ చేసుకున్న ప్రయాణికుల్నే మెట్రోలోకి అనుమతిస్తున్నారు. అదే విధంగా టికెట్ల ను క్యూఆర్ కోడ్ ద్వారా లేదా స్మార్ట్ కార్డ్  ద్వారా పొందే వీలు కల్పించారు. హైదరాబాద్‌లో సైతం మార్చి 22న ఆగిన మైట్రో రైళ్లు ఈరోజే  మళ్లీ ట్రాక్ ఎక్కాయి. కారిడార్-1 మియాపూర్- ఎల్బీనగర్ మధ్య మెట్రో కూత వినిపించింది. లాక్ డౌన్ కు ముందు వరకు హైదరాబాద్ మెట్రో ద్వారా నిత్యం దాదాపు లక్షమంది ప్రయాణించేవారు. ఇప్పుడు మూడో వంతు మందికి మాత్రమే అనుమతి ఉంది..అంటే కేవలం 30 వేల మందికే ప్రయాణించే అవకాశం కల్పించారు.

Friday, September 4, 2020

rummy the e-gambling ban in AP


ఆన్ లైన్ పేకాటపై ఏపీ కొరడా

రమ్మీ, పోకర్‌ తదితర ఆన్ లైన్  జూదాలను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ఈ జూదాల్ని ఆడేవారికి, నిర్వహించే వారికీ జైలు శిక్ష సహా జరిమానా విధించాలని జగన్ సర్కారు తీర్మానించింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. ఏపీ గేమింగ్‌ యాక్టు (1974) సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేవారికి 6నెలలు జైలు శిక్ష విధిస్తారు. నిర్వాహకులకు మొదటిసారి ఏడాది శిక్షతో పాటు జరిమానా పడుతుంది. రెండోసారి పట్టుబడితే రెండేళ్లు జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ఆన్‌లైన్‌లో జూదాన్ని ప్రోత్సహించి యువతను పెడదోవ పట్టిస్తున్న సంస్థలపై ఉక్కుపాదం మోపాలని జగన్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉండడం పట్ల మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Thursday, September 3, 2020

sightseeing re-starts in Hyderabad

చార్మినార్, గోల్కొండ కోటలకు మళ్లీ జన కళ

కరోనాతో అతలాకుతలం అయిన భాగ్యనగర పర్యాటక రంగం మెల్లగా కుదుట పడుతోంది. అన్ లాన్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు చారిత్రక చార్మినార్, గోల్కొండ కోట తదితరాల్ని సందర్శించి ఆనందిస్తున్నారు. కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో మాత్రమే సందర్శకుల్ని ఈ ప్రాంతాలకు అనుమతిస్తున్నారు. దాంతో ఇప్పుడిప్పుడే చార్మినార్, గోల్కొండ కోటల్లో జనసందడి మొదలయింది. సిటీలోని ఈ సందర్శనాత్మక ప్రాంతాల్లో రోజుకు 200 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్-నవంబర్ నాటికి కరోనా మహమ్మారి పూర్తిగా సద్దుమణగవచ్చని.. అప్పటి నుంచి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజికి తగ్గరీతిలో పర్యాటక రంగం ఊపందుకోగలదని అంచనా వేస్తున్నారు. నగరంలో ప్రస్తుతం 55 వరకు గల పర్యాటక ప్రాంతాల్లో కేవలం 10 వేల మంది సందర్శకులకు మాత్రమే అనుమతి లభిస్తోంది. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో క్రమేణా పెరగవచ్చని ఆశిస్తున్నారు.