Thursday, September 3, 2020

sightseeing re-starts in Hyderabad

చార్మినార్, గోల్కొండ కోటలకు మళ్లీ జన కళ

కరోనాతో అతలాకుతలం అయిన భాగ్యనగర పర్యాటక రంగం మెల్లగా కుదుట పడుతోంది. అన్ లాన్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు చారిత్రక చార్మినార్, గోల్కొండ కోట తదితరాల్ని సందర్శించి ఆనందిస్తున్నారు. కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో మాత్రమే సందర్శకుల్ని ఈ ప్రాంతాలకు అనుమతిస్తున్నారు. దాంతో ఇప్పుడిప్పుడే చార్మినార్, గోల్కొండ కోటల్లో జనసందడి మొదలయింది. సిటీలోని ఈ సందర్శనాత్మక ప్రాంతాల్లో రోజుకు 200 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్-నవంబర్ నాటికి కరోనా మహమ్మారి పూర్తిగా సద్దుమణగవచ్చని.. అప్పటి నుంచి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజికి తగ్గరీతిలో పర్యాటక రంగం ఊపందుకోగలదని అంచనా వేస్తున్నారు. నగరంలో ప్రస్తుతం 55 వరకు గల పర్యాటక ప్రాంతాల్లో కేవలం 10 వేల మంది సందర్శకులకు మాత్రమే అనుమతి లభిస్తోంది. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో క్రమేణా పెరగవచ్చని ఆశిస్తున్నారు.

Monday, August 31, 2020

Pranab Mukherjee, ex-president and Congress veteran, dies in Delhi hospital


ప్రణబ్‌దా అస్తమయం

భారతరత్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు ప్రారంభంలో ప్రణబ్ కి డాక్టర్లు కీలకమైన శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత కరోనా కూడా నిర్ధారణ కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. అవయవాలేవీ పనిచేయకపోవడంతో కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ప్రణబ్ ముఖర్జీకి చికిత్స అందిస్తున్నా ఫలితం లేకుండాపోయింది. ఆయన మరణంతో దేశం గొప్ప రాజనీతిజ్ఞుడ్ని కోల్పోయిందని పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. రాష్ట్రప​తి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీతో పాలు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలను స్మరించుకొనేందుకు దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాపం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రాష్ట్రపతి భవన్‌తో సహా అన్ని కార్యాలయాలపై జాతీయజెండా అవనతం చేయాలని కేంద్రం ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో ప్రణబ్‌ అంత్యక్రియలు మంగళవారం నిర్వహించేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక వందనంతో తుది వీడ్కోలు పలకనున్నారు. దాదాలేని ఢిల్లీని ఊహించలేమని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Sunday, August 30, 2020

Death toll in restaurant collapse in China rises to 29

చైనాలో హోటల్ కుప్పకూలి 29 మంది దుర్మరణం

చైనాలో చోటు చేసుకున్న ఘోర దుర్ఘటనలో 29 మంది దుర్మరణం పాలయ్యారు. జియాంగ్ఫెన్ కౌంటీలోని చెంజ్వాంగ్ గ్రామంలో జుజియన్ అనే హోటల్ శనివారం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. 80 ఏళ్ల వృద్ధుడి జన్మదిన వేడుకను  నిర్వహిస్తుండగా ఈ దారుణం జరిగింది. వేడుక జరుగుతున్న సమయానికి ఆ రెండంతస్తుల రెస్టారాంట్ లో 57 మంది ఉన్నారు. వీరిలో 29 మంది మృత్యుపాలవ్వగా ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 21 మంది స్వల్ప గాయాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు జిన్హూ వార్త సంస్థ పేర్కొంది. ఈ దుర్ఘటన ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్స్లో సంభవించినట్లు అధికార వర్గాలు ఆదివారం వెల్లడించాయి. 

Friday, August 28, 2020

Karnataka Govt Issues Revised Guidelines For Inter-State Travellers Relaxes Conditions Of Quarantine

కర్ణాటక ప్రయాణికులకు శుభవార్త!

బెంగళూరు, కర్ణాటక వెళ్లాలనుకునే వారికి కచ్చితంగా ఇది శుభవార్తే. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి ముఖ్యంగా బెంగళూరు రావాలనుకునే ప్రయాణికులకు కోవిడ్ ఆంక్షలను సర్కారు సులభతరం చేసింది. అంతర్రాష్ట్ర రాకపోకలపై ఇప్పటివరకూ విధించిన నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం యడ్యూరప్ప ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల అంతర్రాష్ట సరిహద్దుల్లో రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేయాలని కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక, బెంగళూరు వచ్చేవారిలో కరోనా లక్షణాలు ఉంటే హోం క్వారంటైన్‌లో ఉండి `ఆప్తమిత్ర` హెల్త్‌ లైన్‌ నంబర్ 14410కి ఫోన్ చేసి చికిత్స పొందొచ్చు. అదేమాదిరిగా ఇప్పటివరకూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు `సేవా సింధు` పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాల్సి వచ్చేది. ఇక ఆ నిబంధన ఉండదు. అంతేకాదు బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో వచ్చేవారికి కరోనా టెస్టులు చేయరు. క్వారంటైన్ నిబంధన కూడా ఉపసంహరించారు. కరోనా లక్షణాలున్న వారు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం పాటించడంతో పాటు వైద్యం పొందాల్సి ఉంటుంది. మాస్క్, భౌతిక దూరం వంటి నిబంధనల్ని అందరూ పాటించాలని ప్రభుత్వం సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయి.