Sunday, May 31, 2020

Protests over police killings rage in dozens of US cities

అల్లర్లతో అట్టుడుకుతున్న అమెరికా

పోలీస్‌ కస్టడీలో నల్లజాతి వ్యక్తి మరణం దరిమిలా అమెరికాలోని పలు నగారాల్లో ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. అమెరికాలో న్యూయార్క్, బ్రూక్లిన్, కెంటకీ, టెక్సాస్, అట్లాంటా, జార్జియా, మిచిగాన్, పోర్ట్ ల్యాండ్ తదితర నగరాల్లో ఆందోళనకారులు రెచ్చిపోవడంతో సైన్యాన్ని రంగంలోకి దించారు. సామాజిక దూరం నిబంధనలను గాలికొదిలేసి మాస్క్‌లు ధరించకుండా పలువురు ఆందోళనలకు దిగుతున్నారు. కాలిఫోర్నియాలో బ్యాంకు, పోర్ట్ ల్యాండ్‌లో పోలీసు వాహనాలకు, పలు చోట్ల షాపులు, ఇతర భవనాలకు నిప్పు పెట్టారు. మినియాపోలిస్‌లో శనివారం జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుణ్ని దొంగతనం నేరం కింద అదుపులోకి తీసుకునే క్రమంలో ఓ పోలీస్ అధికారి ఆయన మెడపై మోకాలితో బలంగా నొక్కి కూర్చున్నాడు. దాంతో అతను గిలగిల్లాడుతూ ప్రాణాలొదిలాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జార్జ్ ఫ్లాడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్‌ పట్ల పోలీస్ అధికారి క్రూర ప్రవర్తన దావానలంలా అమెరికా అంతటా వ్యాపించడంతో ఘర్షణలు పెల్లుబికుతున్నాయి. రాత్రి కర్ఫ్యూను సైతం ఉల్లంఘించి ఆందోళనకారులు హింసాకాండకు పాల్పడ్డారు. లాస్ ఏంజిల్స్‌లో నిరసనకారులు `బ్లాక్ లైవ్స్ మేటర్` అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అప్రమత్తమయ్యారు. 1992లో రోడ్నే కింగ్‌ అనే నల్లజాతీయుడిని పోలీసులు పొట్టనబెట్టుకోవడంతో ఇదే విధంగా అల్లర్లు చెలరేగాయి. దాంతో నాడు సైన్యాన్ని రంగంలోకి దిచారు. మళ్లీ 28 ఏళ్ల తర్వాత అమెరికాలో అల్లర్ల అదుపునకు సైన్యాన్ని రంగంలోకి దించడం ఇదే ప్రథమం.

Thursday, May 28, 2020

AP Ex CM TDP founder NTR`s 97th birth anniversary

కేసీఆర్, జగన్ లకు ఎన్టీఆర్ ఆశీస్సులు:లక్ష్మీ పార్వతి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఉభయ తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిలకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి అన్నారు. ప్రజల కోసం అహరహం శ్రమించి వారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ ఈ ఇద్దరి నేతలకు ఆదర్శమని ఆమె గుర్తు చేశారు. అందుకే వారికి ఆ మహనీయుని ఆశీస్సులు సదా తోడుగా ఉంటాయన్నారు. ఎన్టీఆర్ 97వ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని పుష్పాంజలి ఘటించారు. లక్ష్మీపార్వతి కూడా విడిగా ఆయన సమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయ, తనయులు పురందేశ్వరి, బాలకృష్ణ ఘాట్ లో ఈ సందర్భంగా తమ తండ్రి ఘనకీర్తిని గుర్తు చేసుకున్నారు.

Sunday, May 24, 2020

Shashi Kala no entry Veda Nilayam

పోయెస్ గార్డెన్ లో శశికళకు నో ఎంట్రీ!
జైలు నుంచి బయటకు వచ్చాక కూడా శశికళ పూర్వవైభవం పొందడం అసాధ్యమేనని ప్రస్తుత పరిణామాలు స్పష్టీకరిస్తున్నాయి. పోయెస్ గార్డెన్ తో ఆమె అనుబంధం పూర్తిగా తెగిపోనుంది. జయలిలతతో పాటు అందులోనే ఆమె నివసిస్తూ చక్రం తిప్పారు. జయలలిత నెచ్చెలిగా.. చిన్నమ్మగా శశికళ తమిళనాడులో ఓ వెలుగువెలిగారు. అయితే అదంతా గతం. పురచ్చితలైవిగా రాష్ట్ర ప్రజలతో జేజేలు అందుకున్న జయలలిత మరణించాక ఆ స్థానాన్ని శశికళ అందుకున్నారు. అమ్మ నివసించిన పోయెస్ గార్డెన్ (వేదనిలయం)లో శశికళ హవా చాలా కాలం కొనసాగింది. రాష్ట్ర ఎన్నికల చరిత్రను మలుపుతిప్పుతూ రెండోసారి అన్నాడీఎంకేను అధికారంలోకి తెచ్చిన జయ కొద్దికాలంలోనే అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో పార్టీపై పూర్తి పట్టుకల్గిన శశికళ ముఖ్యమంత్రి పీఠం అధీష్ఠించడమే తరువాయి అనుకున్న దశలో కోర్టు తీర్పు రూపంలో ఆమె దూకుడుకు బ్రేకులు పడ్డాయి. స్వల్ప వ్యవధిలోనే అగ్రనాయకులతో సహా చిన్నాపెద్ద నాయకులు అంతా శశికళ పట్టు నుంచి తప్పించుకుపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉన్నత న్యాయస్థానం ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష విధించడంతో బెంగళూరు సమీపంలోని పరప్పన అగ్రహార జైలులో ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు. శిక్షాకాలం మధ్యలో శశికళ పెరోల్ పై విడుదలయిన సందర్భాల్లోనూ ఆమె పోయెస్ గార్డెన్ లోకి అడుగుపెట్టలేకపోయారు. అప్పటికే అమ్మ నివసించిన ఇంటిని ప్రభుత్వం స్మారక భవనంగా ప్రకటించడమే అందుకు కారణం. ఆ క్రమంలోనే సర్కారు పోయెస్ గార్డెన్ ను తీర్చిదిద్దుతోంది. ఈ విషయమై న్యాయస్థానంలో కేసు నడుస్తున్నా అధికార అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది. 2021లో జైలు జీవితం ముగించి బయటకు వచ్చినా చిన్నమ్మ గార్డెన్‌లోకి అడుగుపెట్టలేదు. అందుకు గాను ముఖ్యమంత్రి పళనీస్వామి చకచకా పావులు కదుపుతున్నారు. గవర్నర్ సంతకం అయిన వెంటనే పోయెస్ గార్డెన్ జయమ్మ స్మారక మందిరంగా రూపుదాల్చనుంది. దాంతో శశికళ ఇక తన జీవితకాలంలో అందులో మకాం పెట్టడం సాధ్యం కాదు. ఇంతకుమునుపు పెరోల్ పై చెన్నై వచ్చిన శశికళ తన బంధువు ఇంట్లో ఉండక తప్పలేదు. చిన్నమ్మ కోసం కొత్త షెల్టర్‌పై `అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం` దృష్టి పెట్టింది. ఇప్పటికే చిన్నమ్మ ప్రతినిధిగా ఉన్న `అమ్మ` పార్టీ అధినేత, ఆర్కేనగర్ ఎమ్మెల్యే దినకరన్‌ రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయానికి కూత వేటు దూరంలో బ్రహ్మాండమైన భవనాన్ని తీర్చిదిద్దారు. అయితే ఆ భవనాన్ని కేవలం పార్టీ కార్యకలాపాల కోసం వినియోగించనున్నారు. అదేవిధంగా పోయెస్ గార్డెన్ కు సమీపంలో శశికళ కోసం మరో భవనాన్ని ఏర్పాటు చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నట్లు సమాచారం.

Saturday, May 16, 2020

From Thermal screening to mask identification: Robots by Jaipur company set to ease work for COVID-19 warriors

కరోనాపై రోబోల యుద్ధం
కరోనా మహమ్మారి బెడద దీర్ఘకాలంగా కొనసాగనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరికల నేపథ్యంలో భారత్ సైతం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది.  చైనా, జపాన్ లాంటి దేశాల్లో విరివిగా కనిపించే రోబోలు  మన దేశంలోనూ ఇబ్బడిముబ్బడిగా మోహరించనున్నాయి. రాజస్థాన్ జైపూర్‌లోని ఓ టెక్నాలజీ కంపెనీ  కరోనా వారియర్ రోబోలను తయారుచేస్తోంది. ఈ రోబోలు కరోనా రోగులకు సేవలు చేసే డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు తోడుగా సేవలందించనున్నాయి. ఈ రోబోలు స్వయంగా థర్మల్ స్క్రీనింగ్ చేస్తాయి. మనిషి వాటి ముందు నిల్చుంటే చాలు స్క్రీనింగ్ చేసి  `మీకు టెంపరేచర్ నార్మల్‌గా ఉంది` లేదంటే.. `మీకు టెంపరేచర్ కాస్త ఎక్కువగా ఉంది` అని క్షణాల్లో చెప్పేస్తాయి. మాస్క్ లేకుండా ఎవరైనా వస్తే ..హలో.. మాస్క్ పెట్టుకోవాలి అని హెచ్చరిస్తాయి` అని కంపెనీ ఎండీ భువనేశ్ మిశ్రా తెలిపారు. ఇప్పటికే బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో రోబోల సేవలు అందుబాటులోకి వచ్చాయి. అవి కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో చెప్పేస్తున్నాయి.  వాయిస్ ను బట్టి జలుబు ఉందా లేదా అని గుర్తిస్తున్నాయి. టెంపరేచర్ చెక్ చేసి రిపోర్టు పేపర్ చేతిలో పెడతాయి. ఆ స్లిప్ తో ఆసుపత్రి లోపలకు వెళ్లి చికిత్స అవసరమైతే పొందొచ్చు. ఇటీవల తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ 10 రోబోలను అక్కడి ఓ ప్రభుత్వాస్పత్రికి కానుకగా ఇచ్చింది.