Sunday, April 26, 2020

Serum Institute to start production of Oxford Universitys COVID-19 vaccine in 3 weeks

అతి త్వరలో భారత్ లో కరోనా వ్యాక్సిన్!
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి పీచమణిచే దిశగా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఈ వైర‌స్‌ను నివారించే వ్యాక్సిన్‌ ఉత్పత్తిని భార‌త్‌లో మూడు వారాల త‌ర్వాత  ప్రారంభిస్తామ‌ని ప్ర‌ముఖ సంస్థ సీరం ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) శుభవార్త తెలిపింది. యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)కు చెందిన ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ తో కలిసి సీరం సంస్థ కరోనా నివారణ వ్యాక్సిన్ త‌యారీ కీలకదశకు చేరుకుంది. ఈ రెండు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రస్తుతం మనుషులపై క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కొనసాగుతోన్న విషయం విదితమే. సుమారు 50 మంది (18 నుంచి 55 ఏళ్లు) వాలంటీర్ల కు వ్యాక్సినేషన్ చేసినట్లు తెలుస్తోంది. కరోనాతో పాటు ఇతర ప్రమాదకర వైరస్ ల్ని ఈ వ్యాక్సిన్ అడ్డుకోగలదని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తయారీ దిశగా వందల సంస్థలకు చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలు ముందుగా సాగుతుండగానే ఆక్స్ ఫర్డ్ బృందం ట్రయల్స్ కొలిక్కి వచ్చాయి. ఈ ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతమైతే మూడు వారాల త‌ర్వాత‌ పుణె ప్లాంట్‌లో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేప‌డ‌తామ‌ని సీరం ప్రకటించింది. తాము ఉత్ప‌త్తి చేయ‌బోయే వ్యాక్సిన్‌కు పేటెంట్ కోర‌దలచుకోలేదని సంస్థ సీఈవో పూనావాలా తెలిపారు. వీలైనంత ఎక్కువ ఉత్ప‌త్తి జ‌రిగితేనే ప్రపంచమంతటా వ్యాక్సిన్ అంద‌రికీ అందుబాటులోకి రాగలద‌ని తద్వారా మహమ్మారిని నిలువరించడం సాధ్యమౌతుందని వెల్ల‌డించారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్ కోసం కొత్త ప్లాంట్ నెల‌కొల్పాంటే రెండు నుంచి మూడేళ్ల స‌మ‌యం ప‌డుతుంది.. కాబట్టి  పుణె ప్లాంట్‌లోనే వ్యాక్సిన్‌ ఉత్ప‌త్తి చేపడతామ‌న్నారు. సెప్టెంబర్ నాటికి దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. అన్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తయి ప్రభుత్వ అనుమతులు పొందాక వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది.

Tuesday, April 21, 2020

Hyderabad Haleem makers association decided against cooking and sale of the dish due to lockdown

హలీం.. తయారీ లేదు!
గల్లీ గల్లీలోనూ చవులూరించే హలీం ఈసారి భాగ్యనగరంలో కనిపించదు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు రోజంతా ఉపవాసం ఉన్నాక తక్షణ శక్తి కోసం పోషకాహారమైన హలీం తీసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీతో పాటు హలీం రుచి అంతే ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అయితే ప్రస్తుత కరోనా కాలంలో అన్నింటితో పాటు ప్రార్థనలకు గండిపడింది. దాంతో రంజాన్ సామూహిక ప్రార్థనలతో పాటు హలీం ఆరగింపునకు తెరపడనుంది. రంజాన్ నెలంతా దొరికే హలీంను ముస్లింలతో పాటు అన్ని వర్గాల వారు లొట్టలేసుకుంటూ తింటారు.  ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసుకొని మరీ చికెన్, మటన్, వెజ్ వెరైటీ హలీంలను టేస్ట్ చేసి తరిస్తుంటారు. వాటన్నింటికి ఇప్పుడు `లాక్ డౌన్` పడ్డట్లే. ఈ ఏడాది ఎక్కడా హలీం తయారీ ఉండబోదని హలీం మేకర్స్ అసోసియేషన్ తాజాగా ప్రకటించింది. ప్రార్థనలు, పండుగలు అన్నీ ఇళ్లకే పరిమితం కావాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మసీదుల్లో కూడా సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు. కేవలం ఇమామ్, మౌజన్లు మాత్రమే మసీదుల్లో నమాజులు చేసుకొనే వెసులుబాటు పొందారు.

Saturday, April 18, 2020

YSRCP Hon`ble president Vijayamma requests AP minister Vellampalli Srinivas to help Vijayawada priests

విజయమ్మ చొరవతో పురోహితులకు నిత్యావసరాల పంపిణీ
వై.ఎస్.ఆర్.సి.పి. గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ చొరవ తీసుకోవడంతో విజయవాడ కర్మాన్ ఘాట్ లో పురోహితులకు నిత్యావసర సరకుల పంపిణీ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గల పిండ ప్రదానాలు నిర్వహించే కర్మాన్ ఘాట్ పురోహితుల ఆకలిదప్పులపై ప్రభుత్వం స్పందించింది. శనివారం దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక్కొక్కరికి రూ.వేల విలువ చేసే నిత్యావసరాల కిట్లను అందజేశారు. టీవీ9లో ప్రసారమైన వార్తా కథనానికి స్పందించిన విజయమ్మ మంత్రి శ్రీనివాస్ కి ఫోన్ చేసి వారికి సత్వర సాయం అందించాలని కోరారు. దాంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం నెలరోజులకు సరిపడా బియ్యం, కంది, మినపగుళ్లు తదితర నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 20 కిలోల చొప్పున నాణ్యమైన బియ్యంతో పాటు అవసరమైన ఆహార దినుసుల్ని వారికి అందించామన్నారు. ఇప్పటికే తమ పశ్చిమ నియోజకవర్గంలో లక్షా4వేల మందికి బియ్యం పంపిణీ పూర్తి చేసినట్లు వివరించారు. ఈరోజు కర్మాన్ ఘాట్ సమీపంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పురోహితులు సామాజిక దూరాన్ని పాటిస్తూ కిట్లను అందుకున్నారన్నారు.

Thursday, April 16, 2020

High alert continues towards AP CM`s camp office surrounding areas in Tadepalli

సీఎం జగన్ ఇంటి పరిసరాల్లో హైఅలర్ట్
గుంటూరు జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. తాడేపల్లిలో సైతం కరోనా బాధిత కేసులు నమోదుకావడంతో అధికారులు, సిబ్బంది కంటి మీద కునుకు లేకుండా నిరంతర పహారా కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నివాస ప్రాంతం ఇక్కడకు 7కి.మీ దూరంలోనే ఉండడంతో పారిశుద్ధ్య కార్యక్రమాల్ని గంటగంటకు విస్తృతంగా చేపడుతున్నారు. రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా గుంటూరు, కర్నూలు జిల్లాలు కరోనా కేసుల్లో పోటీపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గుంటూరు, కర్నూలు జిల్లాల్లోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు 118 కేసులతో మూడంకెలకు చేరుకోగా కర్నూలు 98 కేసులతో ఆ దిశగా పయనిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 550కి చేరువలో ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్య 14కు చేరుకుంది. దాంతో రెడ్ జోన్లతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ సీసీ కెమెరాలతో పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో మొత్తం 11 జిల్లాల్ని రెడ్ జోన్లగా ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లోనే నేటి వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. దాంతో ఈ ప్రాంతవాసులు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయినా ఈ జిల్లాలో లాక్ డౌన్ ను పోలీసులు కఠినంగానే అమలు చేస్తున్నారు.