Thursday, April 16, 2020

High alert continues towards AP CM`s camp office surrounding areas in Tadepalli

సీఎం జగన్ ఇంటి పరిసరాల్లో హైఅలర్ట్
గుంటూరు జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. తాడేపల్లిలో సైతం కరోనా బాధిత కేసులు నమోదుకావడంతో అధికారులు, సిబ్బంది కంటి మీద కునుకు లేకుండా నిరంతర పహారా కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నివాస ప్రాంతం ఇక్కడకు 7కి.మీ దూరంలోనే ఉండడంతో పారిశుద్ధ్య కార్యక్రమాల్ని గంటగంటకు విస్తృతంగా చేపడుతున్నారు. రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా గుంటూరు, కర్నూలు జిల్లాలు కరోనా కేసుల్లో పోటీపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గుంటూరు, కర్నూలు జిల్లాల్లోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు 118 కేసులతో మూడంకెలకు చేరుకోగా కర్నూలు 98 కేసులతో ఆ దిశగా పయనిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 550కి చేరువలో ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్య 14కు చేరుకుంది. దాంతో రెడ్ జోన్లతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ సీసీ కెమెరాలతో పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో మొత్తం 11 జిల్లాల్ని రెడ్ జోన్లగా ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లోనే నేటి వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. దాంతో ఈ ప్రాంతవాసులు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయినా ఈ జిల్లాలో లాక్ డౌన్ ను పోలీసులు కఠినంగానే అమలు చేస్తున్నారు.

No comments:

Post a Comment