Monday, March 16, 2020

Telangana government passes resolution against CAA

సీఏఏను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
ముందునుంచి చెబుతున్నట్లుగానే తెలంగాణ ప్రభుత్వాధినేత కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర సర్కార్  సీఏఏ (సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్) కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఇటీవల కేంద్రప్రభుత్వం  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏతెచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం తెలంగాణ అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సవరణల్ని కేంద్రానికి సూచించింది. సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఏదో గుడ్డిగా యాక్ట్ ను వ్యతిరేకించడం లేదని సంపూర్ణ అవగాహనతోనే సీఏఏ ను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. సీఏఏ యావద్దేశ సమస్య తప్పా మరొకటి కాదని తేల్చి చెప్పారు. తనకే బర్త్ సర్టిఫికెట్ లేదని నమోదుకు ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డులేవీ పనికిరావని నిబంధన విధించడమేంటని ప్రశ్నించారు. ప్రజలు తమను నాయకులుగా ఎన్నుకోవడానికి ఉపయోగపడే ఓటర్ కార్డు వారు పౌరులుగా నమోదు కావడానికి ఉపయోగపడకపోవడం విడ్డూరమన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానానికి ఆమోదం తెలిపింది. తీర్మానంపై చర్చ అనంతరం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే సీఎం కేసీఆర్.. సీఏఏపై తీర్మానం ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. అనంతరం అన్ని పార్టీల నేతలూ తీర్మానంపై మాట్లాడారు. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సీఏఏపై తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అసెంబ్లీలో సీఏఏ వ్యతిరేక తీర్మానం ప్రతుల్ని చించేసి తన నిరసన వ్యక్తం చేశారు.

Sunday, March 15, 2020

Third Coronavirus death in india 71 year old from maharashtra dead?

మహారాష్ట్రలో మరొకరు బలి?
మహారాష్ట్రలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు మరణించాడు. ఈ మధ్యనే సౌదీ అరేబియా నుంచి తిరిగివచ్చిన ఆ వ్యక్తి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆయనకు సుగర్, బీపీ ఎక్కువకావడంతో ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ వృద్ధుడు కోవిడ్-19 (కరోనా వైరస్) కారణంగా చనిపోయినట్లు నిర్ధారణ కాలేదు. కాగా ఇప్పటికే దేశంలో కరోనా కారణంగా చనిపోయిన ఇద్దరూ వృద్ధులే కావడం గమనార్హం. దేశంలో తొలి కరోనా మృతి కర్ణాటకలో సంభవించగా రెండో కేసు ఢిల్లీలో నమోదయింది. చనిపోయిన స్త్రీ,పురుషులిద్దరూ 65 ఏళ్లు పైబడినవారే.  మహారాష్ట్రకు చెందిన 71 ఏళ్ల వ్యక్తి శనివారం మధ్యాహ్నం చనిపోయారు. బుల్దానా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఢిల్లీలో 69 ఏళ్ల కరోనా బాధితురాలు మృతి చెందింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ  ప్రకటించింది. ఢిల్లీలోని రామ్‌మనో‌హర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు వెల్లడయింది. అయితే ఆమెకూ బీపీ, సుగర్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కుమారుడి వల్లే ఆమెకు కరోనా వైరస్ సోకింది.  ఆ వృద్ధురాలి కుమారుడు విదేశాల్లో పర్యటించి వచ్చినట్లు సమాచారం.

Friday, March 13, 2020

Hyderabad techie safely came back from corona

కరోనా నుంచి తప్పించుకున్న హైదరాబాద్ వాసి
హైదరాబాద్ మహేంద్ర హిల్స్ కు చెందిన టెకీ సురక్షితంగా కోవిడ్-19 (కరోనా వైరస్) బారి నుంచి బయటపడ్డాడు. శుక్రవారం `గాంధీ ఆసుపత్రి` సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. బెంగళూరులో పనిచేస్తున్న టెకీ గత నెలలో దుబాయ్ కి వెళ్లి తిరిగివస్తూ కరోనాకు చిక్కాడు. ఈనెల 1న బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న టెకీకి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. అప్పటి నుంచి `గాంధీ` వైద్యులు కంటికి రెప్పలా అతణ్ని కాపాడారు. మెరుగైన చికిత్స అందిస్తూ ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఈనెల 9న మళ్లీ అతనికి పరీక్షలు నిర్వహించగా ఆ రిపోర్టు ఈరోజు అందింది. అందులో అతనికి కరోనా నెగిటివ్ అని రావడంతో వైద్యులు సహా నగర వాసులు ఊపిరిపీల్చుకున్నారు. టెకీని ఇంటికి తరలించారు. అయితే కొంతకాలం అతను జనజీవన స్రవంతిలోకి రాకపోవడమే మంచిదని శ్రవణ్ కుమార్ కోరారు. ఒకసారి కరోనా సోకి చికిత్స పొందిన తర్వాత మళ్లీ ఆ వ్యాధి సంక్రమించే ప్రమాదం తక్కువన్నారు. అయినా కొంతకాలం ఇంట్లో సైతం అతను విడిగా ఉండడం మంచిదని చెప్పారు. ఎబోలా, నిఫా, స్వైన్ ఫ్లూ తదితర వైరస్ లు ప్రబలినప్పుడూ `గాంధీ` వైద్యులు ధైర్యంగా వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన సంగతిని గుర్తు చేస్తూ శ్రవణ్ కుమార్ తాజాగా కరోనా విషయంలోనూ అదే స్ఫూర్తితో సమర్ధంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. దాంతో హైదరాబాద్ లో ఏకైక కరోనా పీడితుణ్ని `గాంధీ` వైద్యులు కాపాడినట్లయింది.

Tuesday, March 10, 2020

Australian PM Morrison greets Indian diaspora on Holi

కరోనాను ఖాతరు చేయని హోలీ హేల
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గుబులు పుట్టిస్తున్నా భారత సంప్రదాయ హోలీ సంబరం యథావిధిగా కొనసాగింది. దేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం జనం రంగుల పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు పలు ప్రాంతాల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరంగా గడిపారు. ఓ వైపు దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నా ప్రజలు లెక్కచేయకుండా హోలీ ఆడారు. గువాహటి, లక్నోల్లో రంగుల వేడుక ఘనంగా కొనసాగింది. ప్రవాస భారతీయులు ఆయా దేశాల్లో హోలీ జరుపుకున్నారు. అయితే క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈసారి కలర్ ఫెస్టివల్ ఊపు మాత్రం చాలా వరకు తగ్గినట్లే కనిపించింది. ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఎన్.ఆర్.ఐ.లకు హోలీ శుభాకాంక్షలు అందజేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియా సమాజానికి హిందూ విశ్వాసాలు ఎంతో ముఖ్యం అనే విషయాన్ని ఈ హోలీ వేడుక సూచిస్తుందని ఆయన అన్నారు. `రంగుల పండుగను ప్రతి ఒక్కరూ ప్రేమ, ఆనందం, శాంతి, సమాజ శ్రేయస్సు దృష్ట్యా అమిత సంతోషంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు` అని మోరిసన్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.