Monday, March 9, 2020

TTD Official key suggestions to devotees who came tirumala due to coronavirus Effect

తిరుమల శ్రీవారిని వీడని కరోనా
జలుబు, దగ్గు, జ్వరం ఉన్నాయా? అయితే కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దివ్య దర్శనానికి నోచుకోలేనట్లే లెక్క. సోమవారం ఈమేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదేశాలు జారీ చేసింది. తిరుమల కొండకు నిత్యం లక్షల్లో భక్తులు వస్తుంటారు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా) వైరస్ అల్లాడిస్తోంది.  ఈ నేపథ్యంలో కొండకు వచ్చిన భక్తులు ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూంటే వారిని స్వామి వారి దర్శనానికి అనుమతించరాదని నిర్ణయించారు. సత్వరం ఈ లక్షణాలతో ఇబ్బంది పడుతున్న భక్తులు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) కు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని పాలకమండలి పేర్కొంది. అదేవిధంగా తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు ముందు జాగ్రత్తగా మాస్కులు, శానిటైజర్లు తెచ్చుకోవాలని అధికారులు కోరుతున్నారు. అందరూ చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి చాకచక్యంగా తప్పించుకునేందుకు కేంద్రప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. హోలీ వేడుకలకు కూడా దూరంగా ఉండాలని కోరుతోంది. ప్రధాని మోదీ ఇటీవల విదేశీ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు. పదుల సంఖ్యలో జనం గుమిగూడ వద్దని కూడా సలహా ఇచ్చారు. తిరుమలలో నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అందుకే టీటీడీ అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైరస్ రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇదిలావుంటే తాజాగా కరోనా వైరస్ బాధిత దేశాల సంఖ్య 102కు చేరింది. ఇరాన్ లో ఆదివారం ఒక్కరోజే 49 మంది మృత్యువాత పడ్డారు. చైనా, దక్షిణకొరియా, ఇటలీ, తర్వాత ఇప్పుడు ఇరాన్ ను కరోనా కుదిపేస్తోంది.

Saturday, March 7, 2020

Rahul Gandhi Screened For Coronavirus Says Congress Party

రాహుల్ కు కరోనా పరీక్షలు
ఇటీవల ఇటలీ వెళ్లి తిరిగి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 4న ఇటలీలోని మిలన్ కు వెళ్లిన రాహుల్ అక్కడ రెండువారాల పాటు గడిపిన అనంతరం అదే నెల 29న ఢిల్లీ తిరిగి వచ్చారు. అందరితో పాటు రాహుల్ కూడా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యూలో నిల్చుని కరోనా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. రాహుల్ గాంధీతోపాటు ఆయన తల్లి సోనియా గాంధీ కరోనా పరీక్షలు చేయించుకోవాలని రాజస్థాన్‌ కు చెందిన నాగౌర్‌ స్వతంత్ర ఎంపీ హనుమాన్ బేనివాల్ పార్లమెంట్‌లో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ కూడా రాహుల్ కరోనా పరీక్షల గురించి నిలదీశారు. చైనాలోని వుహాన్ తర్వాత ఇటలీలోనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదై 80 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కరోనా ప్రభావిత దేశాల జాబితాలో ఆ తర్వాత స్థానంలో దక్షిణకొరియా నిలుస్తోంది. చైనాలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గగా ఇటలీ, దక్షిణకొరియాల్లో వ్యాధి తీవ్రంగా ప్రబలుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాలు కరోనా బెడదతో అల్లాడుతున్నాయి. ఇదిలావుండగా దేశంలో కరోనా అప్రమత్తత విషయంలో మోదీ సర్కార్ పై ఇటీవల రాహుల్ సెటైర్లు వేశారు. ‘భయపడొద్దు నౌక మునగదు అని టైటానిక్ షిప్ కెప్టెన్ ఎడ్వార్డ్ జాన్ స్మిత్ ప్రయాణికులకు చెప్పినట్లుగా కరోనా సంక్షోభం అదుపులోనే ఉందని ప్రభుత్వం చెబుతోంది’ అంటూ రాహుల్ విమర్శలు రువ్వారు. దాంతో కొందరు బీజేపీ నేతలు ఆయనను టార్గెట్ చేశారు. రాహుల్ తోపాటు ఆయన తల్లి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి కరోనా పరీక్షలు తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కరోనా పరీక్షలు చేయించుకున్నారంటూ వివరణ ఇచ్చింది.

Thursday, March 5, 2020

New Zealand cricket providing regular updates to its players including IPL bound stars

కరో(డా)నా దెబ్బకు ఐపీఎల్ వాయిదా?
ఏటా యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ సీజన్ కరో(డో)నా మహమ్మారి ధాటికి ఈసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జులైలో ప్రారంభం కావాల్సిన టోక్యో ఒలింపిక్స్ సైతం సందిగ్ధంలో పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరి నాటికైనా విశ్వ క్రీడలు నిర్వహించగలమని జపాన్ ఒలింపిక్స్ మంత్రి సీకో హషిమొటో ఇటీవల ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ లకు కోవిడ్-19 (కరోనా) సెగ తగిలే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మార్చి 29 నుంచి భారత్ లోనే ఐపీఎల్ సీజన్ 2020 ఆరంభం కావాల్సి ఉంది. భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) ఈసరికే ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే స్వదేశీ క్రికెటర్లతో పాటు ఎక్కువ సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ పాల్గొంటుంటారు. చైనాలో ప్రబలి ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిని ఆటాడుకుంటున్న కరోడా వైరస్ తాజాగా భారత్ లో ఉనికి చాటుతోంది. చైనాలో ఈ వైరస్ నెమ్మదించినా దక్షిణకొరియాను అతలాకుతలం చేస్తోంది. అదే విధంగా వేసవి ప్రారంభంలో భారత్ లోనూ పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అప్రమత్తమయింది. ఐపీఎల్ తాజా సీజన్ లో ఆ దేశం క్రికెటర్లు కేన్ విలియమ్సన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), జిమ్మీ నీషమ్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్),లూకీ ఫర్గూసన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్),మిచెల్ మెక్లనగాన్, (ముంబయి ఇండియన్స్),ట్రెంట్ బౌల్ట్ (ముంబయి ఇండియన్స్),మిచెల్ శాంట్నర్ (చెన్నై సూపర్ కింగ్స్) తదితర మొత్తం ఆరుగురు అగ్రశ్రేణి క్రికెటర్లు ఆడనున్నారు. దాంతో భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిపై సమాచారం సేకరిస్తున్న కివిస్ క్రికెట్ బోర్డు తమ క్రికెటర్లకి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తోంది. ఇతర దేశాల క్రికెట్ బోర్డులు ఈ విషయంపై దృష్టి సారించాయి. భారత్ లో కరోనా ప్రభావం పూర్తిగా సమసిపోతేనే ఐపీఎల్ 2020 సీజన్ సజావుగా సాగుతుందని క్రీడా పండితుల భావన.

Wednesday, March 4, 2020

CM YS Jaganmohan Reddy survey warning to ministers and MLA`S over local body elections

జగన్ పాలనపై జనంలో వ్యతిరేకత?
అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచి గడవకనే గంపగుత్తగా ఓట్లేసిన జనంలో వై.ఎస్.ఆర్.సి.పి. పాలనపై వ్యతిరేకత పెల్లుబికుతోందా? ప్రతిపక్ష తెలుగుదేశం (టీడీపీ) ప్రజల నాడిని పసిగట్టే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని దమ్ముంటే తాజాగా ఎన్నికలు నిర్వహించి గెలవాలని సవాలు చేస్తోందా? ఈమేరకు సీఎం జగన్ కు ఇంటెలిజెన్స్ నివేదిక అందిందా?అందులో భాగంగానే ఇటీవల జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల్ని హెచ్చరించారా? అదేం కాదు గానీ.. ప్రస్తుత వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న క్రమంలో సీఎం ఈమేరకు పార్టీ శ్రేణుల్ని అలర్ట్ చేయడానికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించాల్సిన బాధ్యత వారి భుజాల మీదే పెట్టారు. ఏ జిల్లాలో ఓటమి ఎదురయితే అక్కడ మంత్రులు రాజీనామా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇటీవల తెలంగాణ స్థానిక ఎన్నికల సందర్భంగానూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే రీతిలో హెచ్చరించి టీఆర్ఎస్ శ్రేణుల్లో జాగురుకత తెచ్చారు. ఫలితాల్ని ఆశించిన మేర సంపూర్ణంగా సాధించారు. ఇప్పుడు జగన్ కూడా అదే తరహాలో వైఎస్ఆర్సీపీ కేడర్, లీడర్లలో చైతన్యాన్ని రగిలిస్తున్నారు. ఇదిలావుండగా స్థానిక ఎన్నికలు మొత్తం మూడింటిని ఈ నెలాఖరు నాటికే పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. మార్చి 7న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి మార్చి 21న ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. మార్చి 10న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసి మార్చి 24న ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. అదే విధంగా మార్చి 15న గ్రామ పంచాయతీలకు షెడ్యూల్ విడుదల చేసి మార్చి 27న ఎన్నికలు నిర్వహించాలనేది సీఎం యోచన. ఈ మేరకు ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి జగన్ సర్కార్ ఇప్పటికే పంపించింది. అందులో భాగంగానే జగన్ జిల్లాల్లో పార్టీ నాయకత్వం మధ్య ఉన్న గ్రూపు తగాదాల పైన దృష్టి పెట్టాలని సూచించారు. అటువంటి వాటిని సరిదిద్దాలని మంత్రులకు సూచించారు. మద్యం, డబ్బు పంపిణీ కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలన, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై తన దగ్గర సర్వే ఉందని ఈ సందర్భంగా జగన్ హెచ్చరించారు.
25 లక్షల `వైఎస్ఆర్ జగనన్న` ఇళ్ల పట్టాల పంపిణీ
ఉగాది నాడు 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని రాష్ట్ర కేబినెట్ బుధవారం తీర్మానం చేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం తహశీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్టార్ హోదా ఇవ్వనున్నట్టు సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని వివరించారు. పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు ఐదేళ్ల తర్వాత విక్రయించుకునేలా అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం 16 వేల ఎకరాల భూమిని బయటివారి నుంచి కొనుగోలు చేసినట్లు మంత్రి నాని వెల్లడించారు.