తిరుమల శ్రీవారిని వీడని కరోనా
జలుబు, దగ్గు, జ్వరం ఉన్నాయా? అయితే కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర
స్వామి దివ్య దర్శనానికి నోచుకోలేనట్లే లెక్క. సోమవారం ఈమేరకు తిరుమల తిరుపతి దేవస్థానం
(టీటీడీ) ఆదేశాలు జారీ చేసింది. తిరుమల కొండకు నిత్యం లక్షల్లో భక్తులు వస్తుంటారు.
అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా) వైరస్ అల్లాడిస్తోంది. ఈ నేపథ్యంలో కొండకు వచ్చిన భక్తులు ఎవరైనా జలుబు,
దగ్గు, జ్వరంతో బాధపడుతూంటే వారిని స్వామి వారి దర్శనానికి అనుమతించరాదని నిర్ణయించారు.
సత్వరం ఈ లక్షణాలతో ఇబ్బంది పడుతున్న భక్తులు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇనిస్టిట్యూట్
ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) కు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని పాలకమండలి పేర్కొంది.
అదేవిధంగా తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు ముందు జాగ్రత్తగా మాస్కులు, శానిటైజర్లు
తెచ్చుకోవాలని అధికారులు కోరుతున్నారు. అందరూ చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని
సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి చాకచక్యంగా తప్పించుకునేందుకు కేంద్రప్రభుత్వం
ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. హోలీ వేడుకలకు కూడా దూరంగా ఉండాలని కోరుతోంది.
ప్రధాని మోదీ ఇటీవల విదేశీ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు. పదుల సంఖ్యలో జనం గుమిగూడ
వద్దని కూడా సలహా ఇచ్చారు. తిరుమలలో నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. విదేశాల నుంచి
కూడా భక్తులు వస్తుంటారు. అందుకే టీటీడీ అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైరస్
రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇదిలావుంటే తాజాగా కరోనా వైరస్
బాధిత దేశాల సంఖ్య 102కు చేరింది. ఇరాన్ లో ఆదివారం ఒక్కరోజే 49 మంది మృత్యువాత పడ్డారు.
చైనా, దక్షిణకొరియా, ఇటలీ, తర్వాత ఇప్పుడు ఇరాన్ ను కరోనా కుదిపేస్తోంది.
No comments:
Post a Comment