Saturday, February 22, 2020

Yediyurappa Govt. in Karnataka follows AP CM YSJagan`s decentralization idea

జగన్ ను అనుసరిస్తున్న యెడ్డీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని కర్ణాటక సీఎం యడ్యూరప్ప అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా బెంగళూర్ నుంచి కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్ని కర్ణాటక బీజేపీ సర్కార్ తరలించాలని నిర్ణయించింది. అయితే యడ్యూరప్ప ఏపీలో మూడు రాజధానుల అంశంపై మాత్రం పెదవి విరిచినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. కేంద్రంలో, రాష్ట్రంలోని బీజేపీకి చెందిన వివిధ స్థాయుల్లోని నాయకులు ఇప్పటికే అనేక సందర్భాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే తమ పార్టీ ఆలోచనగా పేర్కొన్నారు. అంతే తప్పా రాజధాని వికేంద్రీకరణ (ఒకటికి మించిన రాజధానుల ఏర్పాటు)ను తమ పార్టీ కోరుకోవడంలేదని స్పష్టం చేశారు. తాజాగా కర్ణాటకలో ప్రభుత్వ కార్యాలయాల తరలింపుకు బీజేపీ అధిష్ఠానం అంగీకారం తెలిపింది. ఇప్పటికే రాజధాని బెంగళూరు ట్రాఫిక్ సమస్యతో సతమతమౌతోంది. ఈ దృష్ట్యా ముఖ్య కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు యడ్యూరప్ప సర్కారు సిద్ధమైంది. అదే సమయంలో ఉత్తర కర్ణాటక ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలని యోచించింది. కొన్ని కార్యాలయాలను మరో ప్రాంతానికి తరలించాలని నిర్ణయించినట్లు మంత్రి ఈశ్వరప్ప ప్రకటించారు. కృష్ణ భాగ్య జలనిగం, కర్ణాటక నీరావరి నిగమ్, పవర్ లూమ్ కార్పొరేషన్, షుగర్ డైరెక్టరేట్, చెరకు డెవలప్‌మెంట్ కమిషనర్, కర్ణాటక హ్యూమన్ రైట్స్ కమిషన్, ఉప లోకాయుక్త తదితర మొత్తం 9 కార్యాలయాల్ని తరలించాలని తలపోస్తున్నారు. ఉత్తర కర్ణాటకలోని బెళగావికి ఈ కార్యాలయాలు తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో జాతీయరహదారి నం.4 సమీపంలో గల బెళగావిలో `సువర్ణ విధాన సౌధ`ను కర్ణాటక ప్రభుత్వం 2012లోనే నిర్మించింది. బెంగళూరుతో పాటు ఇక్కడ కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటారు. కర్ణాటక అప్రకటిత రెండో రాజధానిగా ఉన్న బెళగావికి ముఖ్య కార్యాలయాలు తరలితే ఈ ప్రాంత అభివృద్ధి మరింత వేగం పుంజుకోగలదని యడ్యూరప్ప సర్కారు భావిస్తోంది.

Thursday, February 20, 2020

Germany shooting: at least eight dead in Hanau attack

జర్మనీ రక్తసిక్తం: ఉన్మాదుల కాల్పుల్లో 11 మంది బలి
ఉన్మాదుల కాల్పులతో జర్మనీ రక్తమోడింది. బుధవారం రాత్రి హనాన్ లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 11 మంది ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఆ ఇద్దరు దుండగులు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. జర్మనీలో ఇటీవల పలు ఉగ్రదాడులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బెర్లిన్ లో 2016 డిసెంబరులోనూ ఉగ్రవాదులు బాంబు పేలుళ్లతో 12 మందిని పొట్టనుబెట్టుకున్నారు. తాజా దాడికి పాల్పడింది ఎవరనేది తెలియాల్సి ఉంది. సమాచారం అందగానే హనాన్ పోలీసులు కాల్పులు జరిగిన రెండు ప్రాంతాలకు హుటాహుటిన చేరుకున్నారు. ఆ ప్రాంతాల్ని ఆధీనంలోకి తీసుకున్నారు. దుండగుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. నగరంలోని మిడ్‌నైట్ బార్‌లో తొలుత గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు వార్తలందుతున్నాయి. ఆ కాల్పుల్లో నలుగురు నెలకొరిగారు. కొద్దిసేపు అక్కడ విధ్వంసం సృష్టించిన తర్వాత ఎరేనా బార్ లోకి జొరబడి తూటాల వర్షం కురిపించగా మరో అయిదుగురు ప్రాణాలు విడిచారు. ఆ ప్రాంతంలోనే మరో రెండు మృతదేహాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బహుశా ఆ ఇద్దరే కాల్పులకు పాల్పడిన దుండగులు కావొచ్చని తెలుస్తోంది.

Tuesday, February 18, 2020

Another Usain Bolt in kambala Nishanth Shetty the record of Srinivas Gowda

ఉసేన్ బోల్ట్ ను తలదన్నే కంబళ వీరులు..
వారం వ్యవధిలోనే ప్రపంచ ప్రఖ్యాత, ఒలింపిక్స్ పతకాల విజేత జమైకాకు చెందిన ఉసేన్ బోల్ట్ రికార్డు రెండుసార్లు బద్ధలయింది. అయితే స్ప్రింట్ ఈవెంట్ లో కాదు.. కర్ణాటకలో ఏటా జరిగే సంప్రదాయ కంబళ క్రీడల్లో గత వారం బోల్ట్ ను తలదన్నెలా తన ఎడ్లతో శ్రీనివాస్ గౌడ్ మెరుపు వేగంతో పరిగెత్తగా మంగళవారం అతని రికార్డును నిషాంత్ శెట్టి బద్ధలు కొట్టాడు. ఈ ఇద్దరికి స్ప్రింట్ ఈవెంట్లలో తగిన తర్ఫీదు ఇప్పిస్తే ఒలింపిక్స్ పరుగులో పతకాల పంట ఖాయమని సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు ఎలుగెత్తి చాటుతున్నారు. దక్షిణ కన్నడ, ఉడుపి, తుళునాడు తీర ప్రాంతంలో ప్రతి ఏడాది ఈ కంబళ పోటీలు నిర్వహిస్తారు. గౌడ కులస్థులు ఈ పోటీల్లో ఎక్కువగా పాల్గొంటుంటారు. కంబళ ఆటలో పోటీదారుడు (బఫెల్లో జాకీ) బురద నీటిలో తన రెండు దున్నపోతులు లేదా ఎడ్లతో పరిగెడతాడు. ఎవరైతే వీటిని వేగంగా పరుగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారే విజేతలు. కర్ణాటకలో వ్యవసాయదారులే ఎక్కువగా ఈ పోటీలో పాల్గొనడం రివాజు. బురద నెలలో ఎడ్లతో రివ్వున లక్ష్యం దిశగా దూసుకుపోవడం పోటీదారులతో పాటు ప్రేక్షకులకు థ్రిల్ కల్గిస్తుంది. శ్రీనివాస గౌడ 142.5 మీటర్ల దూరాన్ని 13.62 సెకన్లలో పూర్తి చేశాడు. అంటే 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలోనే చేరుకున్నాడు. ఇది జమైకా పరుగుల యంత్రం బోల్ట్‌ రికార్డు కన్నా 0.03 సెకన్లు తక్కువ. తాజాగా నిశాంత్ శెట్టి ఈ రికార్డును బద్ధలు కొట్టాడు. బోల్ట్ కంటే 0.07 సెకన్లు, శ్రీనివాస్ గౌడ్ కంటే 0.04 సెకన్ల ముందే పరుగును పూర్తి చేశాడు. నిషాంత్ 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకన్లలో పరిగెత్తి చరిత్ర సృష్టించాడు. అంటే 100 మీటర్ల పరుగును 9.51 సెకన్లలోనే పూర్తి చేసినట్లు లెక్క.

Tuesday, February 11, 2020

Doctor attempts to commit suicide at Gandhi Hospital in Hyderabad

గాంధీ ఆసుపత్రిలో హైడ్రామా: డాక్టర్ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ వైద్యుడు ఆత్మహత్యకు యత్నించడంతో హైరానా నెలకొంది. మంగళవారం  డాక్టర్ వసంత్ కుమార్ (ఎంబీబీఎస్) తన చొక్కాలో పెట్రోల్ సీసాలను పెట్టుకుని లైటర్ తో నిప్పంటించుకుంటానంటూ బెదిరింపులకు దిగారు. ఈ ఉదయం గంటన్నరపాటు నడిచిన ఈ హైడ్రామాకు పోలీసులు చాకచక్యంగా తెరదించారు. చెట్టు కింద నిలబడి వసంత్ తన ఆవేదనను వ్యక్తం చేస్తుండగా పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గర్భిణిగా ఉన్న ఆయన భార్య కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. అదును చూసుకుని ఒక్కసారిగా పోలీసులు వసంత్ ను ఒడిసి పట్టుకుని ఆయన చేతిలో ఉన్న లైటర్ ను లాగేసుకున్నారు. వ్యాన్ లోకి ఆయనను బలవంతంగా ఎక్కించారు. వసంత్ షర్టును విప్పేసి అందులో దాచుకున్న పెట్రోల్ సీసాల్ని తీసి దూరంగా విసిరేశారు. అనంతరం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. `గాంధీ`లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సోషల్ మీడియాలో వసంత్ తదితరులు వదంతులు రేపారని ప్రభుత్వం ఆయనతో పాటు మరో ముగ్గురు వైద్యుల్ని విధులు నుంచి సస్పెండ్ చేసింది. మూడ్రోజులుగా వసంత్ తన పై అధికారులపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రవణ్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి(డీఎంఈ) అవకతవకలకు పాల్పడుతున్నారంటూ వసంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే డీఎంఈ మీడియాతో మాట్లాడుతూ వసంత్ పైనే గత కొంతకాలంగా అవినీతి, బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలు ఉన్నాయన్నారు. వాస్తవానికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నందునే గాంధీ ఆసుపత్రి నేడు ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందుతోందన్నారు. ఒకవేళ ఆసుపత్రిలో సౌకర్యాల లేమి, అవకతవకలుంటే ఆయన ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని డీఎంఈ ఎదురు ప్రశ్న వేశారు. ఒక డాక్టర్ అయి ఉండి కరోనా వంటి సంక్షోభ సమయంలో ఆసుపత్రి ఆవరణలోనే బరితెగింపు ధోరణి కనబర్చడమేంటని నిలదీశారు. శాఖాపరంగా డాక్టర్ వసంత్ పై చర్యలు తీసుకోక తప్పదని చెప్పారు.