జర్మనీ
రక్తసిక్తం: ఉన్మాదుల కాల్పుల్లో 11 మంది బలి
ఉన్మాదుల కాల్పులతో జర్మనీ రక్తమోడింది. బుధవారం రాత్రి హనాన్
లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. రెండు
వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 11 మంది ప్రాణాలు
విడిచారు. మృతుల్లో ఆ ఇద్దరు దుండగులు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. జర్మనీలో ఇటీవల పలు ఉగ్రదాడులు చోటు చేసుకున్న సంగతి
తెలిసిందే. బెర్లిన్ లో 2016 డిసెంబరులోనూ ఉగ్రవాదులు బాంబు పేలుళ్లతో 12 మందిని
పొట్టనుబెట్టుకున్నారు. తాజా దాడికి పాల్పడింది ఎవరనేది తెలియాల్సి ఉంది. సమాచారం
అందగానే హనాన్ పోలీసులు కాల్పులు జరిగిన రెండు ప్రాంతాలకు హుటాహుటిన చేరుకున్నారు.
ఆ ప్రాంతాల్ని ఆధీనంలోకి తీసుకున్నారు. దుండగుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. నగరంలోని
మిడ్‌నైట్ బార్‌లో తొలుత గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు వార్తలందుతున్నాయి. ఆ కాల్పుల్లో
నలుగురు నెలకొరిగారు. కొద్దిసేపు అక్కడ విధ్వంసం సృష్టించిన తర్వాత ఎరేనా బార్
లోకి జొరబడి తూటాల వర్షం కురిపించగా మరో అయిదుగురు ప్రాణాలు విడిచారు. ఆ ప్రాంతంలోనే
మరో రెండు మృతదేహాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బహుశా ఆ ఇద్దరే
కాల్పులకు పాల్పడిన దుండగులు కావొచ్చని తెలుస్తోంది.
No comments:
Post a Comment