Monday, February 10, 2020

Jaanu Movie Team Visits Tirumala Temple

తిరుమలకు టాలీవుడ్ టూరు: నయా ట్రెండ్ షురూ
తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త ఒరవడి కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో తిరుమల శ్రీవారి దర్శనం సెంటిమెంట్ నయా ట్రెండ్. టాలీవుడ్ నమ్మకాలకు పెట్టింది పేరు. సినిమా ప్రారంభానికి కొబ్బరికాయ కొట్టే దగ్గర నుంచి ముహూర్తాలు, సెంటిమెంట్లతో యావత్ చిత్ర నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం తమ సినిమాలు విడుదలై విజయం సాధించాక తిరుమల శ్రీవారి దర్శనానికి సినీ యూనిట్లు క్యూ కడుతున్నాయి. తాజాగా `జాను` చిత్ర యూనిట్ కూడా స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చింది. శనివారం ఆ చిత్ర దర్శకులు, సినీ తారలు, నిర్మాతలు తిరుమలలో సందడి చేశారు. దిల్ రాజు, కిశోర్, సమంత, శర్వానంద్ వేంకటేశుని సన్నిధిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది మహేశ్ బాబు, అల్లు అర్జున్ చిత్రాలు `సరిలేరునీకెవ్వరు`..`అల వైకుంఠాపురం` బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. సంక్రాంతి పండుగ సమయంలో ఈ చిత్రాలు విడుదలై విజయవంతంగా బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని తొలుత మహేశ్ బాబు అండ్ యూనిట్ ఆ తర్వాత బన్నీ కుటుంబం సహా ఆ సినిమా టీమ్ స్వామి వారి దర్శనం చేసుకుని తరించారు. మహేశ్ బాబు సకుటుంబ సమేతంగా.. బాబాయి ఆదిశేషగిరిరావు, నమత్రా, గౌతమ్, సితారలతో కలిసి స్వామి దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట అత్యంత సన్నిహితుడు యువదర్శకుడు వంశీ పైడిపల్లి కూడా తన కుటుంబంతో దర్శనానికి వచ్చారు. మూవీ డైరెక్టర్ అనిల్ రావివూడి, లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్ తదితరులు స్వామి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే బన్నీ, త్రివిక్రమ్ టీమ్ తిరుమలలో శ్రీవారి సన్నిధికి విచ్చేశారు. ఈ నెలలోనే `జాను` విడుదలై తెలుగు ప్రేక్షకుల్ని ఫీల్ గుడ్ మూవీగా అలరిస్తోంది. దాంతో సెంటిమెంట్ గా ఈ చిత్ర యూనిట్ కూడా స్వామి వారి  మొక్కులు తీర్చుకుంది. గతంలోనూ బాలీవుడ్ టు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు, తారాగణం తిరుమల వెంకన్న దర్శనాలు చేసుకోవడం రివాజుగా వస్తున్నదే. అయితే ఇలా సినిమా యూనిట్లకు యూనిట్లే శ్రీవారి చెంతకు చేరుతుండడం తాజా విశేషం.

Saturday, February 8, 2020

AP CM YS Jagan Inaugurates First Disha Police Station In Rajahmundry

రాజమండ్రిలో తొలి `దిశ` పోలీస్ స్టేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి `దిశ పోలీస్ స్టేషన్` రాజమండ్రిలో ఏర్పాటయింది. శనివారం ఉదయం 11 గంటలకు ఈ పీఎస్ ను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మహిళల తోనే  రిబ్బన్ కట్ చేయించి ప్రారంభించారు. మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దిశచట్టంలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 13 ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఒక్కో దిశ పోలీస్ స్టేషన్‌లో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది సిబ్బంది ఉంటారు. ఇందులో అధిక సంఖ్యలో మహిళలే ఉంటారని సీఎం చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శిమన్ శర్మ కూడా మహిళే కాబట్టి మరో అడుగు ముందుకేసి ఏకంగా 47 మంది మహిళా సిబ్బందిని ఈ పోలీస్ స్టేషన్ లో నియమించారని ప్రశంసించారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడానికి, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్‌ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్‌ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది. త్వరితగతిన శిక్షలు పడితేనే వ్యవస్థలో భయం వచ్చి నేరాలు తగ్గుతాయని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో విచారణనూ పూర్తి చేసి మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఉరి శిక్షలు విధిస్తామని చెప్పారు. మహిళలు, చిన్నారులను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటారు. తొలిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి అదే తప్పు చేస్తే నాల్గేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఈసందర్భంగా `దిశ` యాప్‌ను సీఎం ఆరంభించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖమంత్రి సుచరిత, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎంపీ వంగాగీతా, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.

Friday, February 7, 2020

Telangana CM KCR Inaugurate JBS-MGBS Metro carridor

జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్ కు జెండా ఊపిన కేసీఆర్
హైదరాబాద్ మణిహారంగా అలరారుతున్న మెట్రో రైల్ ప్రాజెక్టు (హెచ్.ఎం.ఆర్.ఎల్) లో భాగమైన జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించారు. జేబీఎస్ స్టేషన్ లో ఈ సాయంత్రం 4గంటలకు మెట్రో రైలు సర్వీసుకు సీఎం పచ్చ జెండా ఊపారు. 11 కిలోమీటర్ల ఈ రూట్లో ప్రయాణికులు కేవలం 16 నిమిషాల్లోనే గమ్య స్థానం చేరుకుంటారు. ఈ కారిడార్లో జేబీఎస్ (పరేడ్ గ్రౌండ్స్), సికింద్రాబాద్ వెస్ట్, న్యూగాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ స్టేషన్లు ఉన్నాయి. రోజూ సుమారు లక్ష మంది ప్రయాణిస్తారని అంచనా. ఈ కారిడార్ తో కలుపుకొని హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైలు మార్గం 69 కిలోమీటర్ల కు చేరుకుంది. ఇప్పటికే అమలులో ఉన్న ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం కారిడార్లతో పాటు తాజాగా జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్ నగరవాసులకు అందుబాటులోకి వచ్చినట్లయింది. మొత్తంగా ఈ మూడు కారిడార్లలో 16 లక్షల మంది నిత్యం ప్రయాణిస్తారని హైదరాబాద్ మెట్రో వర్గాలు ఆశిస్తున్నాయి. కోల్ కతా దేశంలో మొట్టమొదట మెట్రో రైలు వ్యవస్థను కల్గిన నగరం. ఆ తర్వాత ఢిల్లీ మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అయితే దేశంలో ఢిల్లీ (డీఎంఆర్సీ) ఎక్కువ దూరం విస్తరించిన మెట్రోగా రికార్డు నెలకొల్పింది.  2002లో కేవలం ఆరుస్టేషన్లతో షహదర-తీస్ హజారీ (8.5 కిలోమీటర్లు) మార్గం తొలుత అందుబాటులోకి వచ్చింది. 17 ఏళ్లలో మొత్తం 11 లైన్లతో 391 కిలోమీటర్ల మేర ఢిల్లీ మెట్రో విస్తరించింది. నగరంలో గల 285 స్టేషన్లలో రోజూ సుమారు 35 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. కోలకతా మెట్రో రైలు సర్వీసు (కె.ఎం.ఆర్.సి) 1984లోనే ప్రారంభమయింది. ప్రస్తుతం 24 స్టేషన్లతో నౌపరా-కవి సుభాష్ (27.22 కిలోమీటర్ల) మార్గమే అందుబాటులో ఉండగా మరో నాలుగు లైన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం 7.5 లక్షల మంది ఇక్కడ మెట్రో రైలు సేవల్ని పొందుతున్నారు.

Thursday, February 6, 2020

Singer KJ Yesudas' brother Justin found mysterious dead in Kochi

గాయకుడు జేసుదాస్ సోదరుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ప్రముఖ గాయకుడు, సంగీతకారుడు జేసుదాస్ తమ్ముడు 62 ఏళ్ల కేజే జస్టిన్ కేరళలోని కొచ్చిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జస్టిన్ మృతదేహాన్ని వల్లర్పాదంలోని డీపీ వరల్డ్స్ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ వద్ద కనుగొన్నారు. మంగళవారం రాత్రి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. జస్టిన్ తన కుటుంబంతో కలిసి కక్కనాడ్ లోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆయన అదృశ్యమయినట్లు బంధువు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం వల్లర్పాదం నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ముల్వుకాడ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. అయితే పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు. జస్టిన్ మృతదేహాన్ని బంధువులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. మూడేళ్ల క్రితం తన పెద్ద కొడుకు మరణించినప్పటి నుంచి ఆయన తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. గత కొంతకాలంగా మానసిక సమస్యలతోనూ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జస్టిన్ మరణానికి గల కారణాలను పరిశోధిస్తున్నారు.