Monday, January 13, 2020

Pawan Kalyan meets BJP working president JPNadda

బీజేపీ అగ్రనేత జేపీనడ్డాతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి తరలించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీనడ్డాతో భేటీ అయ్యారు. రెండ్రోజుల క్రితమే ఆయన ఢిల్లీ చేరుకుని మకాం వేసిన సంగతి తెలిసిందే. సోమవారం పవన్ కల్యాణ్ పార్టీ సహచరులు నాదెండ్ల మనోహర్ తో కలిసి నడ్డాతో సమావేశమయ్యారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (బెంగళూరు), ఆ పార్టీ ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ వెంట రాగా జనసేన అధినాయకులు నడ్డాతో భేటీ అయ్యారు. అమరావతి ప్రస్తుత సంక్షోభాన్ని వీరిద్దరూ బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడైన నడ్డా దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ తాజా పరిణామాలన్నింటిని తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు పవన్, మనోహర్ లకు ఆయన చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ రాజధాని నిర్మాణానికి సంబంధించి రైతులకు పలు పర్యాయాలు పవన్ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు.. వారు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తేనే తీసుకోవాలి తప్పిస్తే బలవంతంగా లాక్కోవద్దని పవర్ స్టార్ గళమెత్తారు. రాజధాని నిర్మాణానికి అన్ని వేల ఎకరాల భూమి అవసరం లేదని కూడా నాడు జనసేనాని అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే అమరావతి పరిసర 29 గ్రామాలకు చెందిన రైతులు 33 వేల ఎకరాల భూమి రాజధాని కోసం సమర్పించారు. ప్రభుత్వ భూములు కలుపుకొని మొత్తం సుమారు 54 వేల ఎకరాల భూములు సమకూరాయి. ఇక కేంద్రం నుంచి రాజధాని నిర్మాణానికి దశల వారీగా నిధులు అందాల్సిన తరుణంలో అసెంబ్లీ ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారడం జరిగింది. ప్రత్యేక హోదా, నవ్యాంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధుల బకాయిలు కోసం పోరాడాల్సిన తరుణంలో మూడు రాజధానుల అంశం కాక రేపుతోంది. అవసర ప్రాధాన్యాలు పక్కకపోయి ఇప్పుడు అమరావతిని రాజధానిగా నిలబెట్టుకోవాల్సిన అగత్యం దాపురించింది. ఇప్పటికే అయిదేళ్లు కాలం గడిచిపోయింది. ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడూ గుడారాల రాజధానే అనే అపకీర్తి మిగులుతోంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు చెన్నై ఆ తర్వాత తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్ర అవతరణ నాడు కర్నూలు రాజధాని అయింది. ఆపై ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డంతో హైదరాబాద్ కు మళ్లాల్సి వచ్చింది. ఇటీవల విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ గా నిలదొక్కుకునేందుకు అమరావతి రాజధానిగా రూపుదాల్చింది. అంతలోనే మళ్లీ దక్షిణాఫ్రికా తరహాలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. ఇలా వరుసగా  రాజధాని అంశం చుట్టే రాష్ట్రం పరిభ్రమిస్తే అభివృద్ధి మాట అటుంచి మౌలికసౌకర్యాల కల్పనా.. అభూతకల్పనగా మారే దుస్థితి. సాటి తెలుగురాష్ట్రం తెలంగాణ శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోతుంటే చిరకాల ఆంధ్రప్రదేశ్ కు ఇంకా రాజధానే ఖరారు కాకపోవడమంటే నగుబాటే. 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగే అవకాశం (గడువు) మరో నాల్గేళ్లలో 2024లో పూర్తికానుంది.  రాజధాని అమరావతి అనుకున్నాక నిర్మాణ పనులకు అంకురార్పణ జరిగింది. హైదరాబాద్ కు దీటుగా.. ఆ మాటకొస్తే ప్రపంచ ప్రసిద్ధ నగరాల జాబితాలో చోటు దక్కించుకునే రాజధానిని నిర్మించాలన్నదే తమ తపనని నాటి ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. అద్భుత రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టింది. అయితే నిధుల లేమితో ఆ దిశగా అడుగులు వడివడిగా పడలేదన్నది వాస్తవం. ఆ అంశాలన్నింటిపై పాలక ప్రతిపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వంపై దండయాత్ర చేయాల్సిన దశలో ఇప్పుడు అమరావతిలో రాజధానిని నిలుపుకోవడంపై పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ క్రమంలోనే పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా తనవంతు పోరాడుతూనే.. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు నడుం కట్టారు. అందులో భాగంగా ఈరోజు జేపీనడ్డాతో మాట్లాడారు. ఇకపై మళ్లీ బీజేపీతో కలిసి పనిచేయాలనే ఆకాంక్షను కూడా పవన్ కల్యాణ్ ఆయన వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన దరిమిలా తెలుగుదేశం పార్టీ కి దగ్గరయ్యే దిశగాను జనసేనాని అడుగులు వేశారు. చాలా అంశాల్లో పచ్చపార్టీ ఆలోచనా విధానంతో పవన్ ఏకీభవిస్తూ మాట్లాడారు కూడా. జనసేనతో ఎన్నికల పొత్తులో కలిసి వచ్చిన కమ్యూనిస్టు పార్టీలు అమరావతి రాజధాని అంశంలో సైతం గొంతు కలిపాయి. అయితే రాజధాని తరలింపును అడ్డుకోగలిగిన ఏకైక శక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక్క బీజేపీకే సాధ్యమనే విషయం పవన్ కల్యాణ్ కు బాగా తెలుసు. అందుకనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ భవిత కోసం ఆయన అవసరమైతే మళ్లీ బీజేపీతో సయోధ్యగా ముందుకు పోవడానికి కూడా సంసిద్ధమయ్యారు. మరో వైపు బీజేపీ పెద్దలకు కూడా పవన్ స్టామినా ఏంటో తెలుసు. గతేడాది ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 7శాతం ఓట్లు (సుమారు 21.50 లక్షల ఓట్లు) తెచ్చుకున్న జనసేన రాష్ట్రంలో తృతీయ రాజకీయ శక్తి. ఆ పార్టీది వై.ఎస్.ఆర్.సి.పి, టీడీపీల తర్వాత స్థానం. ఆ దృష్టానే బెట్టు వీడిన బీజేపీ నేతలు పవన్ ఘోష వినడానికి ముందుకు వచ్చారు. జేపీ నడ్డా ఈరోజు ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది.

Saturday, January 11, 2020

Kerala Government collapses Huge multi storied building

కేరళలో 3 సెకన్లలోనే భారీ ఆకాశహార్మ్యం నేలమట్టం
అక్రమకట్టడాలపై కేరళ ప్రభుత్వం శనివారం కొరడా ఝళిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తీర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాల్ని నేల మట్టం చేసింది. ఈ ఉదయం కొచ్చిలో రెండు లగ్జరీ అపార్ట్మెంట్ కాంప్లెక్సుల కూల్చివేత ప్రక్రియను అధికారులు సెకన్ల వ్యవధిలోనే పూర్తి చేశారు. బ్యాక్ వాటర్ ను పట్టించుకోకుండా కొచ్చిలో ఈ విధంగా నాలుగు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లు నిర్మించినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిల్లో 350 కి పైగా ఫ్లాట్లుండగా 240 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారందరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించి ఆ గృహ సముదాయాల నుంచి ఖాళీ చేయించారు. అనంతరం రెండ్రోజుల ఈ కూల్చివేతల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ వారాంతంలో కేరళ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ దేశంలోనే నివాస సముదాయాలతో కూడిన అతిపెద్ద కూల్చివేత డ్రైవ్‌లలో ఒకటిగా నిలిచింది. కొచ్చిలోని మారడు సరస్సు ఒడ్డున హోలీ ఫెయిత్, కయలోరం, ఆల్ఫా వెంచర్స్, హాలిడే హెరిటేజ్, జైన్ హౌసింగ్ పేరిట ఈ అక్రమ అపార్ట్ మెంట్లు వెలిశాయి. నిబంధనలు ఉల్లంఘించి ఈ ఆకాశ హార్య్మాలు నిర్మించడంతో అయిదు నెలల్లోపు వీటిని కూల్చివేయాలని సుప్రీంకోర్టు 2019 సెప్టెంబర్‌లోనే ఆదేశించింది. గత ఏడాది కూడా పెను వరదల తాకిడికి కేరళ అల్లాడిన సంగతి తెలిసిందే. ఈ రోజు రెండు బహుళ అంతస్తుల భవనాలు కూల్చివేతకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. సుమారు 800 కిలోల పేలుడు పదార్థాన్ని ఉపయోగించి కేవలం మూడు సెకన్ల వ్యవధిలోనే భారీ ఆకాశ హార్మ్యాన్ని నేలమట్టం చేయడం విశేషం.

Tuesday, January 7, 2020

Deepika Padukone visits JNU to lend her support to the students

గాయపడిన జె.ఎన్.యు. విద్యార్థులకు దీపికా పదుకొనె మద్దతు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె మంగళవారం జె.ఎన్.యు. క్యాంపస్ ను సందర్శించి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఆదివారం గుర్తు తెలియని దుండగులు జరిపిన కర్కశ దాడిలో సుమారు 40 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో దేశవ్యాప్తంగా అలజడి చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ అనుకూల వర్గాలు వ్యతిరేకత తెల్పుతున్నా పట్టించుకోకుండా దీపికా జె.ఎన్.యు.కు చేరుకుని గాయపడిన విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషీఘోష్ సహా మిగిలిన క్షతగాత్రుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. విద్యార్థులకు అండగా తామంతా నిలబడతామని ఈ సందర్భంగా వారికి దీపికా తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కొందరు విద్యార్థులు, అధ్యాపకులు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు తెలుసుకుని వారి వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా దీపికా వెంట జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్ కుమార్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో జె.ఎన్.యు.లో విస్తృత పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Friday, January 3, 2020

Farmers in Amaravati protest against AP CM Jagan's idea of 3 capitals to the state

ఏపీలో సకల జనుల సమ్మె ఉద్రిక్తం
ఆంధ్రప్రదేశ్ కు `మూడు రాజధానులు వద్దు ప్రస్తుత రాజధాని అమరావతే ముద్దు` అంటూ రైతులు ఆందోళన ఉధృతం చేశారు. గత 16 రోజులుగా రోడెక్కిన రైతులు శుక్రవారం సకల జనుల సమ్మెకు పిలుపు ఇచ్చారు. దాంతో రాజధాని సమీపంలోని బాధిత 29 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మందడం కు ర్యాలీగా తరలడానికి సిద్ధమైన `జనసేన` అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను పోలీసులు దారిలోనే నిలిపివేశారు. దాంతో ఆయన రోడ్డుపై ధర్నాకు దిగారు. సకల జనుల సమ్మె పిలుపు నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడ్డాయి. రైతులకు సంఘీభావంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా ఎక్కడికక్కడ పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఈ క్రమంలో మహిళల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ ప్రతిపక్ష నాయకులు విరుచుకు పడ్డారు. మహిళల్ని బస్సుల్లో అక్కడ నుంచి పోలీసులు తరలించారు. పోలీసుల తీరును తప్పుబడుతూ రైతులు ఆ వాహనాలకు అడ్డంగా పడుకుని కొద్దిసేపు నిరసన తెలిపారు. ప్రభుత్వం అణచివేత చర్యలకు పూనుకుంటోందని..ఎన్నడూ ఇంట్లో నుంచి బయటకు రాని మహిళలు తమ ఆవేదన వెలిబుచ్చేందుకు రోడ్డు పైకి వస్తే వారిపై పోలీసులు దౌర్జన్యం చేశారని ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారు ఇది మా సమస్య కాదని మౌనంగా ఉంటే రేపొద్దున మరో బాధ వారిని వెంటాడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అప్పుడు వారికి సహకరించే వారుండరని అందుకే సమష్ఠిగా పోరాడాలని సూచించారు.