Saturday, January 11, 2020

Kerala Government collapses Huge multi storied building

కేరళలో 3 సెకన్లలోనే భారీ ఆకాశహార్మ్యం నేలమట్టం
అక్రమకట్టడాలపై కేరళ ప్రభుత్వం శనివారం కొరడా ఝళిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తీర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాల్ని నేల మట్టం చేసింది. ఈ ఉదయం కొచ్చిలో రెండు లగ్జరీ అపార్ట్మెంట్ కాంప్లెక్సుల కూల్చివేత ప్రక్రియను అధికారులు సెకన్ల వ్యవధిలోనే పూర్తి చేశారు. బ్యాక్ వాటర్ ను పట్టించుకోకుండా కొచ్చిలో ఈ విధంగా నాలుగు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లు నిర్మించినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిల్లో 350 కి పైగా ఫ్లాట్లుండగా 240 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారందరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించి ఆ గృహ సముదాయాల నుంచి ఖాళీ చేయించారు. అనంతరం రెండ్రోజుల ఈ కూల్చివేతల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ వారాంతంలో కేరళ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ దేశంలోనే నివాస సముదాయాలతో కూడిన అతిపెద్ద కూల్చివేత డ్రైవ్‌లలో ఒకటిగా నిలిచింది. కొచ్చిలోని మారడు సరస్సు ఒడ్డున హోలీ ఫెయిత్, కయలోరం, ఆల్ఫా వెంచర్స్, హాలిడే హెరిటేజ్, జైన్ హౌసింగ్ పేరిట ఈ అక్రమ అపార్ట్ మెంట్లు వెలిశాయి. నిబంధనలు ఉల్లంఘించి ఈ ఆకాశ హార్య్మాలు నిర్మించడంతో అయిదు నెలల్లోపు వీటిని కూల్చివేయాలని సుప్రీంకోర్టు 2019 సెప్టెంబర్‌లోనే ఆదేశించింది. గత ఏడాది కూడా పెను వరదల తాకిడికి కేరళ అల్లాడిన సంగతి తెలిసిందే. ఈ రోజు రెండు బహుళ అంతస్తుల భవనాలు కూల్చివేతకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. సుమారు 800 కిలోల పేలుడు పదార్థాన్ని ఉపయోగించి కేవలం మూడు సెకన్ల వ్యవధిలోనే భారీ ఆకాశ హార్మ్యాన్ని నేలమట్టం చేయడం విశేషం.

Tuesday, January 7, 2020

Deepika Padukone visits JNU to lend her support to the students

గాయపడిన జె.ఎన్.యు. విద్యార్థులకు దీపికా పదుకొనె మద్దతు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె మంగళవారం జె.ఎన్.యు. క్యాంపస్ ను సందర్శించి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఆదివారం గుర్తు తెలియని దుండగులు జరిపిన కర్కశ దాడిలో సుమారు 40 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో దేశవ్యాప్తంగా అలజడి చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ అనుకూల వర్గాలు వ్యతిరేకత తెల్పుతున్నా పట్టించుకోకుండా దీపికా జె.ఎన్.యు.కు చేరుకుని గాయపడిన విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషీఘోష్ సహా మిగిలిన క్షతగాత్రుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. విద్యార్థులకు అండగా తామంతా నిలబడతామని ఈ సందర్భంగా వారికి దీపికా తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కొందరు విద్యార్థులు, అధ్యాపకులు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు తెలుసుకుని వారి వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా దీపికా వెంట జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్ కుమార్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో జె.ఎన్.యు.లో విస్తృత పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Friday, January 3, 2020

Farmers in Amaravati protest against AP CM Jagan's idea of 3 capitals to the state

ఏపీలో సకల జనుల సమ్మె ఉద్రిక్తం
ఆంధ్రప్రదేశ్ కు `మూడు రాజధానులు వద్దు ప్రస్తుత రాజధాని అమరావతే ముద్దు` అంటూ రైతులు ఆందోళన ఉధృతం చేశారు. గత 16 రోజులుగా రోడెక్కిన రైతులు శుక్రవారం సకల జనుల సమ్మెకు పిలుపు ఇచ్చారు. దాంతో రాజధాని సమీపంలోని బాధిత 29 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మందడం కు ర్యాలీగా తరలడానికి సిద్ధమైన `జనసేన` అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను పోలీసులు దారిలోనే నిలిపివేశారు. దాంతో ఆయన రోడ్డుపై ధర్నాకు దిగారు. సకల జనుల సమ్మె పిలుపు నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడ్డాయి. రైతులకు సంఘీభావంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా ఎక్కడికక్కడ పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఈ క్రమంలో మహిళల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ ప్రతిపక్ష నాయకులు విరుచుకు పడ్డారు. మహిళల్ని బస్సుల్లో అక్కడ నుంచి పోలీసులు తరలించారు. పోలీసుల తీరును తప్పుబడుతూ రైతులు ఆ వాహనాలకు అడ్డంగా పడుకుని కొద్దిసేపు నిరసన తెలిపారు. ప్రభుత్వం అణచివేత చర్యలకు పూనుకుంటోందని..ఎన్నడూ ఇంట్లో నుంచి బయటకు రాని మహిళలు తమ ఆవేదన వెలిబుచ్చేందుకు రోడ్డు పైకి వస్తే వారిపై పోలీసులు దౌర్జన్యం చేశారని ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారు ఇది మా సమస్య కాదని మౌనంగా ఉంటే రేపొద్దున మరో బాధ వారిని వెంటాడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అప్పుడు వారికి సహకరించే వారుండరని అందుకే సమష్ఠిగా పోరాడాలని సూచించారు.

Wednesday, January 1, 2020

AP Governor and CM, Opposition Leaders 2020 New Year Wishes to the People

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్, సీఎం, ప్రతిపక్ష నాయకుల శుభాకాంక్షలు
2020 నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వాభూషణ్ హరిచందన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా రాష్ట్ర ప్రజలకు శుభాభినందనలు చెప్పారు. జనవరి 1 బుధవారం అమరావతిలోని రాజ్ భవన్ వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ కు పిల్లలు పుష్పగుచ్ఛాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు డాలర్ శేషాద్రి తదితరులు గవర్నర్‌ను ఆయన నివాసంలో కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలువురు టీటీడీ పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని గవర్నర్‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్ర ప్రజలందరూ ఈ ఏడాది ఆనందంగా గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు విషెస్ తెల్పుతూ ఈ సంవత్సరం యావత్ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ని వేడుకున్నట్లు చెప్పారు. గడిచిన ఏడాది రాష్ట్ర ప్రజలు చిరునవ్వులతో తమ ప్రభుత్వాన్ని ఆహ్వానించి ఆనందంగా గడిపారని ఈ ఏడాది అందరి ఇళ్లల్లో సంతోషం వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడాలని దుర్గమ్మని వేడుకున్నట్లు తెలిపారు. విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని చంద్రబాబు దంపతులు ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను నాడు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారన్నారు. కానీ నేడు 2020 సత్ఫలితాల్ని తెలంగాణ అనుభవిస్తోందని చెప్పారు. నూతన సంవత్సరం తొలిరోజున దుర్గమ్మని దర్శించుకొని అమరావతిని పరిరక్షించాలని, రాష్ట్రాన్ని కాపాడాలని కోరుకున్నానని తెలిపారు. `రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలి..అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి`..అని ప్రతి ఒక్కరూ సంకల్పం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. ఆయనకు దుర్గగుడి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే రామానాయుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఉన్నారు.