Sunday, November 24, 2019

Virat Kohli Credits Sourav Ganguly For Winning Habit and said `Learnt To Stand Up, Give It Back`


గంగూలీ జట్టు నుంచే మాకు గెలుపు అలవాటు అబ్బింది:కోహ్లీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి ఇండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. ఆదివారం కోల్ కతాలో టెస్ట్ సీరిస్ ట్రోఫీని అందుకుంటున్న సందర్భంగా కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. గంగూలీ సారథ్యంలో భారత టీమ్ సాధించిన విజయాల బాటలోనే ప్రస్తుత తమ జట్టు ముందుకు సాగుతోందని కోహ్లీ పేర్కొన్నాడు. గెలుపు అలవాటు దాదా జట్టు నుంచే పుణికిపుచ్చుకున్నామని సవినయంగా తెలిపాడు. మూడు నాల్గేళ్లగా ఏ జట్టుపైనైనా భారత్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శననే చేస్తున్నారన్నాడు. ఈడెన్ గార్డెన్స్ ప్రేక్షకులు తొలి పింక్ బాల్ టెస్ట్ ను అమోఘంగా ఆదరించారంటూ కోహ్లీ వారిపై ప్రశంసల జల్లు కురిపించాడు. బంగ్లాదేశ్ జట్టుపై స్వదేశంలో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ ల సీరిస్ ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి డే అండ్ నైట్ (పింక్ బాల్) టెస్ట్ లో భారత్ జట్టు బంగ్లా జట్టుపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మూడోరోజే విజయభేరి మోగించి టెస్ట్ సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసింది. కోల్ కతాలో జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో కోహ్లీ రెండు రికార్డుల్ని నమోదు చేశాడు. కెప్టెన్ గా అత్యంత వేగంగా 5వేల పరుగులు చేసిన వారి జాబితాకెక్కాడు.  దాంతో పాటు టెస్ట్ సెంచరీ(136) సాధించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్ లో భారత పేసర్లు ఇషాంత్, షమీ, ఉమేశ్ ల ధాటికి కేవలం 106 పరుగులకే 10 వికెట్లు సమర్పించుకుంది. బదులుగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 347/9 డిక్లేర్ చేయగా రెండో ఇన్నింగ్స్ లోనూ బంగ్లాకు భంగపాటు తప్పలేదు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో పుష్కరకాలం తర్వాత అయిదు వికెట్లు దక్కించుకున్నఇషాంత్ శర్మ రెండో ఇన్నింగ్స్ లోనూ నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు వెన్నువిరిచి పండగ చేసుకున్నాడు. అగ్నికి వాయువు తోడైనట్లుగా ఉమేశ్ అయిదు వికెట్లు పడగొట్టడంతో  బంగ్లా జట్టు 195లకే ఆలౌటయి ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. బంగ్లా రెండో ఇన్నింగ్స్ ను ఇషాంత్, ఉమేశ్ లే చక్కబెట్టేశారు. మహ్మదుల్లా రిటైర్డ్ హర్ట్ కావడంతో బ్యాటింగ్ కొనసాగించలేదు. అంతకుముందు మూడు మ్యాచ్‌ల టి-20 సీరిస్‌లో భారత్ 2-1తో బంగ్లాదేశ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.

Friday, November 22, 2019

Sri Lanka's new president picks his brothers into the interim cabinet

మధ్యంతర కేబినెట్‌ను నియమించిన శ్రీలంక కొత్త అధ్యక్షుడు
శ్రీలంక నూతన అధ్యక్షుడు గోటబయ రాజపక్సే శుక్రవారం తాత్కాలిక కేబినెట్‌ను నియమించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల వరకు ప్రభుత్వాన్ని నడపాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆయన మధ్యంతర కేబినెట్ లోకి తన ఇద్దరు సోదరులను తీసుకున్నారు. కొత్త కేబినెట్‌లో ప్రధాని పదవికి ఎంపికైన మహీంద రాజపక్స(74)ను రక్షణ, ఆర్థిక మంత్రిగా కూడా నియమించారు. సోదరులలో పెద్దవాడు చమల్ రాజపక్స(77)ను వాణిజ్య, ఆహార భద్రత మంత్రిగా ఎంపిక చేశారు. 16 మంది సభ్యుల మంత్రివర్గంలో వీరితో పాటు ఇద్దరు తమిళులు, ఒక మహిళ ఉన్నారు. ప్రముఖ మార్క్సిస్ట్ రాజకీయ నాయకుడు దినేష్ గుణవర్ధన (70) విదేశాంగ మంత్రిగా ఎంపికయ్యారు. ప్రస్తుత పార్లమెంటును అధ్యక్షుడు రద్దు చేసి తాజా పార్లమెంటు ఎన్నికలకు వెళ్లే వరకు ఈ కేబినెట్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. తదుపరి పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2020 ఆగస్టు జరగాల్సి ఉంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రస్తుత ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే రాజీనామా చేయకపోతే ఆయనను తొలగించలేరు. అలాగే దేశాధ్యక్షుడిగా ఎన్నికైన గోటబయ రాజపక్సే కేబినెట్ అధిపతి అయినప్పటికీ మంత్రిత్వ శాఖలను నిర్వహించలేరు. సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా గడువుకు ముందే తాజా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయన మధ్యంతర కేబినెట్ నియామకాన్ని చేపట్టారు. శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా గోటబయ రాజపక్సే సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. 52 ఏళ్ల సజిత్ ప్రేమదాసను 13 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఆయన ఓడించారు. గతంలో గోటబయ సైనిక బలగాల అధినేతగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం దేశం  పార్లమెంట్ ఎన్నికల ముంగిట నిలిచిందని స్పీకర్ కరు జయసూర్య ఇటీవల పేర్కొనడం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా పదవి నుంచి వైదొలగాలనే యోచనలో ఉన్నారు. `ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీగా, పార్లమెంటరీ ఎన్నికల గురించి పార్లమెంట్ సభ్యులు, స్పీకర్, పార్టీ నాయకులతో చర్చిస్తాం` అని విక్రమసింఘే కార్యాలయం సోమవారమే ఒక ప్రకటన జారీ చేసింది.

Tuesday, November 19, 2019

Rajya Sabha Chairman ordered review of new Military Style Uniform of Marshals


మార్షల్స్ సైనిక యూనిఫాంపై సమీక్ష: ఉపరాష్ట్రపతి
రాజ్యసభలో కొత్తగా అమలులోకి వచ్చిన మార్షల్స్ యూనిఫాంపై పున:సమీక్షకు చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదేశించారు. సైనిక దుస్తుల తరహాలో మార్షల్స్ యూనిఫాం ఉండడంపై కొందరు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని పరిగణనలోకి తీసుకున్న సభాపతి ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ కు మంగళవారం ఆదేశాలు ఇచ్చారు. రాజ్యసభ సచివాలయం వివిధ సలహాలు పరిశీలించాక మార్షల్స్ కు కొత్త యూనిఫాం అమలు చేసింది. అయితే సైనికయేతర సిబ్బంది సైనిక యూనిఫాంను కాపీ చేయడం, ధరించడం చట్టవిరుద్ధం, భద్రతాపరమైన ప్రమాదమంటూ వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మార్షల్స్ సైనిక దుస్తులు, టోపీ, తలపాగాలను ధరించడంపై  మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వి.పి.మాలిక్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆయన ఈ విషయంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం కోరుతూ ట్వీట్ చేశారు. ఆయనకు పలువురు రిటైర్డ్ డిఫెన్స్ అధికారులు మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెంకయ్య ఈ విషయమై రాజ్యసభ సచివాలయం పున:సమీక్షిస్తుందని సభకు తెలిపారు.

Friday, November 15, 2019

Delhi court directs city police to give 10 days pre-arrest notice to Shehla Rashid in sedition case


షెహ్లా అరెస్ట్ కు 10 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి
దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్న కశ్మీర్ పీపుల్స్ మూవ్ మెంట్ నాయకురాలు షెహ్లా రషీద్ కు ఢిల్లీ కోర్టు బాసటగా నిలిచింది. ముందస్తు బెయిల్ కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన కోర్టు ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేసు ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉందని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐ.ఒ) కోర్టుకు తెలియజేయడంతో ఈ తీర్పు వెల్లడించింది. ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే మాత్రం ఆమెకు 10 రోజుల ముందే విషయాన్ని తెలపాలని పోలీసులకు కోర్టు ఆదేశాలిచ్చింది. ఆగస్ట్ 17న ఆమె ఉద్దేశపూర్వకంగానే దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. జమ్ముకశ్మీర్ ప్రజల్లో విద్వేషభావాల్ని రెచ్చగొట్టేలా షెహ్లా పోస్టులు చేశారని పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. ముఖ్యంగా భారత సైన్యం అక్కడ విచారణల పేరిట యువతను అర్ధరాత్రిళ్లు తరలించుకు వెళ్లి ఇబ్బందుల పాల్జేస్తున్నారంటూ ఆమె ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో షెహ్లా వరుస పోస్టులు పెడుతూ అల్లర్లు ప్రేరేపించేందుకు యత్నించినట్లు కేసు పెట్టారు. ఇదిలావుండగా అరెస్ట్ ను తప్పించుకోవడానికి ఆమె యాంటిసిపేటరీ బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. పోలీసు విచారణకు తమ క్లయింట్ హాజరవుతారని షెహ్లా న్యాయవాదులు తెలిపినా అడిషినల్ సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరా ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు.