Sunday, November 24, 2019

Virat Kohli Credits Sourav Ganguly For Winning Habit and said `Learnt To Stand Up, Give It Back`


గంగూలీ జట్టు నుంచే మాకు గెలుపు అలవాటు అబ్బింది:కోహ్లీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి ఇండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. ఆదివారం కోల్ కతాలో టెస్ట్ సీరిస్ ట్రోఫీని అందుకుంటున్న సందర్భంగా కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. గంగూలీ సారథ్యంలో భారత టీమ్ సాధించిన విజయాల బాటలోనే ప్రస్తుత తమ జట్టు ముందుకు సాగుతోందని కోహ్లీ పేర్కొన్నాడు. గెలుపు అలవాటు దాదా జట్టు నుంచే పుణికిపుచ్చుకున్నామని సవినయంగా తెలిపాడు. మూడు నాల్గేళ్లగా ఏ జట్టుపైనైనా భారత్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శననే చేస్తున్నారన్నాడు. ఈడెన్ గార్డెన్స్ ప్రేక్షకులు తొలి పింక్ బాల్ టెస్ట్ ను అమోఘంగా ఆదరించారంటూ కోహ్లీ వారిపై ప్రశంసల జల్లు కురిపించాడు. బంగ్లాదేశ్ జట్టుపై స్వదేశంలో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ ల సీరిస్ ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి డే అండ్ నైట్ (పింక్ బాల్) టెస్ట్ లో భారత్ జట్టు బంగ్లా జట్టుపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మూడోరోజే విజయభేరి మోగించి టెస్ట్ సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసింది. కోల్ కతాలో జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో కోహ్లీ రెండు రికార్డుల్ని నమోదు చేశాడు. కెప్టెన్ గా అత్యంత వేగంగా 5వేల పరుగులు చేసిన వారి జాబితాకెక్కాడు.  దాంతో పాటు టెస్ట్ సెంచరీ(136) సాధించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్ లో భారత పేసర్లు ఇషాంత్, షమీ, ఉమేశ్ ల ధాటికి కేవలం 106 పరుగులకే 10 వికెట్లు సమర్పించుకుంది. బదులుగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 347/9 డిక్లేర్ చేయగా రెండో ఇన్నింగ్స్ లోనూ బంగ్లాకు భంగపాటు తప్పలేదు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో పుష్కరకాలం తర్వాత అయిదు వికెట్లు దక్కించుకున్నఇషాంత్ శర్మ రెండో ఇన్నింగ్స్ లోనూ నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు వెన్నువిరిచి పండగ చేసుకున్నాడు. అగ్నికి వాయువు తోడైనట్లుగా ఉమేశ్ అయిదు వికెట్లు పడగొట్టడంతో  బంగ్లా జట్టు 195లకే ఆలౌటయి ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. బంగ్లా రెండో ఇన్నింగ్స్ ను ఇషాంత్, ఉమేశ్ లే చక్కబెట్టేశారు. మహ్మదుల్లా రిటైర్డ్ హర్ట్ కావడంతో బ్యాటింగ్ కొనసాగించలేదు. అంతకుముందు మూడు మ్యాచ్‌ల టి-20 సీరిస్‌లో భారత్ 2-1తో బంగ్లాదేశ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment