Friday, November 15, 2019

Delhi court directs city police to give 10 days pre-arrest notice to Shehla Rashid in sedition case


షెహ్లా అరెస్ట్ కు 10 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి
దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్న కశ్మీర్ పీపుల్స్ మూవ్ మెంట్ నాయకురాలు షెహ్లా రషీద్ కు ఢిల్లీ కోర్టు బాసటగా నిలిచింది. ముందస్తు బెయిల్ కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన కోర్టు ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేసు ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉందని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐ.ఒ) కోర్టుకు తెలియజేయడంతో ఈ తీర్పు వెల్లడించింది. ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే మాత్రం ఆమెకు 10 రోజుల ముందే విషయాన్ని తెలపాలని పోలీసులకు కోర్టు ఆదేశాలిచ్చింది. ఆగస్ట్ 17న ఆమె ఉద్దేశపూర్వకంగానే దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. జమ్ముకశ్మీర్ ప్రజల్లో విద్వేషభావాల్ని రెచ్చగొట్టేలా షెహ్లా పోస్టులు చేశారని పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. ముఖ్యంగా భారత సైన్యం అక్కడ విచారణల పేరిట యువతను అర్ధరాత్రిళ్లు తరలించుకు వెళ్లి ఇబ్బందుల పాల్జేస్తున్నారంటూ ఆమె ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో షెహ్లా వరుస పోస్టులు పెడుతూ అల్లర్లు ప్రేరేపించేందుకు యత్నించినట్లు కేసు పెట్టారు. ఇదిలావుండగా అరెస్ట్ ను తప్పించుకోవడానికి ఆమె యాంటిసిపేటరీ బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. పోలీసు విచారణకు తమ క్లయింట్ హాజరవుతారని షెహ్లా న్యాయవాదులు తెలిపినా అడిషినల్ సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరా ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు.

Tuesday, November 12, 2019

President rule in Maharastra today onwards


`మహా`లో రాష్ట్రపతి పాలన
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి సిఫార్సు మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తక్షణం రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. ఎన్నికలు ఫలితాలు విడుదలై 19రోజులు గడిచినా బీజేపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తులతో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురాలేకపోవడంతో గవర్నర్ నివేదన మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తాము తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరింత గడువు ఇవ్వకుండా రాష్ట్రపతి పాలనకు గవర్నర్ కోష్యారి సిఫార్సు చేయడంపై శివసేన నిప్పులు చెరిగింది. ఇందుకు సంబంధించి శివసేన మంగళవారం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. 288 స్థానాలు గల మహారాష్ట్ర అసెంబ్లీలో గడిచిన ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలతో ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన శివసేన 56 స్థానాలు దక్కించుకోగా ఎన్సీపీ 54, పొత్తు పార్టీ కాంగ్రెస్ 44 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇతర పార్టీలు, స్వతంత్రులు 29 స్థానాల్లో విజయబావుటా ఎగురవేశారు. బీజేపీ-శివసేనలు చెరి రెండేళ్లు సీఎంగా అధికారం చలాయించడంపై నెలకొన్న ప్రతిష్టంభనతో తాజాగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తెరపైకి వచ్చింది. ఎన్నికల పొత్తు సమయంలోనే తాము ఈ మేరకు ప్రతిపాదిస్తే బీజేపీ అంగీకరించిందని శివసేన పేర్కొంటోంది. అందుకు ప్రస్తుతం బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఏ పార్టీకి తగిన సంఖ్యాబలం లేక ప్రభుత్వాన్ని స్థాపించలేక పోయాయి. ఇదిలావుండగా గవర్నర్ వైఖరిపై కాంగ్రెస్ మండిపడింది. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని విమర్శించింది. మంగళవారం ఏఐసీసీ సమాచార శాఖ ఇన్ చార్జీ రణ్ దీప్ సింగ్ సుర్జీవాలా విలేకర్లతో మాట్లాడుతూ గవర్నర్ వైఖరిని ఘాటుగా విమర్శించారు. సీపీఎం పోలిట్ బ్యూరో కూడా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని తీవ్రంగా ఖండించింది.

Thursday, November 7, 2019

Telangana registers No.1 spot in STD`s due to the causes of Unsafe sex, diabetes


సుఖ వ్యాధుల్లో తెలంగాణ దేశంలోనే ప్రథమం

తెలంగాణలో ప్రజారోగ్యం అథమ స్థానంలో ఉందనే చేదు నిజం మరోసారి స్పష్టమయింది. సుఖ వ్యాధుల్లో ఆ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఆందోళన కల్గిస్తోంది. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019 నివేదిక ప్రకారం తెలంగాణ తర్వాత స్థానాల్లో వరుసగా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ లు నిలిచాయి. అసురక్షిత లైంగిక కార్యకలాపాలు, మధుమేహం ఇందుకు కారణాలని తేలింది. 2018 లెక్కల ప్రకారం తెలంగాణలో 14,940 సుఖ వ్యాధిగ్రస్తులు నమోదయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో పురుషుల సంఖ్య 4,824 కాగా మహిళలు 10,116 మంది ఉన్నట్లు వెల్లడయింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 12,484 (3,197(పు), 9,287(మ)); మధ్యప్రదేశ్ లో 8,140 (2,042(పు), 6,098(మ); కర్ణాటకలో 3,685 (1,226(పు),2,459(మ); రాజస్థాన్ లో 2,869 (1,161(పు), 1,708(మ)) మంది సుఖ వ్యాధి గ్రస్తులున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తొలి అయిదు స్థానాల్లో ఉన్న రాష్ట్రాల్లో రెండు తెలుగురాష్ట్రాలతోపాటు మొత్తం మూడు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నట్లు తేలడం నివ్వెరపరస్తోంది. అందులోనూ ఈ సుఖవ్యాధుల బారిన పడిన వారిలో మహిళల సంఖ్యే అత్యధికంగా ఉండడం కలవరం కల్గిస్తోంది. ఈ సాంక్రమిక సుఖవ్యాధి(ఎస్.టి.ఐ) బారిన పడిన వారికే ఎక్కువగా హెచ్.ఐ.వి (ఎయిడ్స్) సోకే ప్రమాదం ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తెలంగాణ మొత్తం జనాభాలో 15 నుంచి 20% మంది మధుమేహవ్యాధి పీడితులుండడం వల్ల ఈ ఎస్.టి.ఐ. రోగుల సంఖ్య తెలంగాణలో ఎక్కువగా నమోదవ్వడానికి ప్రధాన కారణమని భారతీయ వైద్య సంఘం (ఐ.ఎం.ఎ) కార్యదర్శి డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ పేర్కొన్నారు.


Friday, November 1, 2019

Rajnath Singh pays tribute to former PM Shastri


నిరుపమాన యోధుడు లాల్ బహుదూర్ శాస్త్రి: రాజ్ నాథ్
పాకిస్థాన్ తో యుద్ధ సమయంలో భారత్ ను సమైక్యంగా పటిష్టంగా నిలిపిన యోధుడు దివంగత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్లాఘించారు. ఉజ్బెకిస్థాన్ లోని తాష్కెంట్ లో పర్యటిస్తున్న రక్షణమంత్రి ఈ సందర్భంగా శుక్రవారం శాస్త్రి స్ట్రీట్ లో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. 1965 భారత్-పాక్ ల యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని శాస్త్రీజీ జైజవాన్ జైకిసాన్ పిలుపు ఓ ప్రభంజనంలా యావత్ దేశాన్ని కదిలించిందని రాజ్ నాథ్ పేర్కొన్నారు. యుద్ధానంతరం 1966 లో యూఎస్ఎస్ఆర్ మధ్యవర్తిత్వంలో భారత్-పాక్ ల మధ్య తాష్కెంట్ లో ఒప్పందం కుదిరింది. సరిగ్గా ఒక రోజు తర్వాత జనవరి 11న శాస్త్రీజీ ఆకస్మికంగా కన్నుమూశారు. శాస్త్రీజీ జీవనశైలి, ఆయన నిరాడంబరత ఆదర్శప్రాయమని రాజ్ నాథ్ కొనియాడారు. శాస్త్రీజీ స్మృత్యర్థం నిర్మించిన పాఠశాలను ఆయన సందర్శించి అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు భారత్ పైన, హిందీ భాష పట్ల కనబర్చిన ప్రేమకు రక్షణ మంత్రి ముగ్ధులయ్యారు. ఈనెల 2,3 తేదీల్లో జరగనున్న ప్రభుత్వాధినేతల (సీహెచ్జీ) సమావేశంలో రాజ్ నాథ్ పాల్గొంటారు. అదేవిధంగా భారత్, ఉజ్బెకిస్థాన్ ల మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాల పైన చర్చలు జరుపుతారు. షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సి.ఒ) కీలక సమావేశంలో రాజ్ నాథ్ పాల్గొననున్నారు.