తెలంగాణలో ప్రజారోగ్యం అథమ స్థానంలో ఉందనే చేదు నిజం
మరోసారి స్పష్టమయింది. సుఖ వ్యాధుల్లో ఆ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి
ఆందోళన కల్గిస్తోంది. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019 నివేదిక ప్రకారం తెలంగాణ తర్వాత
స్థానాల్లో వరుసగా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ లు నిలిచాయి.
అసురక్షిత లైంగిక కార్యకలాపాలు, మధుమేహం ఇందుకు కారణాలని తేలింది. 2018 లెక్కల
ప్రకారం తెలంగాణలో 14,940 సుఖ వ్యాధిగ్రస్తులు నమోదయినట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఇందులో పురుషుల సంఖ్య 4,824 కాగా మహిళలు 10,116 మంది ఉన్నట్లు వెల్లడయింది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 12,484 (3,197(పు), 9,287(మ)); మధ్యప్రదేశ్ లో 8,140
(2,042(పు), 6,098(మ); కర్ణాటకలో 3,685 (1,226(పు),2,459(మ); రాజస్థాన్ లో 2,869
(1,161(పు), 1,708(మ)) మంది సుఖ వ్యాధి గ్రస్తులున్నట్లు లెక్కలు స్పష్టం
చేస్తున్నాయి. తొలి అయిదు స్థానాల్లో ఉన్న రాష్ట్రాల్లో రెండు
తెలుగురాష్ట్రాలతోపాటు మొత్తం మూడు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వ్యాధిగ్రస్తులు
ఎక్కువగా ఉన్నట్లు తేలడం నివ్వెరపరస్తోంది. అందులోనూ ఈ సుఖవ్యాధుల బారిన పడిన
వారిలో మహిళల సంఖ్యే అత్యధికంగా ఉండడం కలవరం కల్గిస్తోంది. ఈ సాంక్రమిక
సుఖవ్యాధి(ఎస్.టి.ఐ) బారిన పడిన వారికే ఎక్కువగా హెచ్.ఐ.వి (ఎయిడ్స్) సోకే ప్రమాదం
ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తెలంగాణ మొత్తం జనాభాలో 15 నుంచి 20% మంది
మధుమేహవ్యాధి పీడితులుండడం వల్ల ఈ ఎస్.టి.ఐ. రోగుల సంఖ్య తెలంగాణలో ఎక్కువగా
నమోదవ్వడానికి ప్రధాన కారణమని భారతీయ వైద్య సంఘం (ఐ.ఎం.ఎ) కార్యదర్శి డాక్టర్
సంజీవ్ సింగ్ యాదవ్ పేర్కొన్నారు.
No comments:
Post a Comment