Friday, October 25, 2019

AP Government released exgratia to the Royal Vasishta Boat victim families


కచ్చులూరు లాంచీ మృతుల కుటుంబాలకు పరిహారం విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచీ మునకలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారాన్ని విడుదల చేసింది. సెప్టెంబర్ 15న పాపికొండల విహార యాత్రకు బయలుదేరిన పర్యాటకులు లాంచీ మునిగిన దుర్ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద విహారయాత్రికులు ప్రయాణిస్తున్న రాయల్ వశిష్ట బోటు మునిగిపోగా 39 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారాన్ని ఏపీ సర్కారు ప్రకటించింది. తాజాగా రెండ్రోజుల క్రితమే మునిగిన లాంచీని కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఘటనా స్థలం నుంచి వెలికితీసింది. ప్రభుత్వం గతంలో ప్రకటించిన మేరకు తొలివిడతలో శుక్రవారం 12 మంది బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున పరిహారాన్ని విడుదల చేసింది. ఏపీ సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) ఫండ్ నుంచి ఈ నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు చెక్కు అందనుంది. బాధిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్ పరిహారాన్ని పంపిణీ చేయనున్నారు.

Wednesday, October 23, 2019

39 bodies found in truck container in London


లండన్ సరకు రవాణా లారీలో గుట్టలుగా శవాలు
ఒళ్లు గగుర్పొడిచే ఘటన బుధవారం లండన్ లో చోటు చేసుకుంది. బల్గేరియా నుంచి నగరంలోకి ప్రవేశించిన ఓ సరకు రవాణా లారీ(కంటైనర్)లో 39 శవాల్ని పోలీసులు కనుగొనడంతో కలకలం రేగింది. లండన్ కాలమానం ప్రకారం ఈ ఉదయం 1.40కి గ్రేస్ లోని వాటర్ గ్లేడ్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాంతంలో ఈ శవాల లారీని గుర్తించారు. బల్గేరియా రిజిస్ట్రేషన్ కల్గిన ఈ భారీ లారీ జీబ్రుగే నుంచి బయలుదేరి థేమ్స్ నదీ పరీవాహక ప్రాంత పట్టణం తుర్రాక్ చేరుకుంది. అక్కడ 35 నిమిషాల సేపు ఆగిన లారీ మళ్లీ నగరం దిశగా ప్రయాణించినట్లు ఎస్సెక్స్ పోలీసులు తెలిపారు. లారీలో భారీ రిఫ్రిజిరేటర్ ను గుర్తించారు. అందులో పెద్ద సంఖ్యలో భయానకంగా ఉన్న శవాల్ని కనుగొన్నారు. ఇందులో 38 మంది వయోజనుల మృతదేహాలతోపాటు ఓ బాలుడి శవం బయటపడింది. వీరంతా దారుణ హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. లారీలో గల ఫ్రిజ్ -25 డిగ్రీల సెల్సియస్ స్థితిలో ఉంది. అందులో ఈ హతుల శవాలను ఉంచి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 25 ఏళ్ల ఈ లారీ డ్రైవర్ ఉత్తర ఐర్లాండ్ వాసిగా పోలీసులు పేర్కొన్నారు. అతణ్ని అరెస్ట్ చేశారు. హతులంతా బల్గేరియా వాసులని భావిస్తున్నారు. లోహంతో తయారైన గాలిచొరబడని లారీలో  తొలుత ఈ 39 మందిని ఉంచి లాక్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వీరంతా మరణించిన తర్వాత ఫ్రిజ్ లో కుక్కిఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం తమ ముందున్న తక్షణ కర్తవ్యం హతుల వివరాలను వెలికితీయడమేనని ఎస్సెక్స్ పోలీసులు తెలిపారు. ఈ లారీకి సంబంధించిన ఏ విషయమైనా తమకు తెలపాలని ప్రత్యక్షసాక్షులకు చీఫ్ సూపరింటెండెంట్ ఆండ్రూ మారినన్ విజ్ఞ‌ప్తి చేశారు. ఇది `అనూహ్యమైన విషాదం.. నిజంగా హృదయ విదారకం`అని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. కేసును ప్రత్యేక నేరపరిశోధన విభాగం దర్యాప్తు చేస్తోంది.

Sunday, October 20, 2019

Cycle rally held in Jammu to promote clean, green Diwali


స్వచ్ఛ దీపావళి కోసం జమ్ముకశ్మీర్ లో సైకిల్ ర్యాలీ
క్లీన్ అండ్ గ్లీన్ దీపావళి కోసం జమ్ముకశ్మీర్ లో ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఉదంపూర్ నుంచి జమ్ము వరకు 65 కిలోమీటర్లు ర్యాలీ కొనసాగింది. ఉదంపూర్ డిస్ట్రిక్ట్ డెవలప్ మెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీలో పదుల సంఖ్యలో సైక్లిలిస్టులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కమిషనర్ పీయూష్ సంఘ్లా పాల్గొనగా ఆయన వెంట పలువురు యువతులు ర్యాలీగా తరలి వెళ్లారు. ఉదంపూర్ నగర వీధుల గుండా కొనసాగిన ర్యాలీ స్లతియా చౌక్, కోర్టు రోడ్డు, రామ్ నగర్ చౌక్, గోల్ మార్కెట్, బస్టాండ్, మినీ స్టేడియంల మీదుగా జాతీయ రహదారిపై ముందుకు సాగుతూ జమ్మూ నగరం చేరుకుంది. మార్గం మధ్యలో కత్రా వద్ద కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ర్యాలీలో పాల్గొనవారిని కలిసి అభినందించారు. ఏటా ఈ తరహా ర్యాలీలను ఉదంపూర్ కమిషనర్ కార్యాలయం నిర్వహిస్తుండడం విశేషం. స్వచ్ఛ దీపావళిని నిర్వహించుకుందామనే పిలుపుతో పాటు బేటీ బచావో, బేటీ పడావో (అమ్మాయిల్ని రక్షిద్దాం.. అమ్మాయిల్ని చదివిద్దాం) అనే చైతన్యాన్ని కల్గించే ఉద్దేశంతో ర్యాలీ జరిగింది.

Saturday, October 19, 2019

At least 10 killed in dam collapse in Russia`s Krasnoyarsk region


రష్యాలో డ్యాం కూలి 10మంది దుర్మణం
రష్యాలో ఓ డ్యాం కుప్పకూలిన దుర్ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన సైబీరియా ప్రాంతంలోని క్రస్నోయార్స్క్ కరాయ్ లో శనివారం వేకువజాము 2 గంటలకు జరిగింది. డ్యాం ఒక్కసారిగా బద్ధలుకావడంతో 10 మంది కొట్టుకుపోయి తీవ్రగాయాలపాలయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో 10 మంది జాడ తెలియడం లేదని అత్యవసర విభాగ మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి. సుకేటిన్కినో కాలనీలో గల బంగారు గనులకు నీటి సరఫరా కోసం నిర్మించిన రిజర్వాయర్ అకస్మాత్తుగా కూలిపోవడంతో ప్రమాదం సంభవించినట్లు స్పుత్నిక్ వార్త సంస్థ తెలిపింది. దాంతో డ్యాం నుంచి పోటెత్తిన వరద నీటితో కాలనీ ముంపునకు గురయింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం సెబా నదిలో భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.